ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు పాకిస్థాన్ ప్రయత్నించగా, భారత్ గట్టి స్వరంతో స్పష్టమైన సమాధానం ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ భారతదేశంలో విడదీయరాని భాగమని, అది ఎప్పటికీ భారత్‌లోనే కొనసాగుతుందని తేల్చిచెప్పింది. అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ పదేపదే అదే అంశాన్ని లేవనెత్తడం పాకిస్థాన్‌కు తగదని భారత్ హెచ్చరించింది.
ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్థాన్ శాశ్వత రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయగా, భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ వాటిని ఘాటుగా ఖండించారు. అబద్ధాల ఆధారంగా అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదారి పట్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమ్మూ కశ్మీర్ ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా వినియోగించుకుంటూ, ప్రజాస్వామ్య పద్ధతిలో జీవిస్తున్నారని పున్నూస్ స్పష్టం చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ నుంచి ఎలాంటి సూచనలు లేదా ఉపన్యాసాలు అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. నిరాధార ఆరోపణలతో ప్రపంచ వేదికలపై భారత్ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరించారు.
భారతదేశం వంటి సార్వభౌమ ప్రజాస్వామ్య దేశాలపై వేర్పాటువాద భావజాలాన్ని రుద్దేందుకు ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాలను వక్రీకరించడం సరైన మార్గం కాదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న హింస, యుద్ధ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి దృష్టి సారించి, దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కశ్మీర్ అంశాన్ని రాజకీయ ఆయుధంగా మలచే ప్రయత్నాలను భారత్ ఎప్పటికీ సహించదని, జాతీయ సార్వభౌమత్వం విషయంలో రాజీకి ఆస్కారం లేదని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేసింది.
