రచన- దర్శకత్వం : భాను భోగవరపు
తారాగణం : రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, నరేష్, అజయ్ ఘోష్, తారక్ పొన్నప్ప, వీటీవీ గణేష్, హైపర్ ఆది తదితరులు.
సంగీతం : భీమ్స్ సిసిరోలియో,
చాయాగ్రహణం : విధు అయ్యన్న,
కూర్పు : నవీన్ నూలి
బ్యానర్స్ : సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల : నవంబర్ 1, 2025
2023 నుంచి నాలుగు వరస ఫ్లాపుల తర్వాత, తన 75 వ సినమాగా మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ విడుదలైంది. ఈసారైనా హిట్ కొడతాడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి రవితేజ ఎంత బాధ్యతగా ఈ సినిమాని అందించాడన్న కుతూహలం సహజంగానే వుంటుంది. దర్శకుడుగా మారిన రచయితతో, మరోసారి హీరోయిన్ శ్రీలీలతో రవితేజ తన మార్కు మాస్ అవతారమెత్తి సర్వశక్తులూ ఒడ్డి హిట్ కొట్టాడా లేదా అన్నది ట్రైలర్ తో తెలిసిపోయింది. ట్రైలర్ లో విషయం లేకపోగా, నటించిన పాత్ర కూడా పాత రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులు, అభిమానులు డీలా పడిపోయారు. ఒక స్టార్ సినిమా జాతకం ట్రైలర్ తో తేలిపోయిందంటే ఎంత లైట్ గా తీసుకుని సినిమా తీశారో అర్ధమైపోతుంది. అయినా ఏం తీశారో, ఎందుకు తీశారో, ఎలా తెశారో సినిమా చూసి తెలుసుకుందాం…

కథేమిటి?
లక్ష్మణ్ భేరి (రవితేజ) వరంగల్ లో రైల్వే సబిన్ స్పెక్టర్. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో తాత (రాజేంద్ర ప్రసాద్) పెంచి పెద్ద చేస్తాడు. రైల్వే పోలీసుగా తన పరిధిలోకి రాని అన్యాయాల్ని ఎదుర్కొనే సామాజిక స్పృహతో ఉంటాడు. ఈ క్రమంలో ఒక రాజకీయ నాయకుడి కొడుకుని కొట్టడంతో అక్కడనుంచి అడవివరం అనే ఊరుకి ట్రాన్స్ ఫర్ అవుతాడు. ఆ మారుమూల వూళ్ళో శివుడు (నవీన్ చంద్ర) అనే స్మగ్లర్ జనాల చేత గంజాయి పండిస్తూ కోల్ కత కి స్మగ్లింగ్ చేస్తూంటాడు. అతడికి రాజకీయ వర్గాల, పోలీసు వర్గాల అండ దండిగా వుంటుంది. ఇతడి వ్యవహారాల్ని గమనించిన లక్ష్మణ్ భేరి అడ్డుకోవడం మొదలెడతాడు. పరిధి దాటి ఇన్వాల్వ్ అవుతున్న అతడ్ని రాజకీయ నాయకులూ, పోలీసులూ హళన చేస్తారు. స్మగ్లింగ్ పై చర్య తెసుకువాల్సిన వాళ్ళే హేళన చేయడంతో లక్ష్మణ్ భేరీ పంతానికి పోతాడు. ఈ క్రమంలో బలవంతుడైన శివుడుని ఎదుర్కొని గంజాయి దందా ఎలా బంద్ చేయించాదనేది మిగతా కథ.

ఎలావుంది కథ
తెలిసిన పాత కథే. ఒక పోలీసు- ఒక స్మగ్లర్ పోరాడుకునే రొటీన్ మూస ఫార్ములా కథ. రైల్వే పోలీసు పాత్ర అనేదే కొత్త. మిగతా దాని చుట్టూ కథ తెలిసిన కథే. ఇలాటి కథలతో మాస్ సినిమాలు ఎన్ని వచ్చాయో అన్ని పాత సీన్లతో వుందీ కథ. కనీసం కథనంలో కూడా కొత్తదనం లేదు. టెంప్లెట్ కథనాలతో వచ్చిన సినిమాలు ఫ్లాపవుతూ అవి ఆగిపోయినా, అదే ధోరణిలో కథ నడిపించాడు దర్శకుడు భోగవరపు భాను. రవితేజ ఎంట్రీ, ఓ యాక్షన్ సీను, ఓ సాంగ్, ఓ కామెడీ సీను, ఓ రోమాంటిక్ సీను మళ్ళీ ఫైటూ..ఇలా ఇవే రిపీటవుతూ వుంటాయి. ఇలాటి కథలో బలమైన కాన్ఫ్లిక్ట్ కూడా లేదు. కాబట్టి దాని తాలూకు సినిమాని నిలబెట్టే ఎమోషన్స్ కరువయ్యాయి. ఎమోషన్స్ ని హీరో, అతడి తాతల మధ్య పెడితే, ఆ తాత క్యారక్టరే హాస్యాస్పదంగా ఉండడంతో ఆ సెంటిమెంట్లు, ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. తాత తోనే కాదు, హీరోయిన్ సహా మిగిలిన పాత్రలతో కూడా హీరో పాత్రకి కనెక్టివిటీ లేకపోవడంతో -మొత్తంగా ఇది దర్శకుడి దృష్టిలో కథా కథనాలు అవసరం లేని కేవలం మాస్ మహారాజా హైపర్ యాక్టింగ్ ఒక్కటి చాలని సరిపెట్టుకున్న ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందు కొచ్చింది.

ఫస్టాఫ్ రవితేజ ఎంట్రీ యాక్షన్ సీను మాత్రం అదిరిపోతుంది. ఇదే లెవెల్లో మిగతా సినిమా కూడా ఉంటుందని ఆశిస్తే అత్యాశే అవుతుంది. ఈ యాక్షన్ సీను తర్వాత పైన చెప్పుకున్నట్టు టెంప్లెట్ లో సీన్లు రావడం మొదలవుతాయి. మధ్యమధ్యలో రవితేజ తాత తో అనుబంధం రవితేజకి పెళ్లి కాకపోవడం వంటి సీన్లు ఫన్నీగా సాగుతాయి. తర్వత విలన్ శివుడి పాత్ర పరిచయం, ఆ తర్వాత అక్కడికే రవితేజ ట్రాన్స్ ఫర్ అవడం, అక్కడ హీరోయిన్ శ్రీలీల గంజాయి పంట పండిస్తూ ఉండడం, శివుడు గంజాయి స్మగ్లింగ్ కి రైల్వేస్ ని ఉపయోగించుకోవడం, దీన్ని రవితేజ అడ్డుకునే ప్రయత్నంతో కథ వేగం పుంజుకుంటుంది.
కానీ సెకండాఫ్ కొస్తే ‘ఓజీ’ లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ‘ఓజీ’ లో విలన్ కి సంబంధించిన ఆర్డీ ఎక్స్ ని పోర్టు కాంట్రాక్టర్ ప్రకాష్ రాజ్ దాచి పెడితే దానికోసం విలన్ పన్నే కుట్రల చుట్టూ కథ సాగినట్టు- ఇక్కడ రవితేజ దాచిపెట్టిన గంజాయి కోసం శివుడి విలనీ సాగుతుంది. ఈ పాయింటు చుట్టూ సాగే సెకండాఫ్ కథ కాసేపట్లోనే బలహీనపడి బోరు కొట్టడం మొదలవుతుంది. సెకండాఫ్ ఈ కథ నడపలేక మొత్తం సినిమా అభాసు అయ్యే పరిస్థితే ర్పడింది.

ఎవరెలా చేశారు?
రవితేజ హైపర్ యాక్షన్ ఒక్కటే ఫ్యాన్స్ కి ఊరట. యాక్షన్ సీన్స్ లో రవితేజవి ఫుల్ మార్కులే. ఈ యాక్షన్ సీన్స్ కి తగ్గట్టుగా కథ ఎలివేట్ అయివుంటే తప్పకుండా ఇది హిట్టయ్యేది.పాత కథ అయితే కావచ్చు, దాన్ని కొత్తగా ఎలా చూపించాలో తెలుసుకోకే పోవడం తో మొత్తం వ్యవహారం చెడింది. రవితేజ హైపర్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా రవితేజ పాత సినిమాల ప్రస్తావన బాగా వర్కవుటయింది. పాత్రతో పాల్పడిన ఇలాటి మార్కెటింగ్ గిమ్మిక్కులు కథతో కూడా చేసి వుంటే రిజల్ట్ వేరేగా వుండేది. అయితే వయసుపై బడ్డ రవితేజ ఇంకా అదే తన పాత మార్కు కామెడీ, రోమాన్సు చేయడం మాత్రం ఎబ్బెట్టుగా వున్నాయి.
గంజాయి పండించే శ్రీలీల పాత్రకి ఓ కథ వుంది కానీ దాన్ని పట్టించుకోలేదు దర్శకుడు. దీంతో ఆమె షోకేసులో బొమ్మలా మిగిలింది. తాత పాత్రలో రాజేంద్రప్రసాద్ పాత్ర, చేసే కామెడీ కూడా ఎబ్బెట్టుగా వున్నాయి. విలన్ శివుడుగా నవీన్ చంద్ర అయితే వీక్ పాత్ర. ఎంతసేపూ అరుపులు అరవడమే తప్ప ఆ అరుపులకి తగ్గట్టు చేసేదేమీ వుండదు.

సాంకేతికాల సంగతి ?
పేరున్న బ్యానర్స్ నిర్మాణంలో సాంకేతిక విలువలకి కొదవ లేదు. కెమెరా వర్క్, బిజిఎం, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, పాటల చిత్రీకరణా …ఇలా ఏది తీసుకున్నా గొప్పే- ఒక్క దర్శకుడి చేతిలో స్క్రిప్టు తప్ప! సినిమాలో ‘సూపర్ డూపర్.. సూపర్ డూపర్’ అని పాట వుంది. ఈ పాటలో ‘రిథం లేదు, కదం లేదు, అర్ధం లేదు, పర్ధం లేదు’ అన్న లైన్లు వున్నాయి. ఇవి స్క్రిప్టుకే వర్తించేలా వున్నాయి. మొత్తానికి కేవలం రవితేజ టాలెంట్ తో పూర్తిగా ఒన్ మాన్ షోగా నడిచే ఈ ‘మాస్ జాతర’ మాస్ ప్రేక్షకులైనా నచ్చుతుందో లేదో చూడాల్సిందే.
రేటింగ్ : 2 / 5

