ప్రత్యేక హోదా లేదని కేంద్రం తేల్చేసింది. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేశామంటోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగదని తెగేసి చెప్పింది. కడప స్టీలు పరిశ్రమకు సహకారం లేదు.. దుగరాజపట్నం పోర్టుకీ మద్దతు లేదు. రాజధాని విషయంలో పట్టించుకోవడంలేదు.. రైల్వే జోన్ విషయంలోనూ అడుగు ముందుకు కదలడంలేదు. ఒకటా.? రెండా.? రాష్ట్రానికి సంబంధించి కేంద్రం పరిష్కరించాల్సిన అంశాలు చాలానే వున్నాయి. నిజానికి, అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కటై రాష్ట్ర భవిష్యత్తు కోసం నినదించాల్సిన సమయమిది. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ కూడా ‘ఇది నా బాధ్యత’ అనుకోవడంలేదేమో.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఓ ప్రశ్న సంధిస్తారు.. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మరో ప్రశ్న సంధిస్తారు. ఎంపీలంతా విడివిడిగా ఎవరికి తోచిన రీతిలో వారు.. తమ తమ పార్టీల లైన్ దాటకుండా అత్యంత జాగ్రత్తగా కేంద్రాన్ని ప్రశ్నలు అడుగుతారు. అడిగితే సరిపోదిక్కడ.. నిలదీయాలి.. అవసరమైతే, సమైక్యంగా పోరాటాలు చేయాలి. రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలంతా ఒక్కతాటిపైకొచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తేనే ఆయా విషయాల్లో రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న ఈ పరిస్థితుల్లో పార్లమెంటుని అత్యద్భుతమైన వేదికగా చేసుకుని రాష్ట్ర ఎంపీలు పార్టీల జెండాల్ని పక్కన పెట్టి, కేంద్రాన్ని నిలదీయగలిగితే.. ఆయా పార్టీల ఇమేజ్ కూడా రాష్ట్రంలో పెరుగుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
చిత్రమేంటంటే ఢిల్లీ వేదికగా కూడా వైసీపీ, టీడీపీ.. పరస్పర ఆరోపణలకే పరిమితమవుతున్నాయి ప్రత్యేక హోదా వంటి కీలక అంశాల్లో కూడా. రాజీనామాలతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, పదవుల్లో వున్నారు కాబట్టి.. ఆ పదవులకు న్యాయం చేసే దిశగా రాష్ట్ర వాదనను కేంద్రం వద్ద వినిపించాల్సిందే. ఒకటా.? రెండా.? రాష్ట్రం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం ఢిల్లీలో దొరక్కపోతే, పార్లమెంటులో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వుండి ఏం లాభమన్న చర్చ రాష్ట్ర ప్రజల్లో జరుగుతోంది.