ఎన్నికల అనంతరం పార్టీల మధ్య నేతల జంపింగ్ సర్వ సాధారణం. ఓడిన పార్టీలోని గెలిచిన అభ్యర్థులు అధికార పార్టీలోకి భవిష్యత్తును వెతుక్కుంటూ వెళతారు. అధికార పార్టీ సైతం ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి, బలం పెంచుకోవడానికి వలసల్ని ఆహ్వానిస్తుంది. ఈ ప్రాసెస్లోనే నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు మొదలవుతుంటుంది. దీన్ని అధిగమించడం అంత సులభం కాదు. కానీ జగన్ లాంటి ఏకపక్ష ధోరణి ఉన్న నాయకుడికి ఇదంత పెద్ద కష్టమేమీ కాదనుకున్నారు అందరూ.
అందుకు తగ్గట్టే జగన్ సైతం మొదట్లో వలసల్ని ప్రొత్సహించలేదు. ఒకవేళ పార్టీలోకి వచ్చినా అనేక కండిషన్స్ అంగీకరించాల్సి ఉంటుంది. వాటికి ఒప్పుకున్నవారే పార్టీలోకి రావాలని అన్నారు. దీంతో చాలామంది టీడీపీ నేతలు వైకాపాలోకి వెళ్లాలనే ఆలోచనను విరమించుకున్నా కొందరు మాత్రం సాహసించారు. ముందు అధికార పార్టీలోకి వెళితే బాగుంటుందని వెళ్లిపోయారు. అలా వెళ్లిన వాళ్లలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా ఒకరు.
వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్ మీద టీడీపీ తరపున గెలిచిన ఆయన అనంతరం వైకాపాలోకి వెళ్లిపోయారు. మొదట్లో ఆమంచి, కరణం మధ్యన వ్యవహారం బాగానే ఉన్నా మెల్లగా ఆధిపత్య పోరు మొదలైంది. ఆమంచి కృష్ణ మోహన్ అప్పటికే రెండు టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసి ఉండటంతో సొంత పార్టీలో తనపై పెరుగుతున్న ఆధిపత్యాన్ని సహించలేకపోయారు. మున్సిపాలిటీలో వార్డు వాలంటీర్ల నియామకంలో ఎమ్మెల్యేగా బలరాం పూర్తి ఆధిపత్యను ప్రదర్శించి పోస్టులన్నీ తాను సిఫార్సు చేసిన వారికే ఇప్పించుకున్నారు.
ఇక అధికారుల బదిలీల విషయంలో కూడా బలరాం ఆయన కుమారుడు అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉండటంతో ఆమంచికి నియోజకవర్గంలో పట్టు సడలుతోందని అర్థమైంది. దీంతో నేరుగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లారు. అన్ని విషయాల్లోనూ తనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారట. ఇటు కరణం, ఆయన కుమారుడు వెంకటేష్ సైతం తాము నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తుంటే ఆమంచి అడ్డుతగులుతున్నారని కంప్లైట్ ఇచ్చారు.
ఆమంచి సొంత పార్టీ మనిషి, ఎన్నికల్లో ఓడిపోయినా మంచి బలం, బలగం ఉన్న నేత. మరోవైపు కరణం సిట్టింగ్ ఎమ్మెల్యే. వీరిలో ఎవరినీ కాదనడానికి లేదు. అలాగని మౌనంగా ఉంటే వ్యవహారం మొత్తానికి చెడుతుంది. దీంతో ఈ ఆధిపత్య పోరును చల్లార్చడం మంత్రి బాలినేని సైతం తలకు మించిన భారంగా పరిణమించింది.