Ys Sharmila: అనూహ్య పరిణమాల మధ్య తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ఫిబ్రవరి 9న హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ప్రకటించారు వైఎస్ షర్మిల. ఏప్రిల్ 9న ఖమ్మంలో సభ కూడా పెట్టారు. అయితే.. తెలంగాణలో ఆమె రాజకీయ కార్యకలాపాలపై టీఆర్ఎస్ సైలెంట్ గానే ఉంటోంది. మొదటి నుంచీ సాక్షాత్తూ ఆమె సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు. మొదట్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని రైతులు, విద్యార్ధులకు న్యాయం జరిగట్లేదని అటాక్ స్టార్ట్ చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలంటూ 72 గంటల దీక్ష చేశారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు అప్పనంగా ఇచ్చినప్పుడు.. ప్రజలకు ఉచితంగా వాక్సిన్ కోసం 1000 కోట్లు ఖర్చు చేయలేరా కేసీఆర్ గారూ..? అంటూ ప్రశ్నించారు.
కరోనా విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని.. కేసీఆర్ దొర కళ్లు తెరిచి చూడాలని.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కామెంట్ చేశారు. ఇలా సీంను, ప్రభుత్వాన్ని ఆమె కామెంట్ చేస్తూనే ఉన్నారు. అయినా.. టీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడలేదు. మంత్రులు గంగుల, పువ్వాడ.. వంటివారు ఒకటి రెండుసార్లు కౌంటర్లు వేసినా మళ్లీ ఆ ఊసేలేదు. ఆంధ్రా అంటేనే అంతెత్తున విరుచుకుపడే సీఎం కేసీఆర్ సైతం ఆమెపై ఒక్క కామెంట్ చేయలేదు. కేటీఆర్, కవిత, హరీశ్ రావు కూడా ఆమెపై సెటైర్లు, కౌంటర్ అటాక్ ఇచ్చింది లేదు. ఆంధ్రవారి పెత్తనం వద్దు.. అనే నినాదంతోనే తెలంగాణ సాధించిన పార్టీ.. ఆంధ్ర నుంచే మరొకరు తెలంగాణలో పార్టీ పెడతామంటే సహించగలరా? కానీ.. ఆమెపై స్పందించటం లేదు.
సరైన సమయంలో స్పందిద్దామని పార్టీ ఆదేశించిందా? ఆమెనెవరూ పట్టించుకోవట్లేదా? కేసీఆర్ కూడా లైట్ తీసుకున్నారా? ఇవన్నీ సందేహాలే..! అయితే.. ఆమె వ్యాఖ్యల్ని పట్టించుకుని కౌంటర్ వేసి ఆమెను హైలైట్ చేయడం టీఆర్ఎస్ కు ఇష్టం లేదనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. 2004 ఎన్నికల ముందు వరకూ కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఎవరూ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ అధిష్టానం పొత్తు పెట్టుకున్నంతనే కేసీఆర్ కు గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి ఏం జరిగిందో చూశాం. అనుభవంతో అటువంటి అవకాశం మరొకరికి ఇవ్వకూడదనే సీఎం కేసీఆర్ అభిప్రాయమని ఇక్కడ విశ్లేషించాలి. మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి..!