చందమామ కథకు ప్రాణం పోసిన ‘యక్షిణి’

పురాణాల్లో మాత్రమే కనిపించే ‘యక్షిణి’ పాత్రను వెబ్‌సీరిస్‌గా రూపొందించారు. మాయ (వేదిక) ఒక యక్షిణి. శాపం కారణంగా భూమిపై ఉండాల్సి వస్తుంది. తమో రజో గుణంతో వందమంది పురుషులను అనుభవించి, వారిని హతమార్చిన తర్వాతే ఆమెకు శాపవిమోచనం కలుగుతుంది. 99 మందిని అలాగే హత్య చేస్తుంది. అయితే, 100వ వ్యక్తి మాత్రం నిష్ట కలిగిన బ్రహ్మచారి అయి ఉండాలన్నది షరతు. అలాంటి వ్యక్తి కోసం వెతుకుతున్న తరుణంలో కృష్ణ (రాహుల్‌ విజయ్‌) పరిచయం అవుతాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడు. మరోవైపు క్షుద్ర, తాంత్రిక విద్యలతో యక్షిణిని వశం చేసుకోవాలని ఎదురు చూస్తుంటాడు మహాకాల్‌ (అజయ్‌). మరి యక్షిణితో పరిచయం అయిన తర్వాత కృష్ణ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? మహాకాల్‌ ఎందుకు యక్షిణిని వశం చేసుకోవాలని చూస్తున్నాడు? ఇవన్నీ తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే! పురాణాల్లో పాత్రల ఇతివృత్తంగా సినిమాలను తెరకెక్కించడం తెలుగు తెరకు కొత్తేవిూ కాదు. మారిన పరిస్థితులకు వాటిని అన్వయించుకుంటూ రూపొందిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనేందుకు ’బింబిసార’లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి.

అయితే, కథ చెప్పే విషయంలో ఎంత కన్విన్సింగ్‌గా చెప్పామన్న దానిని బట్టే విజయం ఆధారపడి ఉంటుంది. ’యక్షిణి’ అనే చందమామ కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు తేజ మర్ని మంచి ప్రయత్నం చేశారు. బ్రహ్మచర్యం నిష్టగా పాటించే వ్యక్తిని అనుభవించి చంపడం ద్వారా తన శాపాన్ని విమోచన చేసుకోవాలనుకునే యక్షిణి మాయ.. భూవ్మిూద ఉన్న యక్షిణిని ఎలాగైనా వశం చేసుకోవాలనుకునే మహాకాల్‌.. తన కలల రాకుమారితో జీవితాన్ని గడపాలనుకునే సగటు కుర్రాడు కృష్ణ.. ఇలా మూడు పాత్రలను కనెక్ట్‌ చేస్తూ సిరీస్‌ను నడిపాడు. ప్రతీ ఎపిసోడ్‌ ముందు అలకాపురి దాని చరిత్ర, యక్షిణులు ఎవరు వారి గతం ఏంటి? నాగలోకానికి, యక్షలోకానికి మధ్య ఉన్న వైరం. యక్షిణి భూవ్మిూదకు రావడానికి గల నేపథ్యాన్ని వివరిస్తూ సిరీస్‌ను తీర్చిదిద్దారు.

యక్షిణి పాత్ర, ఆమె శాపాన్ని పరిచయం చేస్తూ సన్నివేశాలను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా మూడు ప్లాట్‌లను సమాంతరంగా చూపిస్తూ వెళ్లాడు. యక్షిణి అందం చూసి ఆమెతో ప్రేమలో పడిన కృష్ణ చావకుండా ఎలా బయటపడతాడా? అన్న ఉత్కంఠతో సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. యక్షిణిని వశం చేసుకోవడానికి మహాకాల్‌ వేసే ప్లాన్‌లను కూడా ఆసక్తికరంగా చూపించారు. మూడో ఎపిసోడ్‌లో జ్వాలాముఖి( మంచు లక్ష్మి) పాత్రతో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు.

థ్రిల్లింగ్‌గా సాగే సిరీస్‌లో మధ్యలో కృష్ణ కుటుంబం చేసే హంగామా సాగదీత వ్యవహారంలా అనిపిస్తుంది. ఒక సీరియస్‌ మోడ్‌లో సాగుతున్న సిరీస్‌ స్పీడ్‌ బ్రేకర్‌ వేసినట్లు అనిపిస్తుంది. ఒక్కో ఎపిసోడ్‌ సాగుతున్న కొద్దీ పాత్రలు వాటి నేపథ్యాలు మరింత బలంగా చూపించాల్సింది పోయి, సన్నివేశాలు, పాత్రలు పలుచబడిపోయాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ పాత్రల మధ్య సంఘర్షణ తగ్గిపోతూ వచ్చింది. ముఖ్యంగా చివరి రెండు ఎపిసోడ్స్‌లో అనవసరంగా కామెడీని ఇరికించారు. ప్రధాన పాత్రలకు ఎమోషన్స్‌ జొప్పించి ప్రేక్షకులకు కనెక్ట్‌ చేయాలని చూసినా అవి కూడా అంతగా రక్తి కట్టలేదు. చివరి ఎపిసోడ్‌ ’విరూపాక్ష’, ’అంజి’ సినిమాలు గుర్తుకు వస్తాయి. దర్శకుడు తేజ మర్ని చందమామ కథను ఎంచుకుని, నేటి తరానికి అనుగుణంగా తీర్చిదిద్దిన విధానం కొంత వరకూ బాగుంది.