అనాధగా ఆంధ్ర ప్రదేశ్! కేంద్ర బడ్జెట్లో మొండి చేయి! కేంద్రాన్ని నిలదీసే దిక్కు లేదు.

కేంద్ర బడ్జెట్ వెలువడింది. షరా మామూలే. ఆర్థిక లోటుతో పాటు బంగారు బాతులాగా హైదరాబాద్ లాగా ఆదాయం వచ్చే రాజధాని కూడా లేకుండా ఏర్పడిన నవ్యాంధ్ర టిడిపి పాలనలో అయిదు ఏళ్లు కునారిల్లింది. ఈ బడ్జెట్ లో కూడా మొండి చెయ్యి మిగిలింది. ఆంధ్ర ప్రదేశ్ కు చెంది కేంద్రం నుండి రెండు అంశాలు ఇమిడి వున్నాయి. ఒకటి. ప్రత్యేక హోదా. రెండు రాష్ట్ర విభజన చట్టం మేరకు అందవలసిన రాయితీలు నిధులు. ఇవి రెండు కూడా వేర్వేరు అంశాలు. ఇవి రెండింటిని కలగాపులగం చేసి పలువురు మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదని కొన్నాళ్లు 14 వ ఆర్థిక సంఘం వద్ద న్నదని మరి కొన్నాళ్లు మభ్య పరచి తుదకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి సరి పుచ్చారు.ఈ సందర్భంలో గుర్తించ వలసిన అంశమేమంటే దేశంలో ప్రత్యేక హోదా చట్టం ద్వారా ఏ రాష్ట్రనికి అమలు చేయ లేదు. రాయలసీమ లాంటి వెనుక బడిన ప్రాంతాల్లో కొందరు ప్రత్యేక హోదా వస్తే ఏం లాభమని వాదించే వారు వున్నారు. సీమ యే కాదు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు విరివిగా రావాలి. ఉపాధి కలగాలి ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక వేత్తల పంట పండి నట్లే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ పారిశ్రామిక వేత్తను అభ్యర్థించ పని లేదు. పారిశ్రామిక వేత్తలే ఆంధ్ర ప్రదేశ్ కు పరుగులు తీస్తారు. .

ప్రస్తుతం 15 వ ఆర్థిక సంఘం కూడా ప్రత్యేక హోదా గురించి తన మధ్యంతర నివేదికలో కేంద్ర ప్రభుత్వం ఇష్టానికి వదలి పెట్టింది. కాని బడ్జెట్ లో ఆ ఊసే లేదు. దురదృష్టమేమంటే విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదా పక్కన బెడితే విభజన చట్టం మేరకు చట్ట బద్దంగా రావాల్సిన నిధులు గురించి కూడా బడ్జెట్ లో మాట మాత్రంగా కూడా ప్రస్తావన లేదు. విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నిర్థారింప బడింది. ఈ బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు ఒక్క పైసా కేటాయింపులు లేవు. పైగా పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ అంచనాలు కేంద్రం వద్ద పెండింగ్ లో వున్నది. తాజా అంచనాలు ఆమోదించే అంశం ప్రస్తావన కూడా చేయ లేదు. మున్ముందు వ్యయం చేసే నిధులు అటుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు ఇచ్చే ప్రస్తావన లేదు.

2014 ఫిబ్రవరి 20 రాజ్యసభలో విభజన చట్టం చర్చ సాగుతున్న సందర్భంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 46 (3) ప్రకారం వెనుకబడిన బడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. రాయలసీమ ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలకు కోరాపుట్ బోలంగీర్ కలహండి బుందేల్ ఖండ్ లో అమలు చేసిన తరహాలో నిధులు ఇవ్వబడతాయని చెప్పారు. 2009-10 నుండి అయిదు ఏళ్లు బుందేల్ ఖండ్ లో 7266 కోట్ల రూపాయల వ్యయం చేశారు. బుందేల్ ఖండ్ పరిస్థితులే ఆంధ్ర ప్రదేశ్ లో వున్నాయని 2.38 కోట్ల జనాభా ఉన్న వెనుక బడిన ఏడు జిల్లాలకు ఏటా జిల్లాకు 200 కోట్లు చొప్పున ఇవ్వాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కాని కేంద్రం జిల్లాకు 50 కోట్లు చొప్పున మూడు ఏళ్లు 1050 కోట్లు ఇచ్చి ఎగనాం పెట్టింది. ఇది వెనుక బడిన జిల్లాలకు శరాఘాతమే.

రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 94 (3)ప్రకారం రాజధాని నిర్మాణంలో రాజ్ భవన్ హైకోర్టు శాసన సభ శాసన మండలి నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలి. ఇందుకు గాను 1500 కోట్లు ఇచ్చి తోక కోసి సున్నం పెట్టింది. ఇప్పుడు రాజధాని కోసం నిధులు అడిగితే ఏ రాజధాని కని ఎదురు ప్రశ్న వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో పలు కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు జరిగాయి. ఇవన్నీ శైశవ దశలో వున్నాయి. కొన్నింటికి స్వంత భవనాలు కూడా లేవు. ఈ బడ్జెట్ లో ఈ విద్యా సంస్థలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించ లేదు. హైదరాబాద్ లోని ఐఐటి కి 150 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. శైశవ దశలో వున్న తిరుపతి ఐఐటి ని విద్యాపద్దు కింద జత గట్టారు. గుడ్డిలో మెల్లగా అనంతపురంలోని కేంద్ర విశ్వ విద్యాలయానికి మాత్రం ప్రత్యేకంగా 60.35 కోట్లు కేటాయించారు.

కేంద్రం నుండి రాష్ట్రాలకు వచ్చే వాటాలో కోత పెట్టడం సబ్సిడీలు రుణ మాఫీలకు చెల్లు చీటీ ప్రకటించడం లాంటి చర్యలతో వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన చట్టం మేరకు అయినా రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా ఒక వేపు మోసం చేస్తూ వచ్చే ఎన్నికల నాటికి ఎపిలో అధికారానికి బిజెపి నాయకులు నిచ్చెనలు వేయడమే ఆశ్చర్యమేస్తోంది. రాష్ట్రంలో టిడిపి నేతలు గాని లేక మరొకరు గాని తాము ఇంతకు ముందు పాల్పడిన తప్పుడు పనుల నుండి బయట పడేందుకు షెల్టర్ కోసం వారు మాత్రమే బిజెపిలో చేర వచ్చు తప్ప మిగిలిన వారెవ్వరూ అటు వేపు చూడరు. అప్పట్లో టిడిపి హయాంలోనూ ఇప్పుడూ ఇదే తంతు నడుస్తుంది.

బడ్జెట్ వెలువడిన తర్వాత రాష్ట్ర బిజెపి నేతల గొంతులు ఏ మాత్రం పెగల లేదు. తుదకు ఆంధ్ర ప్రదేశ్ కు జీవ నాడి అయిన పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన లేక పోవడం వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయించక పోవడంతో రాష్ట్ర బిజెపి నేతలకు ముఖం చెల్లడం లేదనిపిస్తోంది. .

తమాషా ఏమంటే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని తెలుగు దేశం పార్టీ నేరుగా బిజెపిని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయ లేదు. రాష్ట్రంలో అధికారంలో వున్న వైసిపి ప్రభుత్వ అసమర్థతను ఎండ గట్టింది. గతంలో కూడా టిడిపి హయాంలో వైసిపి నేరుగా కేంద్రాన్ని విమర్శించ కుండా టిడిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేది. ఇప్పుడు కూడా టీడీపీ అదే పంథా ఎంచుకొనింది. ఈ మధ్యలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారు. మరో ప్రతి పక్ష నేత పవన్ కళ్యాణ్ అయితే కేంద్ర బడ్జెట్ భేషుగ్గా వుందని హారతులు పట్టారు. ఇటీవలనే బిజెపితో వియ్యమంది నందున కేంద్ర ప్రభుత్వంపై బిజెపి పై ఈగ వాల కుండా చూచు కున్నారు.మరో విశేషమేమంటే రాష్ట్రానికి నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయ కుండా వైసిపి ప్రభుత్వం నిధులు రాబట్టడంలో విఫలమైనదని పవన్ కళ్యాణ్ ఆరోపించడమే.

ఇక మిగిలింది – అధికార వైసిపి. తనకు 25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించితే ప్రత్యేక హోదా సాధిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు 22 మందిని గెలిపించారు. అయితే ఈ బడ్జెట్ లో ఆ ఊసే లేదు. చట్ట బద్దంగా రావాల్సిన నిధులు కూడా కేటాయింపులు లేవు. ఈ అంశంపై రాష్ట్ర మంత్రి బుగ్గను రాజేంద్ర నాథ రెడ్డి పార్లమెంటు సభ్యులు విజయ సాయి రెడ్డి స్పందించారు. రాష్ట్రానికి మొండి చేయి చూపారని తీవ్రంగా వ్యాఖ్య చేశారు. మరి భవిష్యత్తులో ఏలా పోరాడుతారో వేచి చూడాల్సిందే. కొసమెరుపు ఏమంటే ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని బడ్జెట్ పై నోరు విప్ప లేదు.

. వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013