చేతి నుంచి ఇవి పదేపదే జారిపోతున్నాయా.. శకున శాస్త్రం హెచ్చరికలు ఇవే..!

రోజూ జీవితం లో చేతుల నుంచి ఏదో ఒక వస్తువు జారిపోవడం సహజమే. అలసట, తొందర, నిర్లక్ష్యం కారణంగా ఇలా జరగడం సాధారణంగా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఒకే రకమైన కొన్ని వస్తువులు మాత్రం పదేపదే చేతుల నుంచి పడిపోతుంటే, అది కేవలం యాదృచ్ఛికం కాదని శకున శాస్త్రం చెబుతోంది. మత విశ్వాసాలు, జ్యోతిష్య గ్రంథాల ప్రకారం.. కొన్ని వస్తువుల జారిపోవడం రాబోయే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి లేదా కుటుంబ సమస్యలకు సంకేతంగా భావిస్తారు.

ప్రత్యేకంగా ఉప్పు తరచుగా చేతుల నుంచి జారి పడటం మంచిది కాదని పెద్దలు అంటుంటారు. ఇది వైవాహిక జీవితంలో కలహాలు, మనసుకు శాంతి లేకపోవడం, చంద్రుడు–శుక్ర గ్రహ ప్రభావాల వల్ల వచ్చే సమస్యలకు సూచనగా నమ్ముతారు. అలాగే పూజ సమయంలో హారతి అది కింద పడిపోవడం భక్తుల్ని కలవరపెట్టే అంశమే. ఇది దేవుని అసంతృప్తికి సంకేతమని, శుభకార్యాల్లో అడ్డంకులు ఎదురయ్యే అవకాశముందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇక నూనె విషయంలో కూడా శకున శాస్త్రం గట్టి హెచ్చరికలే ఇస్తోంది. నూనెను శనిదేవునికి సంబంధించినదిగా భావిస్తారు. చేతుల నుంచి నూనె పదేపదే చిందితే, అది ఆర్థిక సమస్యలు, అప్పులు లేదా కుటుంబంలో ఎవరికైనా ఎదురయ్యే కష్టాలకు సూచనగా పరిగణిస్తారు. కొన్ని గ్రంథాల్లో ఇది అనుకోని నష్టానికి సంకేతమని కూడా పేర్కొన్నారు.

తినేటప్పుడు ఆహారం తరచూ జారి పడటం కూడా శుభ సూచకం కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అన్నాన్ని వృథా చేయడం అన్నపూర్ణ దేవిని అవమానించినట్టేనని విశ్వాసం. ఇలా జరగడం ఇంట్లో ప్రతికూల శక్తి, పేదరికం లేదా విచారకరమైన వార్తలకు సంకేతంగా భావిస్తారు. అలాగే పాలు పదేపదే పొంగిపోవడం లేదా గ్లాసు చేతిలో నుంచి పడిపోవడం చంద్ర గ్రహ ప్రభావంతో ముడిపడి ఉంటుందని నమ్మకం. ఇది మానసిక ఒత్తిడి, మనశ్శాంతి లోపం లేదా ఆర్థిక నష్టానికి సూచనగా చెబుతారు.

అయితే ఇవన్నీ అంధ విశ్వాసాలుగా పక్కన పెట్టినా, పెద్దలు చెప్పిన ఈ సంకేతాలను కొందరు హెచ్చరికలుగా తీసుకొని జాగ్రత్తగా ఉండాలని భావిస్తారు. ముఖ్యంగా వరుసగా ఇలాంటి సంఘటనలు జరిగితే, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత, కుటుంబ సంబంధాల్లో సహనం అవసరమని శకున శాస్త్రం సూచిస్తోంది.