అతగాడు పప్పు కాదు, నిప్పు, నిజమా?

నిన్నటి దాకా  భారతదేశం రంగుల చిత్ర పటం నిండా కాషాయమే కనిపించింది. కాంగ్రెస్ త్రివర్ణం పలుచబడి పోతూవచ్చింది.దీనితో మోదీని బాహుబలి అన్నారు.మోదీ, ఆయన మిత్రుడు అమిత్ షా కలిస్తే తిరుగుండదన్నారు. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అన్నారు.  కాంగ్రెస్అధ్యక్షుడురాహుల్ గాంధీని  బాహుబలి ముందు మరుగుజ్జుగా చూపించారు. మోదీకి ఆయన ప్రత్యర్థే కాదు పొమ్మన్నారు. పార్లమెంటులో నిద్రపోతాడన్నారు. దేశాన్ని, సమస్యలను వదిలి విహారయాత్రలకు పారిపోతాడన్నారు.  ప్రత్యర్థులంతా అనరానిమాటలతో రాహుల్ ని వర్ణించారు. పప్పు అన్నారు. తుప్పు అన్నారు. జోకర్ అన్నారు. వాళ్లంతా ఇపుడునాలుక ను కొంచెం అదుపులో పెట్టుకోవలసిన సమయం ఆసన్నమయింది.

అదే రాహుల్ మూడు ముఖ్యమయిన బిజెపి రాష్ట్రాలలో జనం పర్సప్షన్ మార్చేశారు. రాజకీయాల్లో ఏమి చేశారన్నది ముఖ్యం కానే కాదు, మొదట జనం ఏమనుకుంటున్నాన్నదే ముఖ్యం. జనం ఏమనుకోవాలో నిర్ణయించేది నాయకుడే. అలాంటి నాయకుడే విజయవంతమవుతాడు. రాహుల్ ఇపుడు  మూడు ముఖ్యమయిన రాష్ట్రాలలో జనం ఏమనుకోవాలో నిర్ణయించేశాడు. వాళ్లిపుడు కాంగ్రెస్ వస్తున్నదనుకుంటున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో దాన్నే నిరూపించారు. ఇపుడు బిజెపి పోతున్నదనే మాట వినబడుతున్నది. ఇది సృష్టించడంలో రాహుల్ విజయవంతమయ్యారు.

ఈ మూడు ముఖ్యమయిన రాష్ట్రాలలో,అందునా  గోమండలం (కౌ బెల్ట్ )లో రాహుల్ కాలర్ ఎగరేశాడు. చత్తీష్ గడ్ లో పూర్తి మెజారిటీ తో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్. రాజస్థాన్ లో కూడా మెజారటీ తెచ్చుకుని  ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మధ్య ప్రదేశ్ లో కూడా మొత్తానికి బిజెపి ప్రభుత్వం రాకుండా అడ్డుకుంది. గో రక్షకులు విజృంభించిన ప్రాంతాలలో బిజెపిని దెబ్బతీశాడు రాహుల్. అంతేకాదు, ముఖ్యమంత్రుల ఎంపికలో చాలా చాకచక్యంగా నిర్ణయం తీసుకున్ని వృద్ధ తరాన్ని, యువతరాన్ని రాజీచేశారు. రాజస్థాన్ సచిన్ పైలట్ ని, మధ్యప్రదేశ్ లో జ్యోతిరాధిత్య సింధియాను ఒప్పించి రెండు చోట్ల సీనియర్లు ముఖ్యమంత్రి అయ్యేలా  రెండురోజుల్లోనే నిర్ణయం తీసుకున్నారు.

ఈ మూడు గోమండల రాష్ట్రాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ కొత్త నినాదం తీసుకువచ్చింది. నిన్న మొన్నటి దాకా ఎక్కడో రెండున్నర రాష్ట్రాల పార్టీ గా ఉన్న కాంగ్రెస్ ను ఆయన అమాంతం మధ్య భారతంలో బలమయినశక్తిగా మార్చి అయిదున్నరాష్ట్రాలకు పెంచారు. కాంగ్రెస్ నినాదం మార్చారు,  ‘2018లో ఐదు రాష్ట్రాలు (పంజాబ్, కర్నాటక, పుదుచ్చేరి మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీష్ గడ్ ) 2019లో అన్ని రాష్ట్రాలు’ అనే కొత్త నినాదం ఇచ్చారు.

దీనితో బిజెపి బాహుబలిని ఢీకొనే అర్హతను రాహుల్ సంపాదించారు.  ఇపుడు  ఎంతయినా నరేంద్రమోదీ స్వరం తగ్గుతుంది. రాహుల్ స్వరం      పెరుగుతుంది.  ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలతో రాహుల్ నాయకుడని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ పోతోందన్న భయం పోయి వస్తోందన్న ఆత్మవిశ్వాసం కల్గించించారు. ఇంత మాత్రన మోదీ ఫసక్ అని అనలేం గాని, రాహుల్ గాలి మొదలయిందనక తప్పదు. ఇది వచ్చే లోక్ సభ ఎన్నికల దాకా ఉంటుందా లేదా అనేది ఇపుడే చెప్పలేం గాని,జనంలో , కాంగ్రెస్ అభిమానుల్లో ఆత్మ విశ్వాసమయితే నింపింది.

ఆత్మ విశ్వాసం ఎందుకు నింపిందో ఒక చిన్న ఉదాహరణ. రాజస్థాన్ బిజెపి కంచుకోటల్లో ఒకటి. గోసంరక్షులు బలంగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇదొకటి. అక్కడి పరిస్థితి ఎంతగా మారిందో చూడండి. జైపూర్ జిల్లా అసెంబ్లీ సెగ్ మెంట్లలో కిషన్ పోల్ అనేది ఒకటి. అక్కడ బిజెపి తరఫున మోహన్ లాల్ గుప్తా అనే పార్టీ సీనియర్ నేత పోటీ  చేశారు. ఆయన గతంలో మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కిషన్ పోల్ హిందువులు ఎక్కుగా ఉన్న ప్రాంతం కూడా . అయినా సరే ఈ సారి అక్కడి వోటర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం అభ్యర్థికి వోటేశారు. ఒక్కడ  అమిన్ కాగ్జి 8770 వోట్లతో గుప్తాను ఓడించారు. ఇదొక రాజస్తాన్ సంచలనం.

ఇండియాలో పార్టీలంటే లీడర్లే. పార్టీకొక్కరే లీడర్ ఉంటారు. అభ్యర్థులు ఎంతమంది నిలబడినా నాయకుడి బొమ్మ చూపే ఓట్లడుగుతారు. టిఆర్ ఎస్ అంటే కెసియార్, తెలుగుదేశం అంటే చంద్రబాబు, బిజెపి అంటే మోదీ, కాంగ్రెస్ అంటే రాహుల్.  ఈ మూడు రాష్ట్రాలలో  పప్పు గా  ప్రతిపక్షాల నుంచి బాగా దాడి ఎదుర్కొన్న రాహుల్ గాంధీకి పడిన వోట్లే కాంగ్రెస్ ను గెలిపించాయి. ఎందుకిలా జరిగింది?  హిందూ నియోజకర్గంలో  బిజెపి సీనియర్ నేతను కాదని,  హిందువులంతా ముస్లిం అభ్యర్థికి ఎందుకు వోటేశారు?  బిజెపి అభ్యర్థి పోస్టర్ల మీద మీద బాహుబలి మోదీ బొమ్మ కూడా ఉంది. అయినా సరే, హిందువులంతా మోదీ బొమ్మను కాదని, రాహుల్ గాంధీకి వోటేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ముస్లిం అని కూడా ఎవరూ చూసినట్లు లేరు. ఇదీ ఈ రాష్ట్రాల వోటర్లలో  రాహుల్ తీసుకువచ్చిన మార్పు. మోదీ ముక్త బిజెపి అనేది ఇపుడు బిజెపిలోనే  చర్చ మొదయిందని చెబుతున్నారు. 

ఈ మార్పుతో వచ్చిన మార్పు మరొకటుంది. రాహుల్ గాంధీకి మోదీని ఎదుర్కొనే కరిష్మా లేదని, రాహుల్ అనుభవంలో మోదీని ఎదుర్కొనేందుకు  చాలడని,కాంగ్రెస్ పార్టీకి లీడరే లేడని, ఐడియాలజీ యే లేదనే విమర్శలకు ఈ ఎన్నికలు సమాధానం ఇచ్చాయి.

మధ్యతరగతి వర్గాలు, దళితులు, వర్తకులు, అగ్రకులస్థులు కాంగ్రెస్ పార్టీని వదిలేశాయని బిజెపి చంకలెగరేసుకుంటూవచ్చింది. గత ఎన్నికల ఫలితాలను చూస్తే అలాగే అనిపిస్తుంది. చాలా మంది కాంగ్రెస్ బ్రెయిన్ డెడ్ అన్నారు. అయితే, బిజెపికి ఆందోళన కలిగిస్తూ ఇది కేవలం బిజెపి సృష్టించిన అపోహ మాత్రమే అని బయటపడింది. అందుకే అది నిలబడలేకపోయింది. కాంగ్రెస్ గోమండలంలోనే పుంజుకుంది.

అంతేకాదు, యువతరానికి పెద్ద తరానికి మధ్య సయోధ్య కూడ కుదిరింది పార్టీలో. దీనికి సంకేతంగా రాహుల్ గాంధీ రెండు సార్లు రెండు ఆసక్తి కరమయిన ట్వీట్లు చేశారు (పైన). ఇందులో విశేషం కాంగ్రెస్ లో తరాల మధ్య ఘర్షణ లేదు. సయోధ్య ఉందన్నది,  ఇద్దరు కలసిపని చేస్తారుఅని చెప్పడమే.

అంతిమంగా, రాహుల్ వస్తున్నాడని, కాంగ్రెస్ వస్తున్నదన్న మాట వినిపించేలా చేయడంలో  కాంగ్రెస్ విజయవంతమయింది. అయితే, లోక్ సభ ఎన్నికల్లో ఆయన  ముఖాముఖి మోదీతో  తలపడాల్సి ఉంది.ఈ ఎన్నికలతో  మోదీ పూర్తిగా బలహీన పడ్డడాని అనుకోలేం.  మోదీతో తలపడగల సత్తా రాహుల్ కు వచ్చందనేది మాత్రం నిజం.