అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటికి అవిశ్వాస సెగలు తాకాయి. అధికార టిడిపికి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లపై టిడిపి సభ్యులతో పాటు ప్రతిపక్షపార్టీ సభ్యులు కలిసి అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమయ్యారు. అవిశ్వాసానికి సంబంధించిన లేఖను 25 మంది మున్సిపల్ సభ్యులు ఇప్పటికే జాయింట్ కలెక్టర్ కు అందజేశారు.
కదిరి మున్సిపాలిటిలో 36 వార్డులు ఉన్నాయి. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి 27 స్థానాలు, వైసిపి 9 స్థానాలు గెలుచుకున్నాయి. టిడిపికి చెందిన షేక్ సురయభాను చైర్మన్గా, జి.వసంత వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇంత వరకు బానే ఉన్నా చైర్మన్ వైస్ చైర్మన్ లు ఇద్దరు మహిళలు కావడంతో మిగిలిన కౌన్సిలర్లకు కాస్త ఇబ్బంది ఉండేదని, వారి భర్తల రాజకీయమే ఎక్కువ నడిచేదని కౌన్సిలర్లు అంటున్నారు.
మున్సిపాల్టికి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని ఖర్చు చేయకముందే ఖర్చు చేసినట్టు దొంగ లెక్కలు చూపేవారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. చైర్మన్ సురయభాను, ఆమె భర్త షేక్ బాబ్ జాన్ కలిసి మున్సిపల్ లో అవినీతికి పాల్పడుతున్నారని, నాలుగేళ్లుగా వారు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని వారిపై విచారణ కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మున్సిపల్ సభ్యుల్లో 16మంది టిడిపి సభ్యులు, 9 మంది వైసిపి సభ్యులు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని జాయింట్ కలెక్టర్ కు అందజేశారు. ప్రతిపక్ష సభ్యులతో అధికార పార్టీ సభ్యులు కలిసిపోవడంతో అక్కడ రాజకీయం వేడెక్కింది. టిడిపి పెద్దలు రంగంలోకి దిగినా సభ్యులు వెనుకకు తగ్గే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే అవిశ్వాసం జరిగితే ప్రస్తుత చైర్మన్ సురబానుకు 11మంది మద్దతు మాత్రమే దక్కే అవకాశం ఉంది. వ్యతిరేకిస్తున్న 25మందిలో ఎవరు చైర్మన్ పదవికి ఆశిస్తున్నారో అన్నదానిపై ఇంకా స్పష్టతలేదు. అవిశ్వాస లేఖ ఇవ్వటంతో కదిరి మున్సిపల్ లో క్యాంపు రాజకీయాలు షురువు అయ్యాయి. అవిశ్వాసం జరిగేనా లేక రాజీ కుదిరేనా అనే చర్చ జరుగుతుంది.