ముఖ్యమంత్రిగా జగన్ ఆరునెలల పూర్తి చేసుకున్నారు. 2019 మే 30వ తేదీన ప్రమాణస్వీకారం చేసి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. జగన్ ఆరు నెలల పాలనపై ఓ విశ్లేషణ… ఒక్కడు.. ఒంటరిగా వచ్చాడు. కోట్లాది మంది జనం అతని వెంట నడిచారు. ప్రజా సంకల్పంతో తాను గెలిచాడు. కోట్లాది మంది ప్రజలను తన గెలుపులో భాగస్వామిని చేశాడు. వైయస్‌ఆర్‌సీపీ అధినేత (గా ఎనిమిదేళ్ల ప్రయాణం. ఏపీప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పోరాటం. ఇలా అన్నింటిలో ఆయన అడుగులు తడబడలేదు. స్వయంకృషిని నమ్ముకున్నాడు. పొత్తుల ప్రస్తావనే లేకుండా.. ఒంటి చేత్తో పార్టీని గెలిపించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తనదైన సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేని వారిని వైయస్ జగన్ తన తండ్రి కోసం గుండెలాగిన కుటుంబాలను పలకరించేందుకు ప్రజా సంకల్ప యాత్ర కోసం బయల్దేరాడు. ఆ దారికి కాంగ్రెస్ హైకమాండ్ అడ్డుపడింది. మహానేత వైయస్‌ఆర్ మరణవార్త తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాల్లో ధైర్యం నింపేందుకే ఈ యాత్ర అని చెప్పేందుకు ప్రయత్నించినా దానికి ఆ పార్టీ అధ్యక్షురాలు నో.. చెప్పడంతో చనిపోతూ తన తండ్రి ఇచ్చిపోయిన ఆపార్టీ బాధ్యతలను పక్కన పెట్టి పార్టీకి రాజీనామా చేశాడు వైయస్ జగన్. అప్పుడు మొదలైన అడుగు పదేళ్ల పాటు ఎన్నో ముళ్లకంపలను దాటుతూ వచ్చింది.
ఎవరూ ఊహించని రీతిలో 151 సీట్లు సాధించిన వైయస్ జగన్ 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పాలనా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాల్లో 80 శాతం నెరవేర్చారు. మేనిఫెస్టోలోని హామీలే కాదు.. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు.
వృద్ధుల పెన్షన్ పెంపు మొదలుకొని ఉద్యోగాల విప్లవం, వైయస్‌ఆర్ రైతు భరోసా, వైయస్‌ఆర్ వాహనమిత్ర, అమ్మ ఒడి మొదలుకొని మత్స్యకారులకు వైయస్‌ఆర్ భరోసా వరకు అనేక సంక్షేమ పథకాలను ఆరు నెలల కాలంలోనే అమలు చేసి చూపించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంతోపాటు ఎన్నో కుటుంబాలను బుగ్గిపాలు చేస్తున్న మధ్యపాన నిషేధానికి నడుం బిగించి తాను మాటల మనిషి కాదని చేతల ద్వారా నిరూపించుకున్నారు. సీఎం మా ఇంటి మనిషి అని ప్రతీ కుటుంబం అనుకునేలా పాలన సాగిస్తున్నారు.