జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ లో పోరాటయాత్ర చేస్తున్నారు. విశాఖపట్టణం పర్యటనలో ప్రసంగిస్తూ తుపాకీ గురించి, దానిపై ఆయనకు ఉన్న మక్కువ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నయ్య నాకు ఒక రివాల్వర్ కొనిచ్చారు ఎందుకంటే నాకు కోపం ఎక్కువ అని, ఆ కోపం వలన ఎక్కడ ఉగ్రవాదంలోకి వెళ్తానో అని. అదే నాకు ఒక తుపాకీ కొనిస్తే నేను ఆగిపోతానని ఆయన అభిప్రాయం. నా కోపం, ఆవేదన… జరుగుతున్న అన్యాయం మీద. తుపాకీ సొంతం చేసుకోవాలనే కోరికతో కాదు అన్నారు. ఆ విషయాన్నీ అప్పుడే అన్నయ్యకు వివరించలేకపోయా అన్నారు.
అన్నయ్య రివాల్వర్ కొనిచ్చాక దాని మీద ఇష్టం పెరిగిపోయింది. దానిని ఎంతగానో ప్రేమించాను. తల్లిదండ్రులను ప్రేమించాను కానీ నా జీవితంలో ఫస్ట్ లవ్ ఎఫైర్ తుపాకీతోనే మొదలైంది. ఎప్పుడు నా జేబులోని పెట్టుకునేవాడిని. పడుకునేటప్పుడు పక్కలో పెట్టుకునేవాడిని. నిద్రలేవగానే దానిని ముద్దు పెట్టుకునేవాడిని. అదంటే అంతలా ఇష్టం పెరిగిపోయింది. అన్నయ్య కుటుంబం మీద దాడి జరిగినప్పుడు చిరంజీవి గారిలాంటి వ్యక్తినే అలా చేస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి అని ఆవేదన కలిగింది. అప్పుడున్న అధికార ప్రభుత్వం, ప్రతిపక్షాల దౌర్జన్యం మీద, వారి దోపిడీ మీద కోపం వచ్చింది. అందుకే కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సీఎంపీఎఫ్) పెట్టాను.
తెలివి తక్కువగా, ఆలోచన లేకుండా సీఎంపీఎఫ్ పెట్టలేదు. బాగా అలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాను. అన్యాయాన్ని ఎదురించటానికి, అధర్మాన్ని నిలువరించడానికి పెట్టాను. ఈ విషయం చాలామందికి అర్ధం కాలేదు. నా సొంత ఇంట్లోవారు కూడా అర్ధం చేసుకోలేకపోయారు. కొందరి మేధావులకు అర్ధం అయ్యింది. అన్నా నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం అనే జనసైనికులకు, ప్రజాక్షేమం కోరే భువనగిరి చంద్రశేఖర్ లాంటి వారికి అర్ధమయ్యింది అని గుర్తు చేసుకున్నారు.