Jatadhara Movie Review: ‘జటాధర’ మూవీ రివ్యూ!

దర్శకత్వం : వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్

తారాగణం : సుధీర్ బాబు, సోనాక్షీ సిన్హా, దివ్యా ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇందిరా కృష్ణ తదితరులు

రచన : వెంకట్ కళ్యాణ్,
సంగీతం : రాజీవ్ రాజ్,
చాయాగ్రహణం : సమీర్ కళ్యాణి,
కూర్పు : నవీన్ నూలి

బ్యానర్స్ : జీ స్టూడియోస్, ఎస్కే జీ ఎంటర్ టైన్మెంట్స్, , సుదీర్ బాబు ప్రొడక్షన్స్

నిర్మాతలు : ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, ప్రేరణా అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా

విడుదల : నవంబర్ 7, 2025

హీరో, నవ దళపతి సుధీర్ బాబుకి 2018 లో ‘సమ్మోహనం’ తర్వాత హిట్టే లేకుండా 9 సినిమాలు వచ్చి వెళ్ళిపోయాయి. ఇక 10 వ సినిమా వంతు వచ్చింది. ‘జటాధర’ అనే ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ తెలుగు- హిందీ భాషల్లో ఈ వారం విడుదలైంది. కేరళ లోని పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ ఉన్న పురాణాల, నిధి రహస్యాల ప్రేరణతో ఈ మూవీ రూపొందిందని, ఆలయం మూసివున్న ఖజానాల రహస్యం, పురాతన ఆచారాలు, దైవిక శక్తుల నేపథ్యంలో ఈ కల్పిత కథ ద్వారా దురాశ, త్యాగం, ఆధ్యాత్మిక ఉన్నతి మొదలైన అంశాలని చూపెట్టామని చెప్పారు. కాన్సెప్ట్ ఆసక్తికరంగా వుంది. మరి సినిమా ఎంత ఆసక్తికరంగా వుంది? ఈ విషయం తెలుసుకుందాం…

కథేమిటి?

కార్పోరేట్ జాబ్ చేస్తున్న శివ (సుధీర్ బాబు) ఒక వైపు ఫ్రెండ్స్ తో కలిసి ఘోస్ట్ బస్టర్ గా పని చేస్తూంటాడు. దెయ్యం పట్టిన గృహాలూ స్థలాలూ వంటి చోట్లకి ఫిర్యాదు లందుకుని వెళ్లి దెయ్యా లనేవి లేవని నిరూపిస్తూంటాడు. అవి మూఢ నమ్మకాల్ని ఖండిస్తూంటాడు. అయితే ఇలాటి అతడికి ఓ పీడ కల వెంటాడుతూ వుంటుంది. ఓ తల్లి తన బిడ్డని చంపుతున్న దృశ్యమది. ఇలా వుండగా ఒక రోజు అతడి మిత్రుడు రుద్రారం అనే గ్రామానికి వెళ్లి ఓ పాడుబడ్డ ఇంట్లో చనిపోతాడు. ఆ ఇంట్లో లంకె బిందెలున్నట్టు ప్రచారంలో వుంటుంది. ఆ లంకె బిందెలకి కాపలా వున్న ఓ ధన పిశాచి (సోనాక్షీ సిన్హా) ఆ ఫ్రెండ్ ని బలి తీసుకుందని చెప్పడంతో శివ అక్కడికి బయల్దేరి వెళ్తాడు. నిజంగా ఇది బలి తీసుకున్న కేసేనా, లేక ఇంకేమైనా ఉందా దీని వెనుక? శివ ఎం తెలుసుకున్నాడు? పీడ కలతో అతడికున్న సంబంధ మేమిటి? లంకె బిందెలు సొంతం చేసుకోవాలని ఆశ పడ్డ శివ మేనత్త (శిల్పా శిరోడ్కర్) కథేమిటి ? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలా వుంది కథ?

ఇది సహనాన్ని పరీక్షించే కథ. కథ అనడం కూడా తప్పే. ఇది కథే కాదు. ఆసక్తి కలిగించే కాన్సెప్ట్ కి కథ పేరుతో అల్లిన విషయం అత్యంత హాస్యాస్పదంగా వుంది. అన్ని ప్రమాణాలూ దిగజారిన ఒక వ్యర్ధ ప్రయత్నం. అర్ధం లేని సీన్లు, ఎక్కడికి వెళ్తోందో అర్ధంగాని కథనం, పాత్రలు, మాయలూ మంత్రాలూ, భయపెట్టే పేరుతో చీప్ క్వాలిటీ సీజీ తో చేసిన తమాషా – ఇవన్నీ జుట్టు పీక్కునేలా చేస్తాయి. సుధీర్ బాబు కెరీర్ లో ఇంత అధమ స్థాయి సినిమా రాలేదు.

ఇలా ఉన్నఅర్ధం లేని హార్రర్ కథ చాలనట్టు క్లయిమాక్స్‌లో భక్తిని తెచ్చి కలిపారు. అనంత పద్మనాభస్వామి, నాగ బంధం, అరుణాచలం, అష్ట లింగ ప్రతిష్ట, శివ తాండవం అంటూ ఏవేవో ఆధ్యాత్మిక విషయాలు తడుముతారు. చివరికి ఏమీ అర్ధం గానట్టు చేతులెత్తేస్తారు జంట దర్శకులు.

ఫస్టాఫ్ లక్ష్యం లేకుండా సాగుతుంది. టెన్షన్ లేకుండా, సస్పెన్స్ లేకుండా పాత్రలు వూరికే భయపడుతూన్తాయి. సన్నివేశాల మధ్య లేదా షాట్ల మధ్య కూడా కంటిన్యూటీ లేకుండా సినిమా ఒక విషయం నుంచి ఇంకో విషయానికి జంప్ చేస్తూ సాగుతూంటుంది. రెండవ భాగం ప్రారంభమయ్యే సరికి శిల్పా శిరోద్కర్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ తో కథ కేదో దారి ఏర్పడ్డట్టు ఆశ కలుగుతుంది. ఇది కూడా నీరుగారి పోతుంది. మొత్తంగా కలిపి ఏం చూశామంటే చెప్పడం కష్టం. ఒక పీడ కల గన్నట్టు మాత్రం వుంటుంది.

ఎవరెలా చేశారు?

సుధీర్ బాబు బాగా కష్టపడ్డాడు కానీ ఈ కష్టం దేనికీ ఉపయోగ పడలేడు. సినిమాని కాపాడడం తన భుజ స్కంధాల పైన లేదు- అది దర్శకుల భుజ స్కంధాల పైన కూడా లేదు. ఘోస్ట్ బస్టర్ గా కాసేపు రక్తి కట్టించినా ఆ తర్వాత కథ కానీ కథతో సుదీర్ బాబు ని భరించడం కష్టమై పోతుంది. ఈ సినిమాని చాలా తప్పుగా జడ్జి చేసి ఒప్పుకున్నాడతను.

సోనాక్షీ సిన్హా ధన పిశాచీ పాత్ర కూడా ఇంతే. వొళ్ళంతా బంగారం వేసుకుని గట్టిగా అరవడం, భయంకరంగా నవ్వడం ఇవే మిగిలాయి ఆమెకి. ఇంకా శుభలేఖ సుధాకర్, . ఝాన్సీ, శ్రీనివాస్ అవసరాల, రాజీవ్ కనకాల మొదలైన అనేక మంది నటులదీ దయనీయ స్థితే.

ఇక సాంకేతికంగా చూసినా మార్పేమీ లేదు.జీ ఫిలిమ్స్ లాంటి కార్పోరేట్ సంస్థనుంచి ఇంత లోగ్రేడ్ ప్రొడక్షన్ విలువలుంటాయని అనుకోం. అసలు ఈ సినిమాని ఏమీ పట్టించుకోనట్టు అర్ధమవుతుంది. చీప్ లొకేషన్స్, చీప్ సెట్టింగ్స్, చీప్ సిజీ లతో పని కానిచ్చేశారు. ఇక సంగీతం, కెమెరా వర్క్ కూడా ఇంతే. మొత్తం కలిపి ఈ సినిమా ఎందుకు, ఎవరి కోసం తీశారో పెద్ద సస్పెన్స్. సుదీర్ బాబు దీన్ని ఒప్పుకుని, సహ నిర్మాతగా వుండడం పెద్ద క్వశ్చన్ మార్క్. వరసగా పదవ ఫ్లాప్.

రేటింగ్ : 1.5 /5

KS Prasad Attacks Vangalapudi Anitha Over Vizag Drug Container | Jagan | Telugu Rajyam