మహేష్ డైరీలో మరో మూడు సినిమాలు

 ఒక ప్రాజెక్టు సెట్స్‌పై ఉండగానే, కనీసం మరో రెండు ప్రాజెక్టుల్ని లైన్‌లో పెట్టడమే కాదు.. దర్శకులనీ వెంటనే లాక్ చేస్తున్నాడు టాలీవుడ్‌ స్టార్ హీరో మహేష్ బాబు. ఈ విషయంలో మహేష్ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడన్న మాట ఇండస్ట్రీ వర్గాల్లో బాహాటంగా .. బలంగా వినిపిస్తోంది. సంక్రాంతి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి విజయం అందుకున్న మహేష్ అంతకు ముందు ప్రాజెక్టులూ వరుస హిట్లందుకుని ఊపుమీదున్నాడు.

భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. ఇలా రెండేళ్లలో మూడు హిట్లు ఖాతాలో వేసుకున్న మహేష్ తరువాతి ప్రాజెక్టును మహర్షిలాంటి హిట్టిచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి చేతుల్లో పెట్టడం తెలిసిందే. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న టైంలో మహేష్ డైరీలో మరో మూడు సినిమాలు లైనప్ అయ్యాయన్న మాట వినిపిస్తోంది. సో, 2022 వరకూ మహేష్ డైరీలో ఖాళీ లేనట్టేనంటున్నారు. వంశీ పైడిపల్లి సినిమా పూర్తవ్వడంతోనే తన ఫేవరేట్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో ప్రాజెక్టు లాంచ్ చేసే ఆలోచన మహేష్‌కు ఉందట. ఇటీవల బన్నీతో తీసిన అల.. వైకుంఠపురములో’ ప్రాజెక్టుని త్రివిక్రమ్ ఎక్కడికో తీసుకెళ్లాడు.

సంక్రాంతి రేసులో టాప్ హిట్ సినిమాగా అల..ను లేపాడు. ఈసారి మహేష్‌కు త్రివిక్రమ్ ప్రాజెక్టు చేసిపెట్టొచ్చన్న మాట వినిపిస్తోంది. ఆప్షనల్‌గా అనిల్ రావిపూడీ మహేష్ మైండ్‌లో ఉన్నాడట. ‘సరిలేరు..’ టైంలో అనిల్‌కు మహేష్ ఇచ్చిన ప్రయారిటీ మామూలుగా లేదు. సినిమా అనుకున్నంత రేంజ్‌కు వెళ్లకున్నా సంక్రాంతి సీజన్‌కు తగిన సినిమాతో మహేష్ క్రెడిబిలిటీ నిలబెట్టాడు అనిల్. ఆ సందర్భంలోనే అనిల్‌తో మళ్లీ సినిమా చేస్తానన్న డైలాగ్‌ని మహేష్ వదలాల్సి వచ్చింది కూడా. సో, ఈ ఇద్దరిలో ప్రయారిటీ త్రివిక్రమ్‌కు ఇచ్చినా.. తదుపరి ప్రాజెక్టు అనిల్‌తోనే ఉండొచ్చని అంటున్నారు. వాళ్లవాళ్ల కమిట్‌మెంట్లు, కంఫర్టబిలిటీని బట్టి ఎవరు ముందనేది వంశీ ప్రాజెక్టు ఫినిషింగ్‌కు వచ్చేసరికి ఫిక్స్ కావొచ్చు.

ఇక మూడో ప్రాజెక్టుగా.. శ్రీమంతుడు, భరత్ అను నేను చిత్రాలతో హిట్లిచ్చిన కొరటాల శివతో చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. హ్యాట్రిక్ హిట్ కోసం శివతో మహేష్ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడనీ వినిపిస్తోంది. రెండేళ్లలో మూడు హిట్లందుకున్న మహేష్ ఈసారి రెండున్నరేళ్లలో నాలుగు హిట్లు కొట్టే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.