చంద్రన్న రాక.. ఒళ్లు మర్చిపోయిన తెలుగు తమ్ముళ్లు 

 

చంద్రన్న రాక.. ఒళ్లు మర్చిపోయిన తెలుగు తమ్ముళ్లు 

 
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుగారు 65 రోజుల తర్వాత ఈరోజే ఏపీలో అడుగుపెట్టారు.  లాక్ డౌన్ ముందు హైదరాబాద్ నగరంలో ఉన్న ఆయన నిబంధనల కారణంగా రెండు నెలలు అక్కడే ఉండిపోయారు.  ఆయన రాష్ట్రంలో లేని ఈ రెండు నెలల సమయంలో చాలానే జారిగాయి.  దూరంగా ఉండటంతో ఏ ఇష్యూ మీదా ఆయన పూర్తిస్థాయిలో స్పందించలేకపోయారు.  ఈ రెండు నెలలు కార్యకర్తలు కూడా డీలా పడిపోయారు.  కీలక సమయాల్లో తమ లీడర్ అందుబాటులో ఉండలేకపోయారే అని తెగ ఫీలయ్యారు. 
 
చంద్రబాబు సైతం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోటున్నందుకు ఇబ్బంది ఫీలయ్యారు.  ఎట్టకేలకు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఆయన ఇరు రాష్ట్రాల డీజీపీల నుండి అనుమతులు తీసుకుని ఏపీలో అడుగుపెట్టారు.  దీంతో తెలుగు దేశం శ్రేణుల్లో అమితమైన ఆనందం నెలకొంది.  చాలా రోజుల తర్వాత రాష్ట్రానికి వస్తున్న తమ ప్రియతమ నేతను ఊరికే రానిస్తే ఎలా.. ఘన స్వాగతం పలకాల్సిందే అనుకుని అత్యుత్సాహం ప్రదర్శించారు.  
 
చంద్రబాబు కాన్వాయ్ గరికపాడు చెక్ పోస్ట్ వద్దకు రాగానే భారీ సంఖ్యలో కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.  భౌతిక దూరం మరచి బాబు కాన్వాయ్ చుట్టూ గుంపులు గుంపులుగా చేరి హంగామా చేశారు.  అసలే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కాలం.  ఏపీలో రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుందేకానీ తగ్గడం లేదు.  నిపుణులు, అధికారులు నిబంధనలు సడలించినా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, కరచాలనానికి దూరంగా ఉండటం, గుంపులుగా ఉండకపోవడం వంటి తప్పనిసరి జాగ్రత్తలను పాటించాలని పదే పదే చెప్తున్నారు.  
 
కానీ చంద్రన్న రాకతో, నాయకుడిని చూడాలనే ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్లకు ఒళ్లు తెలీలేదు.  జాగ్రత్తల్ని, నిబంధనల్ని మర్చిపోయి అంతా ఒక్కచోటే చేరారు.  ఇదే సీన్ బాబుగారి కాన్వాయ్ వెళ్లిన పలు కూడళ్లలో కనబడింది.  టీడీపీ నేతలు, లోకల్ లీడర్లు కూడా వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేకపోవడం కొసమెరుపు.  ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఇప్పుడే ఇలా ఉంటే రేపు విశాఖ పర్యటనకు బాబు వెళ్తే అక్కడ సీన్ ఇంకెంత రద్దీగా ఉంటుందో.. ఈ పొరపాట్లే కదా కరోనా వ్యాప్తికి కారణాలయ్యేది అంటూ మండిపడుతున్నారు.