తెలంగాణ హీరో బ‌యోపిక్‌కి హీరో కావ‌లెను!

 తెలుగులో సావిత్రి బయోపిక్ ‘మహానటి’కి వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా అద్భుత విజయం సాధించింది. హిందీలో సంజయ్‌ద‌త్‌ బయోపిక్ ‘సంజు’ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాలు అందించిన ఉత్సాహంతో హిందీలో కొన్ని బయోపిక్స్ తెరకెక్కడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ హీరోగా ఆయన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోంది. అలాగే, తెలుగులో జానపద చిత్రాలకు పెట్టింది పేరైన కథానాయకుడు, తెలంగాణవాసి ‘కత్తి’ కాంతారావు బయోపిక్ తెరకెక్కించడానికి రంగం సిద్ధమైంది. 

 

సుమారు ఒక 20 ఏళ్లపాటు కథానాయకుడిగా ఒక వెలుగు వెలిగిన కాంతారావు, తరవాత ఆర్ధిక సమస్యలతో సతమతం అయ్యారు. అలాగే, కాంతారావు అంటే గిట్టని కొందరు ఇండస్ట్రీలో ఆయన ఎదుగుదలను అడ్డుకున్నారని  అప్పట్లో వార్తలు వినిపించాయి. వీటన్నిటినీ బయోపిక్‌లో ప్రస్తావిస్తారట. చంద్రాదిత్య ఫిల్మ్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో దర్శకుడు పి.సి. ఆదిత్య ఈ ‘కత్తి’ కాంతారావు బయోపిక్ తెరెకెక్కించనున్నారు. ఆల్రెడీ ‘చీకటి వెలుగుల సంగ్రామం… చిత్రసీమలో నీ పయనం… కాంతారావూ, నీ కీర్తికి అంతంలేదు’ అనే పల్లవితో సాగే టైటిల్‌ సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. కథ, పాటలు రెడీ చేశారు గానీ… ఈ సినిమాలో ఇంకా నటీనటులు ఖరారు కాలేదట. ప్రధాన పాత్రధారుల కోసం ఆడిషన్స్‌ చేస్తున్నామని పి.సి. ఆదిత్య పేర్కొన్నారు.