క్రికెట‌ర్‌తో ప్రేమ‌లో ఉన్న‌ విజ‌య్‌

(ధ్యాన్)

విజ‌య్ దేవ‌ర‌కొండ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే అంటూ ఓ వైపు పాట పాడుకుంటూ `గీత గోవిందం` సినిమాకు ఎక్క‌డ లేని క్రేజ్ తెచ్చాడు. అంతే కాదు… మ‌రో వైపు డియ‌ర్ కామ్రేడ్ అంటూ త‌దుప‌రి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కాకినాడ ప‌రిసర ప్రాంతాల్లో ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాలో స్టూడెంట్ లీడ‌ర్‌గా న‌టిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇందులో ర‌ష్మిక మండ‌న లేడీ క్రికెట‌ర్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో క్రికెట‌ర్‌ని ప్రేమిస్తున్న స్టూడెంట్ లీడ‌ర్‌గా విజ‌య్ న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఫ‌స్ట్ షెడ్యూల్ కాకినాడ ప‌రిస‌రాల్లో జ‌రుగుతోంది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు ఇదే తొలి సినిమా. మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ క‌లిసి నిర్మిస్తోన్న సినిమా ఇది. విజ‌య్‌, ర‌ష్మిక క‌లిసి న‌టిస్తోన్న రెండో సినిమా ఇది. తొలి సినిమా గీత గోవిందం విడుద‌ల కాక‌ముందే వారి పెయిర్‌కు చాలా మంచి క్రేజ్ వ‌చ్చింది.