స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్..!?

రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయాలను హై కోర్టు కొట్టి వేయడంతో ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా..? లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే నని, ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అని ప్రతిపక్షం, కమ్యూనిస్టు పార్టీలు అంటున్నాయి. రిజర్వేషన్లపై సుప్రీంకు వెళ్లాలని అడుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అలా అని ఎన్నికలకు ముందుకు వెళ్తే.. హైకోర్టు తీర్పు వల్ల ఉన్న బీసీ రిజర్వేషన్లు తగ్గిపోయాయి.. మరి జగన్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందా.. లేదా మరేదైనా చేస్తుందా..?

అయితే ఈ నెల చివరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు గనుక పూర్తి చేయకపోతే ఆర్థిక సంఘం నిధులు ఐదు వేల కోట్ల రూపాయల మేర మురిగిపోతాయి. అలా అని ఎన్నికలకు వెళ్లాలంటే బీసీల రిజర్వేషన్లు తగ్గుతున్నాయి. సుప్రీంకు వెళ్లే సమయం కూడా లేదు. కాబట్టి ఎన్నికలు తప్పకుండా నిర్వహించాల్సిందే. మరి ఇలాంటి సందిగ్ధ సమయంలో సమావేశమైన మంత్రి వర్గం ఎన్నికల నిర్వహణపై ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరిగినట్లు తెలియడం లేదు.

అయితే గత రాత్రి పంచాయతీరాజ్‌ శాఖ కొన్ని రహస్య జీవోలను జారీ చేసింది. వాటిలో ఏమున్నాయన్నది ఇప్పటి వరకు బైటికి రాలేదు. కేబినేట్ సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయాలు తెలియజేయలేదు. అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి జగన్ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చే వరకు రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయాలు బైటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు జాగ్రత్త పడితే వాటిపై ఎవరూ కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉండదు కాబట్టి… ఎన్నికలను పూర్తిచేయొచ్చనే ఆలోచనలో ఉన్నట్లు ఉంది.

మొత్తంగా కేబినేట్ సమావేశంలో స్థానిక ఎన్నికలపై పెద్దగా చర్చలు చేయకుండా.. సమావేశం ముగిసిన తర్వాత మాత్రం జగన్ మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మంత్రుల నియోజక వర్గాల్లో పార్టీ ఓటమి పాలైతే ఐదు నిమిషాలు కూడా ఆగను.. మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సిందే అంటూ వార్నింగ్ కూడా ఇవ్వడం చూస్తుంటే.. జగన్ సర్కార్ ఈ స్థానిక ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తెలిసిపోతోంది. మరి జగన్ వ్యూహం ఈ ఎన్నికలలో ఎంత వరకు సఫలం అవుతుందో చూడాల్సిందే.