చిత్రకారుడుగా , సినిమా దర్శకుడుగా బాపు పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు సంస్కృతీ, సంప్రదాయానికి గౌరవం తీసుకొచ్చిన మహనీయుడు బాపు. ఆయన ఎంతగా ప్రసిద్ధుడంటే ఎవరైనా అమ్మాయి చక్కగా తెలుగుతనము తో ఉంటే వెంటనే “బాపు” బొమ్మలా వుంది అంటారు. ఇక ఆయన కార్టూన్లు చూసి నవ్వని వారు వుండరు.
దాదాపు 50 సంవత్సరాలపాటు తెలుగు సాహిత్యంలోనూ, సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి బాపు.
బాపు 85వ జయంతి నిన్న. ఆయనతో నేను 1986 డిసెంబర్ మొదటి వారంలో చేసిన ఇంటర్వ్యూ . బాపు నిరాడంబరుడు , నిగర్వి. ఆయన మీడియాకు దూరంగా వుంటారు . తొందరగా ఇంటర్వ్యూ ఇవ్వరు . అలాంటి బాపు ఊటీలో నిర్మాత హరి కృష్ణ గారి “కళ్యాణ తాంబూలం “సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూ . 32 సంవత్సరాల క్రితం బాపు అభిప్రాయాలు ఎలావుండేవో ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవచ్చు.
మీ దృక్పథం లో సినిమా ?
“సినిమాకు ఒకే దృక్పథం. ఇందులో వ్యాపార దృక్పథం, కళాత్మక దృక్పథం అనేవి రెండు లేవు . నా దృష్టిలో అభిరుచి ముఖ్యం . ప్రజలకు ఎం కావాలో తదనుగుణ్యంగా నిర్మించాలి . నేను ఎప్పుడు నా వ్యక్తిగత ఇష్టాలను సినిమాలో చూపించాలి అనుకోను . ” చెప్పారు బాపు.
మీకు పౌరాణికాలు అంటే బాగా ఇష్టమనుకుంటా ?
“అవును నాకు పౌరాణికాలు అంటే చాలా ఇష్టం . ఆ కథ , కథనం , పాత్రలు , పరిస్థితులు అన్నీ నన్ను బాగా ఆకట్టుకుంటాయి . నాకు రామారావు గారు నటించిన సీతా కళ్యాణం చిత్రం అంటే ఎంతో ఇష్టం . ఆరోజుల్లో ఆ సినిమాఘన విజయం సాధించింది . పౌరాణికాలు అంటే అప్పటివారికి ఎంతో ఇష్టం , గౌరవం . దర్శకులు ఎంతో ప్రతిభావతంగా తీసేవారు . నటీనటులు కూడా అంకిత భావంతో పనిచేవారు . మనదేశంలో పౌరాణికాలు అంటే తెలుగు సినిమాలనే చెప్పుకోవాలి . అంత పర్ఫెక్షన్ మారె భాషా చిత్రాల్లో కనిపించదు . ఇక ఎన్టీ రామారావు గారి పర్సనాలిటీ , ఆ వాచికం , ఆ గంభీరత , ఆ హావ భావాలు … ఆయా పాత్రలకు నిండుతనాన్ని తెచ్చిపెడతాయి . ” చెప్పారు .
నవలలను చిత్రాలుగా తీయడం గురించి మీ అభిప్రాయం ?
“నవలలను సినిమాలుగా తీయ వచ్చు . నా వరకు చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాణ సాహిత్యం అంతా చదివాను .నేను మీకు ముందే చెప్పినట్టు , వ్యక్తి గత ఇష్టాలు వేరు . సినిమా అన్నది బోలెడంత డబ్బుతో కూడుకున్న వ్యవహారం . నా అభిరుచిని గౌరవించే నిర్మాత దొరకాలి . ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా , నవలను యధాతథంగా తీయాలి . లేకపోతె విశ్వనాథ వారి శిస్యులు ఒళ్ళు చీరేస్తారు . ఆ నవలలను సినిమాలుగా తీయాలంటే కత్తి మీద సాము ” చెప్పారు .
మీరు తీసిన సినిమాల్లో వంశవృక్షం మీకు బాగా పేరు తెచ్చిపెట్టింది , అదికూడా నవలెగా ?
“అవును కన్నడ నవల . అది సినిమా తీయాలనుకున్నాము . మేము ఆ రచయితను సంప్రదిస్తే అందుకు ఆయన ఒప్పుకోలేదు . కారణాలు తెలియవు . మా రమణ స్వయంగా బెంగళూరు వెళ్లి నా పేరు చెప్పి సీతా కళ్యాణం తీసిన బాపు అనగానే ఒప్పుకున్నారు . అయితే ఆ తరువాత నన్ను బెంగళూరు పిలిపించారు . నవలను మార్చడానికి వీల్లేదని కండిషన్ పెట్టాడు . అయితే ఆ తరువాత నేను రమణ కూర్చొని చిన్న చిన్న మార్పులు చేసి ఆయన అంగీకారం తీసుకున్నాము కన్నడంలో కూడా సినిమా వచ్చింది . ఇక తెలుగు సినిమా చూసిన తరువాత ఆయన ఎంతో సంతోషించాడు . ఒక నవలను జనరంజకంగా తీయాలంటే ఎంతో కష్టం ” అన్నారు.
ఇంగ్లీష్ లో కూడా నవలా చిత్రాలు వచ్చాయిగా ?
“చాలా వచ్చాయి. అయితే నవలకు సినిమాకు సంబంధం లేదని వాపోయిన రచయితలు ఎందరో వున్నారు . ఇంగ్లీష్ చిత్ర నిర్మాత దర్శకులు నవలలను తీసుకొని ఎన్నో మార్పులు ,చేర్పులు చేస్తారు . అవి సూపర్ డూపర్ హిట్ అయినా సందర్భాలు వున్నాయి . మరి నవలా రచయిత చెప్పినట్టు లేదా రచినట్టు తీస్తే అంత ఘన విజయం సాధించి ఉండేవి కాదేమో . ఈ కోణంలో ఆలోచిస్తే నవలా రచయిత దృక్పథం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది . ” చెప్పారు
సినిమాలో పాటలు ఉండాలంటారా ?
“తప్పకుండా ఉండాలంటాను . మన సంస్కృతిలో పాట అంతర్భాగం . మన జీవితంలో ప్రతి దశలోనూ పాట కు స్థానం వుంది . ఇక ఇంగ్లీష్ సినిమాల కల్చర్ వేరు . వారి నిత్య జీవితంలో పాట ఉండదు . మనకు బిడ్డ పుట్టి ఉయ్యాలో వేశారంటే పాట పాడవలసిందే . అందుకే సినిమాల్లో పాటకు ప్రాధాన్యత వుంది ” అన్నారు .
కళ్యాణ తాబూలం సినిమా పూర్తిగా ఊటీలో తీయడానికి కారణం ?
” ఈ సినిమా కథకు అవసరం . అందమైన ప్రకృతి ఒకవైపు, మరో వైపు ఎత్తైన కొండలు , డ్డాన్ని ఆనుకొని నది . అందుకే ఇక్కడ చేస్తున్నాము . నిర్మాత వై . హరికృష్ణ అభిరుచి వున్న నిర్మాత. ఇక హీరో శోభన్ బాబు , విజయ శాంతి ఎంతో సహకరిస్తున్నారు ” చెప్పారు బాపు .
– భగీరథ