కేసీఆర్- టాలీవుడ్ భేటిపై బాల‌య్య ఏమ‌న్నారంటే?

ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు భేటి అయిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌, త్రివిక్ర‌మ్, సురేష్ బాబు , అల్లు అర‌వింద్, దిల్ రాజు స‌హా ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంత మంది కీల‌క వ్య‌క్తులు స‌మావేశ‌మ‌య్యారు. అంత‌కు ముందు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తోనూ టాలీవుడ్ పెద్ద‌లు భేటి అయ్యారు. ఈ రెండు స‌మావేశాల్లో తిరిగి సినిమా షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభించాలి? థియేట‌ర్లు పున ప్రారంభం ఎలా? షూటింగ్ లు ప్రారంభ‌మైతే భౌతిక దూరం పాటించ‌డం వ‌ంటి త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌ధానంగా భేటీలో చ‌ర్చించారు.

దానికి త‌గ్గ‌ట్టు ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేస్తూ జూన్ నుంచి య‌ధావిధిగా షూటింగ్ లు చేసుకోమ‌న్నారు. థియేట‌ర్లు పున ప్రారంభ‌మై మాత్రం ఆలోచించి నిర్ణ‌యం తీసుకుందామ‌ని తెలిపారు. అయితే సీనియ‌ర్ న‌టుడు, హిందుపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ మాత్రం ఈ భేటిలో క‌నిపించ‌లేదు. దీంతో మెగాస్టార్ ఆయ‌న్ను పిలిచారా? లేదా? అన్న సందేహాలు సోష‌ల్ మీడియాలో వ్య‌క్తం అయ్యాయి. ఓ సినియ‌ర్ న‌టుడిగా, త‌మ స‌మకాలికుడిగా బాల‌య్య‌ను పిల‌వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది అని చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు. క‌నీసం నంద‌మూరి ఫ్యామిలీ నుంచైనా జూనియ‌ర్ ఎన్టీఆర్ నో? క‌ళ్యాణ్ రామ్ నో! పిలిస్తే స‌రిపోయేద‌ని అన్నారు.

అయితే తాజాగా ఈ విష‌యంపై న‌ట‌సింహ బాల‌కృష్ణ స్పందించారు. ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నివాళులు అర్పించిన అనంత‌రం ఆయ‌న కేసీఆర్- టాలీవుడ్ మ‌ధ్య జ‌రిగిన భేటి గురించి త‌న‌కు ఎవ‌రూ చెప్ప‌లేద‌ని, టీవీల్లో, సోష‌ల్ మీడియాలో ఫోటోలు చూసిన త‌ర్వాతే తెలిసింద‌న్నారు. అయితే అంత‌కు ముందే ఈ విష‌యంపై ప‌లువురు బాల‌య్య‌ని స‌ల‌హాలు అడిగారుట‌. దానికి బాల‌య్య కూడా త‌న‌కు తోచిన స‌ల‌హాలు ఇచ్చాన‌ని తెలిపారు. అలాగే షూటింగ్ అనుమ‌తుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం జీవో ఇస్తే ఓ క్లారిటీ వ‌స్తుందన్నారు. అలాగే సినీ కార్మికుల సంక్షేమం కోసం రెండు రాష్ర్టాల ప్ర‌భుత్వాలు త్వ‌రిగ‌తిన చర్య‌లు తీసుకోవాల‌న్నారు.