రేవంత్ రెడ్డి ఎంపీగా పోటి చేయబోయే స్థానం దాదాపు ఖరారు     

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసలు తెలంగాణలో ఓటమికి గల కారణాలను నేతలను అడిగి తెలుసుకున్నారు. గెలవాల్సిన ప్రాంతంలో ఓడిపోవడానికి అసలు కారణమేందని రాహుల్ నేతలను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి రేవంత్ నువ్వు ఓడిపోవడమేంటి…. గెలవాల్సిన సీటు కదా అని ఆసక్తిగా అడిగారు. దీంతో రేవంత్ రెడ్డి బదులిస్తూ రాత్రికి రాత్రి కొన్ని కోట్ల రూపాయల డబ్బు పంచారని,, ఈవీఎంలలో కూడా అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్ సమాధానమిచ్చారు.

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని రాష్ట్రాల నాయకులతో విడివిడిగా రాహుల్ గాంధీ సమావేశమవుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ నాయకులతో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా అందరు నాయకులతో రాహుల్ మాట్లాడారు. ఖమ్మం నుంచి ఎంపీగా పోటి చేయాలని తెలంగాణ నేతలు రాహుల్ ను కోరారు. దానికి రాహుల్ చిరునవ్వు నవ్వుతూ వద్దన్నట్టు సమాధానమిచ్చారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి వైపు చూస్తూ రేవంత్ నీవేలా ఓడిపోయావు. నువ్వు ఖచ్చితంగా గెలవాల్సిన సీటు కదా అని ప్రశ్నించారు.

దాంతో రేవంత్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రోజు విపరీతంగా డబ్బు పంచారని, ప్రభుత్వం అధికారులను తమ చేతిలో పెట్టుకొని దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల పై కక్ష్యపూరితంగా వ్యవహరించి వారి పార్టీ వారి పట్ల అనుకూలంగా వ్యవహరించారని రేవంత్ బదులిచ్చారు. రేవంత్ సీటు ఇప్పించిన ఎమ్మెల్యేలు గెలిచారా అని రాహుల్ ప్రశ్నించగా వారు విజయం సాధించారని రేవంత్ అన్నారు. 

ఇక అన్నింటిని పక్కకు పెట్టాలని జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా అంతా కలిసి పని చేయాలని రాహుల్ గాంధీ నేతలకు సూచించారు. అయితే ఖమ్మం ఎంపీ సీటు నుంచి రేవంత్ రెడ్డిని బరిలోకి దింపాలని రాహుల్ గాంధీ ఆలోచనగా తెలుస్తోంది. ఖచ్చితంగా గెలిచే స్థానమని నేతలు అనడంతో పార్టీకి ముఖ్యమైన నాయకుడు అక్కడ ఉండాలని రాహుల్ నాయకులతో అన్నట్టు సమాచారం. అయితే దీనికి రేవంత్ రెడ్డిని ఇన్ డైరెక్టుగా రాహుల్ సూచించినట్టు తెలుస్తోంది. కానీ దీనికి పార్టీలోని ఇతర నేతలు ఒప్పుకునే అవకాశం లేదు.  

ఖమ్మం జిల్లాలో విలక్షణమైన తీర్పు వచ్చింది. తెలంగాణ అంతటా టిఆర్ఎస్ కు అనుకూల పవనాలు వీస్తే ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీచాయి. దీంతో ఖమ్మం పార్లమెంటు స్థానం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. దీంతో అక్కడ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పోటి చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఖమ్మం ఎంపీ స్థానానికి రేవంత్ రెడ్డికి ఇచ్చేందుకు రాహుల్ మొగ్గు చూపినట్టు సమాచారం. ప్రజలల్లో అభిమానం ఉన్నవారు మరియు పార్టీ కోసం పని చేసేవారు నిత్యం ప్రజలల్లో ఉండాలని రాహుల్ గాంధీ అన్నారు.

రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీగా పోటి చేస్తారని ప్రచారం జరిగింది. అదే సీటును డికె అరుణ, జైపాల్ రెడ్డి కూడా ఆశిస్తున్నారని తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ సీటుకు మాత్రం కాంపిటేషన్ ఉన్నా అధిష్టానం ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని నేతలన్నారు. విజయశాంతి ఓ సారి పోటి చేస్తానని మరో సారి చేయనని పలుమార్లు అన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డికి ఖమ్మం ఎంపీ సీటును అధిష్టానం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. అయితే లోకల్ లీడర్లు వ్యతిరేకించి రాహుల్ కు నివేదిక ఇస్తే దీని పై చెప్పలేం. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులే రేవంత్ రెడ్డికి సీటు రాకుండా అడ్డుకునే అవకాశం ఉందని రేవంత్ వర్గీయులు అంటున్నారు.