వి.వి. వినాయక్, పూరీ జగన్నాథ్, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను నల్గురూ మొదట్లో ఒక్కో స్టయిల్ సినిమాలతో ఏలుకున్నారు. ఆ స్టయిలే తమని ఎల్లకాలం టాప్ లో వుంచుతుందనుకున్నారు. టాప్ లోనే వుంటూ వచ్చారు. ఈలోగా పదేళ్ళు గడిచిపోయాయి. సినిమా కెరీర్ కి పదేళ్ళు కాగానే కొత్త గంటలు మోగిస్తూ కొత్త వాళ్ళు వచ్చేసి హడావిడీ చేస్తారు. వాళ్ళూ తమనే కాపీ కొడుతూంటే ప్రేక్షకులకి అది కొత్తగా వుంటుంది. పదేళ్ళ కెరీర్లో సీనియర్ లైపోయిన తమకి తమ స్టయిల్ ని కాపీ కొడుతున్న జ్యూనియర్లతోనే ఇక పోటీ పడాల్సి వస్తుంది. కానీ జ్యూనియర్లు ఎంతైనా కొత్త నీరు. ప్రతీ పదేళ్ళ కోసారి సరికొత్త నీరొస్తూంటే పాత నీరు ఆగిపోవాలి, లేదా కొత్త నీరులో కలిసిపోయి సాగాలి. ఆగలేకా, కొత్త నీరులో కలిసిపోకా ఐడెంటిటీ క్రైసిస్ లో పడినప్పుడు, ఇంకా కొత్తది కనిపెట్టాలి. ఎందుకు కనిపెట్ట లేరు? బాలీవుడ్ లో రోహిత్ శెట్టి కనిపెట్టడం లేదా? అతను కొత్తది కనిపెట్టడమే కాదు, ఆ కనిపెట్టినదాన్నే పట్టుకుని కూర్చోకుండా, ఇక ఇదే ఎల్లకాలం కాపాడుతుందని నమ్మకుండా, సినిమా సినిమాకీ కొత్త కొత్త మైండ్ బ్లోయింగ్ మసాలాలు కనిపెడుతూ, క్లాస్ నీ మాస్ నీ కనికట్టు చేసేస్తున్నాడు. సరికొత్తగా పూరీ జగన్నాథ్ టెంపర్ ని రీమేక్ చేస్తూ అందులో సింగం పోలీస్ క్యారక్టర్ అజయ్ దేవగన్ ని తెచ్చి కలిపి మ్యాజిక్ చేస్తాడని ఎవరైనా ఊహించారా?
సంసారపక్షంగా పై నల్గురు దర్శకులు చేస్తూ వచ్చిందేమిటంటే, అవే కథల్ని తమవైన ఆవే టెంప్లెట్స్ లో పెట్టేసి కేవలం స్టార్స్ ని మార్చుకుంటూ పోయారు. అవే ఫ్యాక్షన్, మాఫియా, యాక్షన్ కామెడీలు. ఈ మూడిటితో ఇంకా కాలక్షేపం చేయాలనుకుంటున్నారు. ఇందుకే వినాయక్ ‘ఇంటలిజెంట్’, పూరీ ‘మహెబూబా’, వైట్ల ‘మిస్టర్’, బోయపాటి ‘వివి రామ’ గడచినా రెండు దశాబ్దాలుగా ఇలాటివే.
1960 లలో తొలి వ్యాపార యుగం మొదలైంది. 70లలో మలి వ్యాపార యుగాన్ని ప్రారంభిస్తూ దాసరినారాయణ రావు, కె. రాఘేంద్ర రావు, ఎ. కోదండ రామిరెడ్డి లు కమర్షియల్ సినిమాల కథల్ని, స్వరూపాన్నీ మార్చేశారు. మలి వ్యాపార యుగాన్ని ఇంకా కొనసాగిస్తూ 80 లలో రాం గోపాల్ వర్మ, కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య లాంటి దర్శకులు, 90 లలో మరింత ముందుకు తీసుకుపోతూ బి గోపాల్, ఈవీవీ సత్యనారాయణ, కృష్ణ వంశీ లాంటి దర్శకులూ కొనసాగారు. ఇలా మలి వ్యాపార యుగంలో దశాబ్దానికో కొత్త మలుపు తీసుకుంటూ వచ్చాయి తెలుగు సినిమాలు. 2000 నుంచీ గ్లోబల్ యుగం మొదలైంది. ఈ గ్లోబల్ యుగంలో ప్రారంభించిన ఫ్యాక్షన్, మాఫియా, యాక్షన్ కామెడీలే ఇంకా కొనసాగుతున్నాయి రెండు ద శబ్దాలుగా. కొత్త నీరుగా కొత్త దర్శకులు వచ్చినా వీటినే పట్టుకుని సేఫ్ జోన్ వేతుక్కుంటున్నారు. ఈ సేఫ్ జోన్ ఒట్టి భ్రమ అని కూడా తేలిపోయింది. ఇంకో పదేళ్ళు ప్రేక్షకులు ఇవే సినిమాలు ఇలాగె భరించక తప్పదు.