1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ హైదరాబాద్‌కి మాత్రం స్వాతంత్రం రాలేదు. హైదరాబాద్‌తో పాటు మిగతా తెలంగాణ ప్రాంతం నిజాంల పాలనలో వుండింది. ఖాసిం రజ్వీ నిజాం పాలనలో రజాకార్ సైన్యాన్ని ఏర్పాటు చేసి, హిందూ ప్రజలపై దాడులు చేయడమే కాకుండా.. హైదరాబాద్‌ని భారతదేశంలో విలీనం కాకుండా అడ్డుకున్నాడు. నిజాం పాలనకు, రజాకార్ సైన్యానికి తెలంగాణ ప్రజలు ఎదురొడ్డి చేసిన పోరాటమే ‘తెలంగాణ విముక్తి పోరాటం’. ఖాసిం రజ్వీ స్థాపించిన ‘రజాకార్’ సైన్యం ప్రజలపై ఎటువంటి ఘాతుకాలకు పాల్పడింది.. దానికి ప్రజలు ఎలా ఎదురుతిరిగారు, అప్పటి భారత ప్రభుత్వం ఎలా స్పందించింది? అనే నేపథ్యంలో తీసిన సినిమా ఇది. యాట సత్యనారాయణ దర్శకుడు, గూడూరు నారాయణ రెడ్డి నిర్మాత. చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా దేశంలోని సంస్థానాలను, రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తారు.
కానీ హైదరాబాద్ రాజు నిజాం మాత్రం ఒప్పుకోకుండా స్వంతత్రంగా వ్యవహరించాలని అనుకుంటాడు. ఖాసిం రజ్వీ అతని ప్రైవేట్ ఆర్మీ అయిన రజాకార్ సైన్యంతో, అప్పటి నిజాం ప్రధాని లాయక్ అలీ ఖాన్ తో హైదరాబాద్‌ను పాకిస్తాన్ దేశం సహాయంతో తుర్కిస్తాన్‌గా మార్చడానికి ఒక కుట్ర పన్నుతాడు. అందుకు తమ రాజ్యంలోని హిందూ ప్రజలని హింసించి, వారిపై అనేకరకాలైన దాడులు చేస్తూ, వాళ్ళని మతం మార్చుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తాడు. తెలుగు, కన్నడ, మరాఠీ లాంటి అనేక భాషలను నిషేధించి కేవలం ఉర్దూ మాత్రమే ఉండాలని చట్టం తెస్తాడు. తమకి ఇష్టమొచ్చిన రీతిలో ప్రజలపై పన్నులు విధిస్తూ, ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ సైన్యం ఒక మారణహోమాన్ని సృష్టిస్తుంది. వారికి ఎదురు తిరిగిన గ్రామాలను స్మశానవాటికలా తయారు చేస్తారు. అప్పటి భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం పాలన చేస్తున్న మారణ కృత్యాలను తెలుసుకొని సైనిక చర్యకి పూనుకోవాలని అనుకుంటారు.
నిజాం పాకిస్తాన్ సహాయం కోరి, భారత సైన్యం రాకుండా తెలంగాణ ప్రాంత సరిహద్దులన్నింటినీ మూసివేస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో భారత సైన్యం ఏవిధంగా హైదరాబాద్ చేరుకుంది, నిజాం పాలనకి ఎలా చరమగీతం పాడింది? తెలంగాణ ప్రజలు ఎటువంటి పోరాటం చేశారు? ఇవన్నీ ‘రజాకార్’ సినిమాలో చూపారు. హిందూ స్త్రీ కనపడితే చాలు అప్పట్లో ఎంత పైశాచికంగా రజాకార్ సైన్యం ప్రవర్తించారు అన్నది చరిత్ర పుటల్లో చెప్పే సత్యాలు. ఈరోజుకి మన పూర్వీకులని అడిగితే చెబుతారు. మత మార్పిడులు, అనేకరకాలైన పన్నులు, మాటవినని ప్రజలను చిత్ర హింసలకు గురిచేయడం, సజీవ దహనాలు, ఒకటేమిటి రజాకార్ సైన్యం ఒక మారణహోమం సృష్టించింది. అవన్నీ దర్శకుడు వెండితెరపై కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. తెలంగాణ ప్రజలనుండి ఒక్కొక్క నాయకుడు రజాకార్ సైన్యానికి ఎదురొడ్డి నిలబడటం, ప్రజాసమీకరణ చేయడం, చివరికి సైన్యం చేతిలో ఓడిపోవటం, అవన్నీ దర్శకుడు చక్కగా చూపించగలిగాడు.
అలాగే భైరాన్ పల్లె గ్రామ వాసుల సాయుధ పోరాటం.. ఈశ్వరయ్య, గండయ్య టీమ్ నిజాం ప్రభువుపై బాంబు దాడి, ఇవన్నీ బాగుంటాయి. ఇది అందరికీ తెలిసిన కథే అయినా, కమ్యూనిస్ట్‌ల పాత్ర కూడా కీలకం. మొత్తం మీద దర్శకుడు యాట సత్యనారాయణకి కథపై పట్టుతో వున్నది వున్నట్టుగా తీసి చూపించడంలో కృతకృత్యులయ్యారు. ఇక నటీనటుల విషయానికి వస్తే ఖాసిం రజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ ఆ పాత్రలో జీవించేశాడనే చెప్పాలి. హావభావాలు, అతని నటన, అసలు నిజంగా ఖాసిం రజ్వీ తెరమీద కనిపించాడు అన్నంత అద్భుతంగా పోషించారు. అతని చేత అంతలా చేయించిన దర్శకుడిని ప్రశంసించాలి. అలాగే నిజాంగా మకరంద్ దేశ్ పాండే ఆ పాత్రలో ఒదిగిపోయాడు. వల్లభాయ్ పటేల్‌గా రాజ్ సప్రూ మంచి ప్రతిభ కనపరిచాడు.
జాన్ విజయ్ నిజాం ప్రధానిగా పరవాలేదు అనిపించాడు. ఇక చాకలి ఐలమ్మగా ఇంద్రజ చేసిన పాత్ర మెరిసింది. రాజా రెడ్డిగా బాబీ సింహ ఒక ముఖ్య పాత్రలో వచ్చి తళుక్కున మెరుస్తాడు. అనసూయ పాత్ర చిన్నదే అయినా, ఒక బతుకమ్మ పాటలో కనిపించడమే కాకుండా, తరువాత వచ్చే సన్నివేశంలో చేసిన నటన హైలైట్ అని చెప్పాలి. నటి వేదిక సంతవ్వగా కనబడుతుంది. ప్రేమ కూడా ఒక మంచి పాత్ర చేసింది. ఇలా నటీనటులు అందరూ ఎంతో చక్కగా నటించబట్టి సినిమా ఎంతో ఆసక్తికరంగా సాగిందని చెప్పాలి. నిజాం పాలనకు, ఖాసిం రజ్వీ తన రజాకార్ సైన్యంతో చేసిన మతోన్మాద మారణ హోమానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎటువంటి సాయుధ పోరాటం చేశారు, ప్రజలు ఎలా తిరగబడ్డారు అనేది చరిత్ర పుటల్లో, పుస్తకాల్లో వున్న కథకి అద్భుతమైన తెర రూపం ఇచ్చాడు దర్శకుడు యాట సత్యనారాయణ.