ఈ ప్రయోగం భరించలేం బాబో ! వీరభొగ వసంతరాయలు (మూవీ రివ్యూ)

‘వీరభోగ వసంత రాయలు’ 
రచన – దర్శకత్వం : ఇంద్రసేన ఆర్ 
తారాగణం : నారా రోహిత్, శ్రియ, శ్రీ విష్ణు, సుధీర్బాబు, శ్రీనివాస రెడ్డి, రవి ప్రకాష్ తదితరులు 
సంగీతం : మార్క్ రాబిన్, ఛాయాగ్రహణం : ఎస్. వెంకట్, నవీన్ యాదవ్ 
బ్యానర్ : బాబా క్రియేషన్స్ 
నిర్మాత : బి. అప్పారావు బి 
విడుదల : అక్టోబర్ 26, 2018


రేటింగ్   / 5

నారా రోహిత్ అంటే ప్రయోగాలకి పేరు. ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త కొత్త కాన్సెప్ట్ తో వచ్చే దర్శకులని ప్రోత్సహిస్తున్నాడు. ఇందుకు ఇతర హీరోలతో కలిసి నటించేందుకైనా వెనుదీయడు. రొటీన్ మూస ఫార్ములా సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకి నారా రోహిత్ సినిమా అంటే ఒక ఊరట. ఈ ప్రయోగాలు విఫలమవుతున్నా వెరైటీనే పట్టుకుని ప్రయాణిస్తున్న రోహిత్, ఈసారి ఇద్దరు హీరోలతో, ఒక పాపులర్ హీరోయిన్ తో ‘మల్టీ స్టారర్’ సస్పెన్స్ థ్రిల్లర్ ని ప్రయోగాత్మకంగా అందించేందుకు ముందుకొచ్చాడు. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియ – ఈ కాంబినేషన్ ప్రేక్షకులకి కనువిందుగా కనిపిస్తుంది. టైటిల్ కూడా ఉత్సుకత రేపుతుంది. మరో కొత్త దర్శకుడు ఇంద్రసేన పట్ల కూడా ఆసక్తి రేగుతుంది. మరి ఇంతా చేసి ఈసారైనా ఈ ప్రయోగంతో రోహిత్ సక్సెస్ అయ్యాడా? నిజంగా తను చేస్తున్నది ప్రయోగాలేనా? షార్ట్ మూవీస్ కల్చర్ నుంచి వస్తున్న కొత్త దర్శకులకి  సిల్వర్ స్క్రీన్ మీద ప్రయోగాలు చేసే స్థాయి వుందా? అపజయాల్లో వున్న ఈ ముగ్గురు హీరోలూ ఈ ‘మల్టీ స్టారర్’ తోనైనా తెరిపిన పడ్డారా? ఇవి తెలియాలంటే అసలీ ప్రయోగమేమిటోచూడాలి…

కథ

దీపక్ రెడ్డి (నారా రోహిత్), నీలిమ (శ్రియ) లు క్రైం బ్రాంచ్ ఇన్స్ పెక్టర్లు. వినయ్ (సుధీర్ బాబు) ఒక పోలీస్ స్టేషన్లో ఎస్సై. వీరభోగ వసంత రాయలు (శ్రీ విష్ణు) ఒక సీరియల్ కిల్లర్. ఎస్సై వినయ్, ఇల్లు పోయిందని కంప్లెయింట్ ఇచ్చిన పిల్లవాడి కేసు దర్యాప్తు చేస్తూంటాడు. వసంత రాయలు ఒక విమానాన్ని హైజాక్ చేస్తాడు. దీపక్ రెడ్డి, నీలిమలు ఈ కేసు మీద వుంటారు. ఇంకో వైపు పిల్లల్నికిడ్నాప్ చేస్తున్న ముఠా వుంటుంది. విమానాన్ని హైజాక్ చేసిన వసంత రాయలు, ప్రయాణీకుల్ని ప్రాణాలతో విడిచి పెట్టాలంటే ప్రభుత్వం ఇంతే సంఖ్యలో 300 మంది నేరస్థుల్ని చంపెయ్యాలని డిమాండ్ చేస్తాడు. అప్పుడు ప్రభుత్వం ఏంచేసింది? మిగతా రెండు కథలకి దీనితో సంబంధమేమిటి? ఇవీ మిగతా కథలో టెలి విషయాలు. 

ఎలావుంది కథ 
బ్రహ్మంగారు చెప్పిన లోక రక్షకుడుగా దేవదూత వీరభోగ వసంతరాయలి రాక పాయింటు తీసుకుని ఈ కథ అల్లారు. దేశంలో ఎటు చూసినా హింస, దోపిడీ, హత్యలు పెచ్చు మీరిపోయి, ప్రజలు గడగడలాడడం చూసిన ఒక యువకుడు, తనని తాను వీర భోగ వసంత రాయలుగా ప్రకటించుకుని దుష్టుల ఎరివేతకి పూనుకోవడం ఈ కథ. విమాన హైజాక్ తో కథా విస్తృతి పెద్దది, తీసిన సినిమా చిన్నది. ‘భారతీయుడు’ లాంటి హై కాన్సెప్ట్ సినిమాని  లోబడ్జెట్ లో బీ – గ్రేడ్ మూవీగా తీస్తే ఎలావుంటుందో ఇదీ అలాగే తయారయ్యింది. పైగా చెప్పేదేదో సూటిగా చెప్పకుండా ఇంకో రెండు మూడు ట్రాకులు కలిపి కన్ఫ్యూజ్ చేశారు. ప్రయోగమంటే కన్ఫ్యూజ్ చేయడమా? ఇలాటి కాన్సెప్ట్స్ ని తక్కువ బడ్జెట్ తో బలంగా ఎలా చెప్పవచ్చో  ఎడ్గార్ వాలేస్ నవలల్లో తెలుసుకోవచ్చు. అసలు దీనికన్నా ఎన్టీఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ చాలు కడుపు నిండిపోవడానికి. కథ మీద పాత దర్శకుల కమాండ్ కీ, ఇప్పటి దర్శకుల పట్టుకీ తేడాఇదే. వసంతరాయల్ని ఒక అర్ధంలేని బలహీన కథగా తయారు చేశారు.

ఎవరెలా చేశారు 
ఎవరేమీ చేయలేదు. చేయకూడదని ఒకచేయి కట్టేసుకుని కనిపిస్తాడు నారా రోహిత్. శ్రీకాంత్ నటించిన ‘విరోధి’లో శ్రీకాంత్ రెండు చేతులూ వెనుక కట్టేసుకుని సినిమా సాంతం తిరగాడినట్టు. నారా రోహిత్ గత సినిమాలెలా వున్నా, తాను మాంచి గ్లామర్ తో చూడగానే ఫన్నీగా కన్పించేవాడు. ఈసారి గడ్డంతో ఏదో కోల్పోయినట్టు వుంటాడు. నవ్వుతూ నవ్విస్తూ కథ నడిపే హుషారు ఏమయిందో. పైగా రోమాన్సు కూడా లేదు.          శ్రియ డిటో. ఈమె కూడా ఏదో కోల్పోయినట్టు శూన్యంలోకి చూస్తూ వుంటుంది. సుధీర్ బాబు అయితే డైలాగులు చెప్పడం కూడా దండగన్నట్టు డబ్బింగ్ వాయిస్ తో మూకాభినయం చేశాడు. ఇక హీరోగానే శ్రీ విష్ణు అంతంత మాత్రం. అలాంటిది బలహీన గొంతుతో విలన్ గా టైటిల్ రోల్ కి సాహిసించి రసాభాస చేశాడు. ఇక ఇతరుల విషయం సరేసరి.

టెక్నికల్ గా చవకలో తీశారు. సంగీతం, కెమెరా ప్రతీదీ చౌకబారుగా వున్నాయి. ఈ మధ్యకాలంలో ఎంత చిన్న హీరో సినిమా అయినా ఇంత దిగువస్థాయి నిర్మాణ విలువలతో లేదు. విమాన హైజాక్ చూపించలేక, విమానం ఎగురుతున్న స్టాక్ షాట్స్ వేసి వాయిసోవర్ చెప్పించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చూపించడానికి,  వివిధ సందర్భాల్లో న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేసిన ఆందోళనాకారుల వేర్వేరు క్లిప్పింగ్స్ వేసి, విమాన హైజాక్ కి ముడిపెట్టి  వాయిసోవర్ చెప్పించారు. కొన్ని యూట్యూబ్ నుంచి తీసుకున్న దృశ్యాలు కూడా వున్నాయి.  
          ఇక దర్శకత్వం ఎలా వుంటుందో వూహించుకోవచ్చు. దర్శకుడికి వున్న వూహలు సినిమాకి పనికిరాని, దృశ్యాలుగా చూపించలేని వూహలు. దర్శకుడు సినిమా కథనం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు.

చివరికేమిటి 
 రెండు గంటల సినిమాయే అయినా ప్రారంభమైన ఐదూ పది నిమిషాల్లో నీరసంగా మారిపోతుంది. ఇల్లు మాయమైన కథ ఒకవైపు, హైజాక్ కథ ఒక వైపు, కిడ్నాపుల కథ ఇంకో వైపు. ఇవన్నీ ఇంటర్వెల్లో కనెక్ట్ చేస్తే అదో బలహీన మలుపు. ఎక్కడా లాజిక్,  కామన్ సెన్స్ అనేవి లేక సిల్లీగా వుంటుంది. సెకండాఫ్ ఇక చూడనవసరం లేదు. క్లయిమాక్స్ లో కొంత హడావిడీ చేసినా,  క్లయిమాక్స్ కోసమే ప్రేక్షకులు రారుగా? పైగా విలన్ గా శ్రీవిష్ణు నీరస నటన. దోస్త్ మేరా దోస్తులైన నారా రోహిత్, శ్రీవిష్ణులు కలిసి నటించి కూడా సక్సెస్ కాలేకపోయారు. రోహిత్ ప్రయోగాల బాట నగుబాటుగా మారిపోయింది. దృశ్యాల్ని షూట్ చేయడానికి బదులుగా క్లిప్పింగ్స్ తో చూపించడమే ఈసారి కొత్తగా చేసిన ప్రయోగమనుకోవాలి. ఇలాటి వినూత్న ఐడియాతో రోహిత్ ని కలిసిన కొత్త దర్శకుడు ఎంతైనా అభినందనీయుడు. హై కాన్సెప్ట్ కథని హై కాన్సెప్ట్ కథగా చెప్పకుండా, లో – బడ్జెట్ లో చాలా పొదుపు చేస్తూ తీయడం కూడా ఒక ప్రయోగమేనేమో. వీరభోగ వసంతరాయలు ముగ్గురు యూత్ హీరోలతో కొత్త దర్శకుడు చేసిన సిల్లీ ప్రయత్నం. ఈ కథంతా ఏమిటో చిట్టచివర అర్ధమవుతుందన్నాడు. అందుకే ఇంటర్వెల్లో కూడా కథ అర్ధం గాలేదు. ఇది  సినిమాలకి పనికి రాని  ఎండ్ సస్పన్స్ కథనమని తెలుసుకోలేక పోయాడు.