తమిళ స్టార్ సూర్య – దర్శకుడు సెల్వరాఘవన్ ల తొలి కాంబినేషన్ లో సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకున్న ‘ఎన్ జి కే’ కే మొత్తానికి విడుదలైంది. ఎంత ఆలస్యానికి అంత వయసు మీద పడుతుందన్నట్టు సినిమా తీరుతెన్నులు సాక్ష్యంగా నిలిచాయి. ఒక స్టార్ మూవీ ఏజి బార్ అయి బాక్సాఫీసు ముందుకు రావడం కన్నా దురదృష్టం వుండదు. అసలే ఇది సెల్వ రాఘవన్ కి మొట్ట మొదటి పెద్ద స్టార్ మూవీ. దీంతో అదృష్టవంతుడు కాలేకపోయాడు.
అనారోగ్యం బారిన పడి తను మాత్రమేం చేస్తాడు. ఫ్లాప్ కి సిద్ధపడీ దీన్ని పూర్తి చేసిన సూర్య సహకార గుణాన్నికూడా మెచ్చుకోవాలి. అన్నట్టు సినిమాలో తన పాత్ర కూడా ప్రజలకి సహాయ సహకారాలందిస్తూ పాటు పడేదే. కాకపోతే సినిమా కథే సహాయ నిరాకరణ చేసింది. కథ సహాయ నిరాకరణ చేస్తే ఎంత స్టార్ అయినా, ఎన్ని అరుపులు అరిచీ సినిమాని హిట్ చేయలేడనేది తెలిసిన వాస్తవం. అసలేమిటీ కథ, ఏమిటా సహాయ నిరాకరణ, ఒకసారి చూద్దాం…
కథ
నంద గోపాల కృష్ణ, అంటే ఎన్ జి కే (సూర్య) ఎం టెక్ చదివిన టెక్కీ. కానీ ఆ ఉద్యోగం మానేసి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూంటాడు. దీనికి వూళ్ళో ప్రోత్సహిస్తూంటాడు. అదే సమయంలో ఎవరికే కష్టం వచ్చినా తీరుస్తూ వుంటాడు. దీంతో అతడికి మంచి పేరొస్తుంది. ఇంట్లో భార్య గీతా కుమారి (సాయి పల్లవి), తల్లీ వుంటారు. అయితే తను ప్రోత్సహిస్తున్న ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కొన్ని వర్గాలకి ఇబ్బందులొస్తాయి. ఎరువుల వ్యాపారులు, క్రిమిసంహారక మందుల వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, పోలీసులూ వీళ్ళందరికీ ఆదాయాలు పోతాయి. దీంతో పంటలు నాశనం చేసేస్తారు.
ప్రజలు వ్యతిరేకమవుతారు. ఏం చేయాలో పాలుపోని గోపాల్ ఒక పార్టీ కార్యకర్త మాటలు విని ఎమ్మెల్యే (బాలా సింగ్) ని కలుస్తాడు. ఎవరూ నీ జోలికి రాకుండా చూస్తా గానీ, నువ్వు మాత్రం నీకున్న ఐదువందల మంది యువబలంతో మా పార్టీలో చేరాలంటాడు ఎమ్మెల్యే. గోపాల్ అలాగే చేస్తాడు. పార్టీ బలం పెరిగిందని సీఎం మెప్పు పొందుతాడు ఎమ్మెల్యే. కానీ కార్యకర్తగా గోపాల్ చేత ఇంటి పనులు చేయించుకుంటూ హీనంగా చూస్తాడు. దీంతో ఆ ఎమ్మెల్యేకి ఎసరుపెట్టి తను సీఎం దాకా ఎదిగిపోవాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు గోపాల్. ఇందులో భాగంగా పరిచయమైన వనిత (రకుల్ ప్రీత్ సింగ్) అనే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు…
ఎలావుంది కథ
రొటీన్ రాజకీయ ఫార్ములా కథ. హీరో సీఎం అయ్యే అదే పాత మాస్ కథ. 2016 లో ఈ కథ రాసుకోవడంతో ఇప్పుడు పాతబడిన ఫ్లాప్ కథ. సీఎం అవడానికి హీరో ఏం చేశాడనే కన్నా, సీఎం అయి ఎలా పాలించాడనే కథగా వుంటే ఆసక్తి వుండేదేమో. ఇందులో చూపించిన సేంద్రియ వ్యవసాయం సామాన్య ప్రజానీకానికి ఉపయోగ పడేది కాదు. ఈ ఆహారోత్పత్తుల ధరలు సామాన్యులు భరించలేరు. ప్రజల చేత సేంద్రియ వ్యవసాయాలు చేయించి వ్యవస్థ కన్నెర్ర జేయడానికి కారకుడయ్యాడు తప్పితే ఈ కథతో ఒరిగిందేమీ లేదు. దుష్టుల వల్ల కోల్పోయిన ఈ సేంద్రియ వ్యవసాయం కోసమైనా సీఎం అవ్వాలన్న గోల్ పెట్టుకుని వుంటే, అందుకు ఆర్గానిక్ ఉత్పత్తులు వాడే సంపన్న వర్గాల సపోర్టు చూపిస్తే, ఈ కథకి ఓ అర్ధం పర్ధమైనా వుండేదేమో. కథని ఏ మాత్రం రీసెర్చి చేయకుండా చుట్టేద్దామ
నుకున్నారు.
ఎవరెలా చేశారు
ముందుగానే చెప్పుకున్నట్టు సూర్య ఎన్ని అరుపులు అరిచీ సినిమా కేం లాభం. కథ లాభ పడితేగా తను లాభ పడేది, సినిమా లాభ పడేది. నటనతో ఇరగ దీశాడనే మాస్ భాషలో చెప్పవచ్చు. సినిమా మాత్రం ఇరగ దీయలేదు. పాటలు కూడా డిటో. ఇంత సూర్యకి సరైన విలన్ కూడా లేకపోవడం చూస్తే ఈ స్టార్ మూవీ రేంజ్ ఏమిటో తెలిసిపోతుంది. దాదాపు 40 – 50 నిమిషాలు డల్ గానే వుంటాడు సూర్య రాజకీయాల్లో అక్రమాలకి బాధ పడుతూ. ఆ తర్వాతే కర్తవ్యం తెలుసుకుని చురుకుగా తయారవుతాడు. కానీ సీఎం అవడానికి చేసే పనులకే ఓ అర్ధంపర్ధం, క్రమం వుండవు. ఒక స్టార్ గా సూర్య ఫెయిల్ కాలేదు, కథ సహకరించక కథే ఫెయిలైంది.
ఈ సినిమాలో సాయిపల్లవి ఎందుకుందో అర్ధంగాదు. ఇంట్లో కూర్చుని భర్తని అనుమానించే పాత్ర. భర్తనుంచి ఫెర్ఫ్యూమ్ వాసనకి తిరుగుళ్ళు అంటగట్టి గొడవ పెట్టుకునే పాత్ర. రాజకీయంగా ఎదగడానికి అతను పాల్పడుతున్న పద్ధతుల్ని వ్యతిరేకించే చాలా పాత కాలపు పాత్ర. రకుల్ ప్రీత్ సింగ్ ఆధునిక ఎన్నికల వ్యూహకర్త పాత్ర ఎంట్రీ వరకే ధూంధాం. ఆ తర్వాత తలా తోకా వుండవు. సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ అనే ముగ్గురు స్టార్లు కలిసి స్టార్ మూవీని ఎంత అపహాస్యం చేయాలో అంతా చేసి సంతృప్తి పడ్డారు.
ఇక యువన్ శంకర్ రాజా ఏం మ్యూజిక్ కొట్టాడో అర్ధం గాదు. పాత రోజుల్లో సినిమా బాగా లేకపోయినా పాటల తోనే హిట్టయ్యేవి వుండేవి. ఇప్పుడలాటి హిట్ మ్యూజిక్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇక శివకుమార్ విజయన్ కెమెరా వర్క్ ఫర్వాలేదు. ఎడిటింగ్ అదుపులో లేదు. ఏం కథో అర్ధం గాకపోతే ఏ సీను తీసేసి నిడివి తగ్గించాలో అర్ధంగాదు. అందుకనే రెండు గంటల 40 నిమిషాల మోతబరువు నిడివికి వదిలేశాడు.
సెల్వ రాఘవన్ ఒకప్పటి దర్శకత్వపు క్వాలిటీ ఇప్పుడు లేదు. ఆరేళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత తనకి ఇదే సినిమా. ఈ గ్యాప్ పనితనాన్ని పలచ బారేట్టు చేసినట్టుంది. అతి పేలవంగా తయారయింది ప్రొడక్టు.
చివరికేమిటి
యాభై నిముషాలు నీరసం, ఆ తర్వాత గంటా యాభై నిమిషాలు గంరగోళంతో ఇది నో గ్యారంటీ కథ (ఎన్ జి కే). ఫస్టాఫ్ యాభై నిమిషాలు ఇంట్లో భార్యతో తల్లితో, బయట రకరకాల ప్రజా సేవలతో కమర్షియల్ ఎంటర్ టైనర్ కి వ్యతిరేకంగా ఆర్ట్ సినిమా చూస్తున్నట్టు నీరసంగా వున్నాక, ఆ తర్వాత నుంచి ముగిసే దాకా గంటా యాభై నిమిషాలు అర్ధం లేని సీన్లతో, కథ ఎక్కడి కెళ్తోందో అంతుబట్టని సీన్లతో, గందరగోళంగా తయారైపోతుంది. ఇంత గందరగోళంగా వున్న సినిమాలో మంచి విషయాలని వెతడం అసాధ్యం. దర్శకుడిని, స్టార్ ని మన్నించి ఇలాటి అర్ధం లేని సినిమా తీసిన నిర్మాతల సాహసానికి మాత్రమే మెచ్చుకోగలం.
<
p style=”font-weight: 400″>―సికిందర్