ప్రత్యేక హోదా – పార్టీల విధానాలు –  అమలుచేస్తున్న వ్యూహాలు

ప్రత్యేక హోదా – పార్టీల విధానాలు –  అమలుచేస్తున్న వ్యూహాలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు జరుగుతున్న ప్రధానమైన చర్చ ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఎవరు ఇవ్వాలి, ఎవరు తీసుకురావాలి, ఎవరు పోరాడాలి, ఎలా పోరాడాలి ఎక్కడ పోరాడాలి అనే మౌలికమైన ప్రశ్నలక మీద భిన్నాభిప్రాయాలు వ్యకతమౌతున్నాయి . వున్న రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఎవరికి వారు తామే హోదా ఛాంపియన్స్ అని భావించడం, మిగతా పక్షాలు తన దారిలోకి వచ్చి తమ పోరాటానికి మద్దతు తెలపాలని  అని డిమాండ్ చెయ్యటం, ప్రధాన పక్షాలు ఎవరు ఎవరితో కలిసే వాతావరణం లేకపోవడంతో ప్రజాభిప్రాయం ఎంత బలంగా వున్నా ఉద్యమ వేడి కేంద్రాన్ని తాకే అవకాశం ఏర్పడడం లేదు .

రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పటి కేంద్ర పాలక ప్రతిపక్షాలు  తాము చేస్తున్న సహకరిస్తున్న అశాస్త్రీయ విభజ వల్ల విబజిత రాష్ట్రా ప్రజలకి జరిగే నష్టాన్ని కొంచెమైనా పూడ్చడానికి పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. ఈ రాష్ట్ర ప్రజలు కానీ వారికి అప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ డిమాండ్ చేసి సాధించుకున్న హామీ హక్కేమి కాదిది. ఆ మాటకు వస్తే కొందరు పారిశ్రామికవేత్తలకు  తప్ప మెజారిటీ రాష్ట్ర ప్రజలకు హోదా అనేది ఒకటుందని , దాని వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలియదు. హోదా హామీ ఇచ్చిన ఇవ్వకపోయినా రాష్ట్ర విభజనకి ఏమాత్రం అడ్డంకి ఉండేది కాదు ఆలా అని ఎన్నికల్లో కాంగ్రెస్ తల రాత మారేది కాదు . ఇది ఒక విధంగా రాష్ట్ర ప్రజలకి సర్ప్రైజ్ ప్యాకేజీకిందే లెక్క కేంద్రం లోని పక్షాలు వారికీ వారుగా తాము చేస్తున్న అన్యాయానికి  తమ హయం చివరిలో యూపీఏ ఎన్డీయే డిమాండ్ మేరకు ఇచ్చిన హామీ. అధికారపక్షం మరి ప్రతిపక్షం కలిసి పార్లమెంట్ లో చేసిన నిర్ణయం కనుక ఒక విధంగా దేశం మొత్తం కలిసి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా .

హామీ ఇచ్చారు. పార్లమెంట్ గడువు ముగిసింది . ఎలక్షన్స్ వచ్చాయి ప్రభుత్వాలు మారాయి . పార్లమెంట్ లో హోదా ని గట్టిగా  డిమాండ్ చేసిన బీజేపీ, విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెదేపా కలిసి ఎన్నికల్లో పోటీ చేసాయి . కలిసి పోటీ చెయ్యడమే కాకుండా కలిసి అనేక హామీలు ఇచ్చారు అందులో ప్రధానమైంది హోదా హక్కు ని ఐదు ఏళ్ళు కాదు పదేళ్లు చేస్తాము అని భాజపా చెప్పడం. తెదేపా పది కాదు పదహైదు ఏళ్ళు కావలి అని విజ్ఞాపించడం,  అది విన్న, చూసిన ప్రజలు ఆ కూటమి వస్తే అనుభవం కలిగిన పార్టీ కేంద్రంతో వున్నా చెలిమితో పదహైదు ఏళ్ల హోదా అలవోకగా సాధిస్తుంది అని భావించారు. అనుభవానికి అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ప్రజాభిప్రాయం వెల్లడైంది . రాష్ట్ర ప్రజలు కోరుకున్న కొండల్లో వర్షం పడినట్టు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో భాజపా తెదేపా సంపూర్ణ సంఖ్యా బలంతో అధికారం చేప్పట్టాయి.  అయినా మిత్రధర్మం పాటిస్తూ అటు రాష్ట్రము లో ఇటు కేంద్రం లో అధికారం పంచుకున్నారు .

ఇంతటి అనుకూలమైన వాతావరణంలో ప్రత్యేక హోదా చిటికెలో పని అన్నట్టు, హరిహరాదులు దిగి వచ్చి అడ్డుపడినా హోదా వచ్చి తీరుతుందని అనుకున్న వేళా , హామీ ఇచ్చిన వాళ్ళు అలవోకగా సాధించగలిగి , నెరేవేర్చగలిగే స్థానాల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రత్యేక హోదా ఇంత జటిలమైన సమస్య గా తయారైంది? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు  ఇచ్చిన హామీ ని ఎందుకు నెరవేర్చడం లేదు , ఎందుకు సాధనకై ఈ నాలుగేళ్లు కాలయాపన చేశాయి . ఈ అంశం పై రాష్ట్ర అధికార పక్షం, ప్రతిపక్షం , ఇతర పార్టీలు , ప్రజాసంఘాలు అవలంబిస్తున్న విధానాలు, అమలుచేస్తున్న వ్యూహాలు , పార్టీల స్వప్రయోజనాలను విశ్లేషించడమే ఈ వ్యాసం ప్రధాన లక్ష్యం.

ప్రత్యేక హోదా హామీ కోసం పార్లమెంట్ లో గట్టిగా వాదించి  అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐదు ఏళ్ళు ఇస్తాం అంటే లేదు పది ఏళ్ళు ఇవ్వండి, ఒక వేళా మీరు ఇవ్వకుంటే వచ్చేది మా ప్రభుత్వం మేమె ఇస్తాం అని గట్టిగా పార్లమెంట్ సాక్షి గా ఆంధ్ర ప్రజలకి ఒక ఆశ కల్పించి  వాళ్ళ దృష్టి లో ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసం గట్టిగా కృషి చేసిన పార్టీ గా నిలబడిన భాజపా తర్వాతి కాలంలో ఎన్నికల ప్రచారాల్లో పదేళ్ల హోదా అని విస్తృతంగా ప్రచారం చేసిన భాజపా గురుంచి మొదటగా చర్చిద్దాం.

2014 సాధారణ ఎన్నికల్లో భాజపా గత 25 ఏళ్లలో ఏ పార్టీ సాధించానని స్థానాలు సాధించింది. ఒంటరిగా అధికారం చేప్పట్టాడానికి సరిపడ స్థానాలు . ఊహించని ఫలితాలు  తో భాజపా కి ఊహించని బలం చేకూరింది . ఎంత బలం అంటే ఒక్క సంతకం తో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చేంత. కానీ ఎందుకనో ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కానీ అదే సమయంలో పోలవరం భూసేకరణ సజావుగా సాగడం కోసం  తెలంగాణ లోని కొన్ని మండలాలని ఒక ప్రత్యేక ఆర్డినెన్సు తో ఆంధ్రప్రదేశ్ లో కలిపేసింది . ఒకటి ఇచ్చారు ఒకటి అట్టి పెట్టుకున్నారు . దీని వెనుక ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలకి ఒక సంకేతం వుంది. మేము (భాజపా) అవును అనుకుంటే ఏమైనా చెయ్యగలం కాదు అనుకుంటే ఏదైనా ఆపగలం అని. మరి ఆయా ప్రభుత్వాలు దీన్ని గమనించాయో లేదో తెలియదు లేకుంటే, కేంద్రంతో మొదటి ఏడాదే గొడవలెందుకని తెలిసిన తెలియనట్టు ఉన్నాయో చెప్పలేము.

గత ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించిన నిర్ణయమే కాబట్టి పోలవరం ఆర్డినెన్సు లోనే  ప్రత్యేక హోదా కూడా ఇచ్చివుండొచ్చు. కానీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని ఆనాడు కేంద్ర ప్రభుత్వం లో వున్నా రాష్ట్ర నాయకులూ నోరు మెదపలేదు. కేంద్ర ప్రభుత్వ హానిమూన్ పీరియడ్ కదా అని ఇతరులు ఎవరు దీని మీద మాట్లాడిన సందర్భం కూడా లేదు. కొత్త కాపురంలో  వుండే మొహమాటలతో మొదటి ఏడాది వెళ్లదీశారు . ఈ లోపు కేంద్రం శికండి లాంటి పద్నాల్గవ ఆర్ధిక సంఘాన్ని ప్రత్యేక హోదా కి అడ్డు వేసింది. అన్నింటికీ ఆర్థికసంఘాన్ని సాకుగా చూపారు . అక్కడికి అదేదో ప్రధాని మరియు పార్లమెంట్ కంటే ఉన్నతమైనది అన్నట్టు. బీహారుకి లక్ష కోట్లు ప్యాకేజీ ప్రకటించినప్పుడు కానీ లేకుంటే ప్రత్యేక హోదా వున్నా రాష్ట్రాలకి దాన్ని  పొడిగించినప్పుడు కానీ భాజపాకి ఆర్ధిక సంఘం సూచనలు అడ్డురాలేదు.

తెల్లవారే వరకు వుంటే ఏదో  ఉపద్రవం వస్తుంది అన్నట్టు అర్ధరాత్రి పూట  ఆర్ధిక మంత్రి ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించారు . చిత్తశుద్ధి వుండి వుంటే కనీసం ప్యాకేజికైనా చట్టబద్దత కల్పించేవారు . కానీ కల్పించలేదు . హోదా చట్టంలో లేదు కాబట్టి ఇవ్వలేదు అన్నవాళ్ళకి ప్యాకెజీ ని చట్టం చెయ్యాలని ఎందుకు అనిపించలేదో  భాజపా లోని మేధావులు చెప్పాలి. మొత్తని ప్యాకేజీ ఇచ్చారు. తెదేపా భాజపా ఒకరిని ఒకరు కీర్తించుకున్నారు సన్మానించుకున్నారు. రాష్ట్రానికి ఈ ప్యాకేజి వాళ్ళ నష్టం అన్న వాళ్ళని అదిలించారు బెదిరించారు అభివృద్హి వ్యతిరేకులు అని మీడియా అండతో నోళ్లు మూయించారు, రాష్టానికి హోదాకంటే ఎక్కువ వచ్చేసిందని డప్పు కొట్టించారు .

కేంద్రం ఏదైనా రాష్ట్రానికి సాయం చేస్తే, అదీ  గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీ లో పావు వంతు చేస్తే అదేదో ఈ రాష్ట్రానికి తాము మాత్రమే చేసిన ఒక గొప్ప మేలు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు . కేంద్రం లో వున్నా రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్దాయన్ని ఊరూరా తిప్పి సన్మానం చేసారు . చేసే వాళ్ళు ఏదో చేసారు అనుకుంటే ఈయన ఎందుకు చేయించుకున్నారో ఎంత బుర్రబద్దలు కొట్టుకున్న  అర్ధంకాదు .రూపాయి రావలసిన దగ్గర పది పైసలు సాధించుకున్నందుకు ఈ సన్మానం కాబోలు అని జనాలు సరిపెట్టుకున్నారు. ఈ పెద్దాయన అన్ని సన్మాన సభల్లో మీకు ప్రత్యేక హోదా కంటే ఎక్కువే ఇచ్చాము కాబట్టి ఇంకా మీ జీవితాలు తెల్లారిపోయినట్టే అని సెలవిచ్చారు . ప్రత్యేక హోదా వల్ల ఎంత మేలు అని ఎలా లెక్కించారో ఆయనకే తెలియాలి .

ప్రత్యేక హోదా వల్ల  ఒక కంపెనీ ఈ రాష్ట్రానికి వస్తే అందులో  ఎంత మంది పనిచేస్తారు , వాళ్లకు ఎంత జీతాలు వస్తాయి, ఆ జీతాలు వాళ్ళు ఖర్చుబెడితే ఎన్ని కుటుంబాలకి పరోక్ష ఉపాధి దొరుకుతుంది,ప్రధాన కంపెనీలకు అనుబంధంగా వెలిసే హోటల్ రెస్టారంట్ మాల్స్ పెరిగే అద్దె ల వలన  ఆ ప్రాంతం ఎంత ఆర్ధిక ప్రగతి సాధిస్తుంది అని ఎలా లెక్క కడతారు. సరాసరి నెలకు నలభై వేలు జీతం తో వీళ్ళు వైజాగ్ సమ్మిట్ లో చెప్పినట్టు ఇరవై లక్షల్లో పావు వంతు అంటే ఐదు లక్షలు ఉద్యోగాలు వచ్చినా ఏడాది కి పాతికవేలు కోట్లు జీతాల రూపంలో ఈ రాష్ట్ర యువతకి వచ్చేది, ఈ రాష్ట్రములోనే ఖర్చయ్యేది . రాష్ట్రము ఎంత ప్రగతి సాధించేది ? కొండలు గుట్టలు వున్నా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్  లాంటి రాష్ట్రాల జిడిపి ప్రత్యేక హోదా వల్ల ఐదు రేట్లు పెరిగితే 1300 కిలోమీటర్ల మేర తీరా ప్రాంతమున్న ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఆ అభివృద్ధి ఊహించగలమా ? దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ నిపుణులు తయారయ్యే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే జరిగే మేలుని ఎలా లెక్కగట్టగలిగారు?

ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్ర ప్రదేశ్ లో భాజపాకి రాజకీయంగా ఎంతోకొంత మేలు జరుగుతుంది అని తెలిసి కూడా ఎందుకు ఇవ్వలేదు . కలిసి పోటీ చేసిన భాగస్వామి విడిపోతున్న ఎందుకు పట్టించుకోలేదు.

కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు అద్నహ్రా ప్రదేశ్ కి ప్రత్యేక హోదా లేదంటే మరేదైనా పారిశ్రామిక వెసులుబాట్లు కల్పించవద్దని కేంద్రానికి విన్నవించాయి. మోడీ కి ఇవ్వాలనుకుంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వున్నా రాష్ట్రము చెబితే ఆగిపోతాడా. పోనీ తమిళ నాడు తీసుకుంటే జయలలిత గారు పోయిన తర్వాత అక్కడున్న రెండు పార్టీ లు మోడీ సిట్ అండ్ సిట్ స్టాండ్ అంటే స్టాండ్  పార్టీలు . కాబట్టి తమిళనాడుతో వచ్చిన ముప్పేమీ లేదు. ఏదో ఒక సందర్భంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ , గుజరాత్ , మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదాని మాకు ఇవ్వండి లేకుంటే ఆంధ్ర ప్రదేశ్ కి కూడా ఇవ్వొద్దు అని ఒక డిమాండ్ పెట్టాయి . ఈ నాలుగు రాష్ట్రాల్లో భాజపాకి రాజకీయంగా ఏంటో కీలకమైన రాష్ట్రాలు . ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా భాజపా ప్రభుత్వాలని ఏర్పాటు చెయ్యాలని అమిత్ షా మోడీ పట్టుదలగా వున్నారు. మమతా మరియు నవీన్ పట్నాయక్ మీద ఎంతో కొంత ప్రభుత్వ వెతిరేకత వుంది.ఇటువంటి సమయంలో నవీన్ పట్నాయక్ కి గాని మమతా బెనర్జీకి గాని ఒక కొత్త ఆయుధం, ఒక కొత్త నినాదం, ఒక కొత్త సెంటిమెంట్ వాళ్ళ చేతికి ఇవ్వడానికి భాజపా సిద్ధంగా లేదు. అక్కడి ప్రభుత్వాలని పడగొట్టి బాజపాని నిలబెట్టడానికి ఇదే సరైన తరుణం అని భావిస్తుంది. అలాగే గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ లో భాజపాని తిరిగి  అధికారంలోకి తీసుకురావాలి . వస్తేనే 2019 సాధారణ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అధిక ఎంపీ స్థనాలని సాధించగలుగుతుంది. ఆ విధంగా దేశ వ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా, 2019 లో తిరిగి అధికారంలోకి రావడాన్ని అన్ని ప్రయత్నాలు చేస్తున్న భాజపా ఎందుకు అనవసరంగా ప్రత్యేక హోదా అనే ఒక తేనె తుట్టుని కదుపుతుంది .

ఆ అవసరం కూడా భాజపాకి లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో భాజపా సొంతంగా ఇప్పుడు  ఒకటి రెండు సీట్లకంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు. పొత్తుల మీద ఆధారపడిన పార్టీ. కాబట్టి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ కి సంభందించిన వరకు జరిగే నష్టం శూన్యం . ఆంధ్ర ప్రదేశ్ లో వున్నా రెండు ప్రాంతీయ పార్టీల్లో ఏదో ఒక పార్టీ  ఎన్నికలు తర్వాత భాజపా కి మద్దతు ఇస్తుందని భాజపా నమ్మకం అది వాస్తవం కూడా. ఆంధ్ర ప్రజల దురదృష్టం ఏంటంటే ఇక్కడి ప్రభత్వ అధినేత మరి ప్రతిపక్ష నేత అత్యంత బలహీనమైన స్థానాల్లో ఉండటం . ఇటువటిని పరిస్థితుల్లో వీళ్లిద్దరు ఎన్ని దీక్షలు  చేసిన వాటి సెగ కేంద్రానికి తగలకుండానే చేస్తారు . అటువంటప్పుడు భాజపా ఎందుకు ఇస్తుంది. ఇది దేశం మొత్తం రాష్ట్రానికి చేసిన ఒక వాగ్దానం కాబట్టి ఇవ్వాలి అని ఎవరైనా అనుకోవొచ్చు. కానీ మన మరచిపోకూడని విషయం ఏంటంటే భాజపా ఒక సగటు రాజకీయ పార్టీ అందులో వున్నది సగటు రాజకీయ నాయకులు . వారికి ప్రజల సంక్షేమం  కంటే వారి పార్టీ సంక్షేమమే ముఖ్యం. మన ప్రజల సంక్షేమం పట్టని పార్టీ మనకి అవసరమో లేదో ప్రజలు తేల్చుకోవాలి