బాబు వద్దంటే క్యాడర్ కావాలంటోంది!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగమ్మోహన్‌రెడ్డి దెబ్బతో టీడీపీ ఏపీలో దయనీయ స్థితికి చేరుకుంది. ఆ పార్టీని ప్రస్తుత గండం నుంచి గట్టెక్కించాలంటే జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగాల్సిందేనన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. టీడీపీ క్యాడర్ కూడా అదే కోరుకుంటోంది. కానీ చంద్రబాబు మాత్రం జూనియర్ పేరు తెరపైకి వచ్చిన ప్రతీ సారి తన వర్గం నేతలతో జూనియర్ అవసరం పార్టీకి లేదని, జూనియర్ లేకపోయినా పార్టీ మనగలుగుతుందని చెప్పిస్తూ కాలం గడిపేస్తున్నారు. గతంలో జూనియర్‌ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న చంద్రబాబు ఆ తరువాత ఎక్కడ తన సీటుకు ఎసరు తెస్తాడోనని పక్కన పెట్టేశాడు.
జూనియర్ ఎన్టీఆర్‌కి టైమొచ్చిందా?
అయితే ఇటీవల ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితిని గమనించిన పార్టీ కార్యకర్తలు మాత్రం జూనియర్ పార్టీకి అవసరమని, తను పార్టీలోకి రావాల్సిందేని పట్టుబడుతున్నారు. అయితే బాబు మాత్రం జూనియర్ కు వ్యతిరేకంగా ఎవరో ఒకరి చేత ప్రకటనలు చేయిస్తూనే వున్నాడు. ఇటీవల జూనియర్ అవసరం వుందని కార్యకర్తలు నినదిస్తుంటే బాలయ్య చిన్నల్లుడు భరత్ మాత్రం జూనియర్ పార్టీకి అవసరం లేదని చెప్పడం సంచలనం సృష్టించింది. రాను రాను పార్టీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారుతుండటంతో కార్యకర్తల్లో సహనం నశిస్తోంది. ఇటీవల నారా లోకేష్‌ని కూడా నిలదీయడంతో పరిస్థితిలో మార్పు మొదలైనట్టు కనిపిస్తోంది.
తండ్రి కొడుకులు డబుల్ గేమ్
జూనియర్ అవసరం పార్టీకి లేదని గత కొంత కాలంగా చెబుతూ వచ్చిన నారా లోకేష్ తాజాగా స్వరం మార్చి పార్టీలోకి ఎవరైనా రావచ్చు అంటూ కొత్త స్వరం వినిపించారు. జూనియర్ విషయం నాన్న చూసుకుంటున్నారని, అది వారిద్దరికి సంబంధించిన విషయమని జూనియర్ అవసరం పార్టీకి వుందనే సంకేతాల్ని అందించడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదిలా వుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ చర్చతో సంబంధం లేకుండా `ఆర్ ఆర్ ఆర్` చిత్రీకరణ పనుల్లో నిమగ్నమైపోయాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. అయితే పొంతన లేని ప్రకటనలతో తండ్రి కొడుకులు డబుల్ గేమ్ ఆడుతున్నారా? అన్న చర్చా ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానుల్లో సాగుతోంది.