విజయనగరం జిల్లా చీపురుపల్లి టిడిపిలో నేతల మధ్య అసంతృప్తి గళం బయటపడుతుంది. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, జడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణ ల మధ్య విబేధాలతో అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార పార్టీలో ఉన్నా గుర్తింపు లభించటం లేదని వారు వాపోతున్నారు. ఎమ్మెల్యే రాజకీయమే ఎక్కువ నడుస్తుందని అధికారులు తమ మాట వినడం లేదని వారంటున్నారు.
చీపురుపల్లిలో ఎమ్మెల్యే గ్రూపు ఒక వర్గంగా, జడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణ, ,ఎంపీపీ రౌతు కాంతమ్మలు ఒక వర్గంగా రాజకీయాలు నడుస్తున్నాయి. అసలు ఎమ్మెల్యే మండల కమిటీ వ్యవహారాలు, జడ్పీ నిధులలో జోక్యం చేసుకుంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజకీయం అక్కడ వేడెక్కింది.
ఎమ్మెల్యే మృణాళిని ఇంట్లో జరిగిన నియోజక వర్గ అభివృద్ది సమావేశానికి అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరయ్యారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణ, ఎమ్మెల్యే అనుచరులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యేకు మద్దతుగా గరివిడి ఎంపీపీ భర్త పైల బలరాం వాదించాడు. దీంతో ఆయనకు, కృష్ణ వర్గీయులకు వాగ్వాదం జరిగింది. దీంతో నేతల మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమానికి జడ్పీటిసి మీసాల వరహాలప్ప నాయుడు హాజరు కాలేదు. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఎమ్మెల్యే వైఖరి వలనే వరహాలప్ప హాజరు కాలేదని ఇతర నేతుల చెబుతున్నారు.
ఎమ్మెల్యే రోడ్ల నిర్మాణాలను, నీటి సరఫరా పనులను అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆమెకు తెలియకుండా పనులు జరగొద్దని ఆమె అధికారులకు ఆదేశాలిస్తున్నట్టు జడ్పీటీసీలు అంటున్నారు. జడ్పీ వైస్ చైర్మన్ అయిన తనపై ఎమ్మెల్యే కావాలనే కక్ష సాధింపుగా అభివృద్ది పనులకు అడ్డు పడుతుందని, నన్ను తొలగించి తన అనుచర జడ్పీ టీసీ సభ్యున్ని వైస్ చైర్మన్ గా చేసేందుకు ఎమ్మెల్యే పావులు కదుపుతున్నారని బలగం ఆరోపిస్తున్నారు. సంవత్సర కాలం ఉన్న పదవులకు గొడవెందుకని ఇతర నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు.
అధికార పార్టీ నేతలే కుమ్ములాడుతుండగా వీరేం పరిపాలన చేస్తారని ప్రతిపక్ష సభ్యులు అంటున్నారు. విజయనగరం మున్సిపాలిటిలో కూడా మున్సిపల్ చైర్మన్ , ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు గురించి తెలిసిందే. తాజాగా చీపురుపల్లి లో కూడా వ్యతిరేక రాగాలు మొదలవడంతో జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ గొడవలపై త్వరలోనే అధినాయకుడు చంద్రబాబుకి ఫిర్యాదు చేయాలన్న యోచనలో నేతలు ఉన్నారు. మరీ వివాదాలు ఎలా చల్లారుతాయో, చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకోనున్నాడో వేచి చూడాలి.