శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

 

అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ ఖతమౌతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తత్వం ఎరిగిన వారెవరూ శాసన మండలి కొనసాగుతుందని భావించ లేదు. అయితే మండలి రద్దు ద్వారా వైసిపి రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే పొందే ప్రయోజనాలు ప్రశ్నార్థకమే. ఏ ప్రయోజనాలైతే ఆశించి శాసన మండలి రద్దు చేస్తున్నారో మూడు రాజధానులకు చెందిన రెండు బిల్లులకు ఈ చర్య ద్వారా వెను వెంటనే విముక్తి లభిస్తుందనే నమ్మకం లేదు. ముఖ్యమంత్రి సహజ నైజమైన మాట తప్పను మడమ తిప్పను అనే సూక్తి మాత్రం అమలుకు వచ్చింది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర పరిశీలించితే ఆయన వ్యవహార శైలి సులభంగా అర్థం చేసుకోగలం. డాక్టర్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత సకుటుంబంగా సోనియా గాంధీని కలిసి వచ్చిన తదుపరి ఓదార్పు యాత్ర మొదలు పెట్టకుండా కొన్నాళ్లు వేచి వుంటే రోశయ్య ముఖ్యమంత్రి అయ్యే వారు కాదని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వారని ఎప్పటి నుండో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఫలితంగా తొమ్మిది సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.

ఇప్పుడు కూడా మూడు రాజధానుల ప్రతిపాదన శాసన మండలి రద్దు చేయడం ముఖ్యమంత్రి రాజకీయ జీవితంలో మరొక కీలక మైన నిర్ణయంగా భావించ వలసి వుంది. వీటి పరిణామం ఏలా వుంటాయో ఇప్పుడే చెప్ప లేము. ముఖ్యమంత్రి లేదా వైసిపి అధిష్టాన వర్గం ఆలోచన ఏలా వుందో ఏలాంటి ప్రయోజనం ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారో పక్కన బెడితే మూడవ పక్షంగా ఆలోచించితే మున్ముందు రాజకీయంగా ఎంతో కొంత నష్ట పోవడం ఖాయం.

మరో వేపు ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న టిడిపి నేతలు వెంటనే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ కుండా మరింత కట్టడికి పరోక్షంగా వారికి అవకాశం ఇచ్చినట్లయింది. అదే సమయంలో వైసిపి ఆపరేషన్ ఆకర్ష్ కు తమ నేతలు లొంగ లేదని టిడిపి అధిష్టాన వర్గం చెబుతోంది. పదవులు పోగొట్టు కుంటున్న టిడిపి నేతలు మున్ముందు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు సన్నగిల్లాయి. ఒక వేళ వైసిపిలోనికి వెళ్లినా పదవులు ఇచ్చేందుకు అవకాశం లేదు. వాస్తవంలో చట్ట సభకు చెంది దాదాపు నలభై పదవులు మండలి రద్దు ద్వారా వైసిపి పోగొట్టుకున్నది. ఏ ప్రాంతీయ పార్టీకి ఇది మంచి చేయదు. మున్ముందు పార్టీ ఫిరాయింపులకు ముఖ్యమంత్రి పూర్తిగా తలుపులు మూసి వేశారు.

ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు నెత్తిన పాలు పోసినట్టు భావించాలి. ఎమ్మెల్యే స్థాయిగల నేతలు ఎవరైనా ఏ పార్టీ కైనా ఫిరాయిస్తున్నారంటే. పదవుల ఆశతో తప్ప పార్టీ సిద్థాంతాలు మెచ్చి కాదు. శాసన మండలి రద్దు ద్వారా ఈ అవకాశం చేజారి పోయింది. టిడిపి ఎమ్మెల్సీలు ప్రస్తుతానికీ నిజాయతి పరులుగా ప్రస్తుతింప బడుతున్నారు. ప్రస్తుతం వైసిపి అధికారంలో వుంది కాబట్టి ఇప్పట్లోవైసిపికి చెందిన వారెవరూ బయట పడక పోవచ్చు. అయితే ఖచ్చితంగా ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అధిష్టాన వర్గం చవి చూడక తప్పదు. కాని మున్ముందు మండలిలో కాలయాపన జరిగిన తదుపరి అయినా బిల్లులు తిరిగి మండలి ముందుకు వచ్చినప్పుడు వైసిపి ఆపరేషన్ ఆకర్ష్ ఆయుధం ప్రయోగించితే పదవులు పోయిన బాధతో తాయిలాలకు టిడిపి ఎమ్మెల్సీలు లొంగే అవకాశం లేక పోలేదు. ఇదే జరిగితే టిడిపికి రెండు విధాల నష్టం వుంటుంది. ఈ ఆలోచనతోనే వైసిపి అధిష్టాన వర్గం మండలి రద్దుకు సిద్ద పడిందేమో. .

మరో వేపు ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక సంవత్సరం వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా వుంటే ఇసుక కొరతలాంటి అంశాల్లో జాగ్రత్త పడి వుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీధుల్లోనికి వచ్చేందుకు ప్లాట్ ఫారం కూడా వారికి దొరికేదే కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి స్థిర పడిన తర్వాత ఈ మార్పులకు తల పడి వుండ వలసినది. మరి వైసిపి అధిష్టాన వర్గం ఆలోచన ఏమిటో తెలియదు. గాని శాసన మండలి రద్దు ఫలితంగా స్వంత పార్టీ నేతలనే సంత్రుప్తి పర్చడం అసాధ్యం. గత ఎన్నికల సమయంలో హామీలు పొందిన ఆశావహులు ప్రస్తుతం అందరి కన్నా ఆవేదన చెందుతున్నారు. వీరిలో కొందరు ఇదివరకే ముఖ్యమంత్రిని కలసి మనసులోని మాట చెవిలో వేసి రావాలని ఉబలాట పడినా అట్టి అవకాశం లభించలేదని ప్రచారంలో వుంది. . తుదకు ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్ దొరకనపుడు తమకు ఏలా లభిస్తుందని కొందరు సమాధాన పడ్డారట. ఈ నేపథ్యంలో మండలి రద్దు వార్త టిడిపి నేతల కన్నా వైసిపికి చెందిన ఆశావహులకు అశని పాతంలా తగిలిందంటున్నారు .

ఇక బిల్లులను శాసన మండలి తిరస్కరించి వుంటే మరొక మారు శాసన సభ ఆమోదించి మండలికి పంపి వుండేది. అందుకే మండలిలో మంత్రులు బిల్లులు తిరస్కరించమని డిమాండ్ చేశారు . రెండవ మారు కూడా మండలి ఆమోదం పొందక పోతే తిరిగి శాసన సభ ఆమోదించితే బిల్లులు చట్టం అవుతాయి. ఆ అధికారం శాసన సభకు వుంది. అందుకే టిడిపి వ్యూహాత్మకంగా కాలయాపన చేసేందుకు సెలక్ట్ కమిటీకి పంపించింది. మండలి రద్దు వ్యవహారం కేంద్రం వద్ద వున్నా రాష్ట్రంలో ఈ తతంగం సాగుతూ వుంటుంది. ఏది ఏమైనా కొద్ది నెలల తర్వాత అయినా మూడు రాజధానుల బిల్లులు చట్టం కాక తప్పదు. ఈ లోపు కేంద్రం వైఖరి కోర్టుల జోక్యం ముఖ్యమంత్రి ఎదుర్కొనక తప్పదు.

వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు 9848394013