ఆసు యంత్రం. వినడానికి కాస్త విభిన్నంగా ఉండే ఈ పరికరం పేరు తెలియని చేనేత కార్మికులు ఉండరు. మగ్గంపై చీరెలు, ఇతరత్రా దుస్తులను ఉత్పత్తి చేయడానికి అవసరమైన నూలుపోగులను ఉండెలుగా చుట్టడాన్ని ఆసు పోయడం అంటారు. ఆసు పోసిన ఉండేలను మగ్గానికి బిగించి, మగ్గంపై నేస్తేనే చేనేత వస్త్రాలు రూపుదిద్దుకుంటాయి. టై అండ్ డై విధానంలో చీరల డిజైన్లు, ఇతర రంగులు ఆసు పోయడమే కీలకం.
ఈ ప్రక్రియ మొత్తం ఆసు మీదే ఆధారపడి నడుస్తుంది. ఒక్క చీరకు అవసరమైన నూలును చేతితో ఆసు పోయడానికి కనీసం అయిదు గంటలు కష్టపడాల్సి ఉటుంది. ఇలా ఆసుపోసిన నూలును కిలోమీటర్లలో లెక్కిస్తే.. కనీసం 10కి తక్కువ కాదు. ఇన్ని కిలోమీటర్ల నూలును చేత్తోనే ఆసుపోస్తుంటారు కార్మికులు. అది చాలా శ్రమతో కూడుకున్న పని.
ఇలా చేనేత వృత్తిలో అత్యంత కీలకమైన ఈ ఆసు పోయడానికి అవసరమైన యంత్రాన్ని తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి కనుగొన్నారు. ఆయనే చింతకింది మల్లేశం. శ్రమ లేకుండా, చేత్తో ఆసు పోయాల్సిన అవసరం రాకుండ ఉండటానికి మల్లేశం ఈ యంత్రాన్ని కనుగొన్నారు. `పద్మశ్రీ` అవార్డును అందుకున్నారు.
ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఇప్పటిదాకా 800లకు పైగా ఆసు యంత్రాలను తయారు చేశారు. చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఆయన బయోపిక్‌ను తీశారు. అదే `మల్లేశం`. ఈ మూవీ ఫస్ట్‌లుక్ ఆదివారం విడుదలైంది.
ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ పోషించారు. రెక్కలు ముక్కలు చేసుకుంటూ చేత్తో ఆసు పోసే తల్లిగా ఝాన్సీ నటించారు. ఇందులో తల్లి పాత్ర కీలకం. స్టూడియో 99 ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజ్ ఆర్. శ్రీ అధికారి ఈ సినిమాను నిర్మించారు. నిర్మాతల్లో ఒకరైన రాజ్ ఆర్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాకు గోరటి వెంకన్న, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. మార్క్ కె రాబిన్ సంగీతం.