బియ్యం ఎటిఎం వచ్చేసిందోచ్

ఎటిఎం లుండేది బ్యాంక్ ఖాతాదారులకు బ్యాంకు బయట నగదు అందుబాటులోకి తెచ్చేందుకు. ఇవి ప్రపంచమంతా సర్వసాధారణమయ్యాయి. ఈ మధ్య చాలా దేశాలలో మంచినీళ్ల ఎటిఎంలు వచ్చాయి. పేద వాళ్లకు మంచినీళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు  హైదరాబాద్ లో కూడా మంచినీటి నీళ్ల  ఎటిఎంలను ఏర్పాటుచేశారు.

అయితే, ఇండోనేషియాలోని ఈ ఎటిఎంలు మరొక వింత. ఈ ఎటిఎంలు నగదు ఇవ్వవు, మంచినీళ్ల అందివ్వవు. ఇవి ఏకంగా బియ్యం ఇస్తాయి.

ఈ రైస్ ఎటిఎం (ఎటిఎం బేరాస్) ను పేదవారి కోసం ఇండోనేషియా టౌన్ టాంజెరాంగ్ లోని ఒక మసీదు సమీపంలో ఏర్పాటుచేశారు. తర్వాత ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా కూడా దేశంలో అనేక ప్రాంతాలలో ఈ  రైస్ ఎటిఎం లు వచ్చాయి. ఈ ఎటిఎంలు దాదాపు 250  లీటర్ల పైబడి రైస్ ను నిల్వ ఉంచుతాయి. పేదలకు మన రేషన్ కార్డుల్లాగా రైస్ ఎటిఎంకార్దులందిస్తారు. వారంలో ఒక కార్డు హోల్డర్  ఒకసారి బియ్యం తీసుకోవాల్సి  ఉంటుంది. ఒక్కొక్క కార్డుకు అయిదు లీటర్లు బియ్యం అందుకోవచ్చు.  మామూలు కార్డులాగానే   రైస్   ఎటిఎం కార్డును  స్వైప్ చేస్తే బియ్యం వస్తాయి. అంతేకాదు, ఈ  ఎటిఎం నిర్వహించేందుకు ఖర్చవుతుంది కాబట్టి పక్కనే ఒక డొనేషన్ బ్యాక్స్ కూడా ఏర్పాటు చేశారు. పేదలకు ఏర్పాటయిన బియ్యం ఎటిఎం ప్రపంచంలో ఇవే మొదటివి.

పౌరసరఫరాల వ్యవస్థలో అవినీతిని నిర్మూలించేందుకు రైస్ ఎటిఎం లు బాగా పనికొస్తాయి. పిలఫరేజ్ లేకుండా, చౌకదుకాణదారుల అక్రమాలు లేకుండా, పౌరసరఫరా శాఖ అధికారుల చేతివాటం లేకుండా చేసేందుకు ఈ ఎటిఎంలు చక్కటి పరిష్కారం. భారతదేశంలో పౌరసరఫరా వ్యవస్థలను సంస్కరించేందుకు కోట్లు ఖర్చు పెట్టి అధ్యయనాలు చేస్తున్నారు, పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు తెస్తున్నారు. వీటివల్ల ఈ వ్యవస్థలో అవినీతి అంతమయ్యే సూచనలు కనిపించడం లేదు. కాడికాడివి, కల్లం కాడివి కూడా బొక్కేసే పందికొక్కులున్నదేశం ఇది. అందవల్ల అనుకూలమయిన చోటల్లా ఇలా  చౌకదుకణాల లాగా నిత్యావసర సరుకుల ఎటిఎంలు ఎందుకు ప్రవేశపెట్టరాదు? ప్రభుత్వాలు ఆలోచించాలి.

 

ఇదిగోె ఇదే ఒక  రైస్ ఎటిఎం