తెలంగాణలో నిఖార్సైన ప్రజా నేత నామినేషన్ ఇలా ఉంటది (వీడియో)

ఆయనను చూసిన ఎవరైనా ఆయనకు రెండు చేతులెత్తి దండం పెట్టాల్సిందే. ఆయన గురించి విన్న ఎవరైనా చలించిపోవాల్సిందే. ఆయన మచ్చలేని మనిషి. నిఖార్సైన ప్రజా నాయకుడు, ప్రజా సేవకుడు. ఆయనెవరో కాదు సిపిఐ (ఎంఎల్) న్యూడెమెక్రసీ నేత గుమ్మడి నర్సయ్య. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజల మనిషిగానే ఉన్నాడు తప్ప కోట్లకు పడగలెత్తలేదు. ఆడంబరాలకు పోలేదు. ఏ ఊరికి పోయినా సైకిల్ మీద పోవడం గుమ్మడి నర్సయ్యకు అలవాటు. బుధవారం గుమ్మడి నర్సయ్య తమ పార్టీ తరుపున ఇల్లెందు నియోజకవర్గంలో నామినేషన్ వేశారు.

కోటర్, బీర్, బిర్యానీ, చేతిలో నోటు ఉంటేనే నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ రోజుల్లో పేద నాయకుడు గుమ్మడి నర్సయ్య నామినేషన్ కు ఊరు ఊరే కదిలివచ్చింది. వేల మంది గుమ్మడి నర్సయ్య నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందరు బైక్ ర్యాలీ తీశారు. ఇల్లెందు పట్టణంలో కోలాహలం నెలకొన్నది. విప్లవ నాయకునికి ప్రజల జే జే లు ఎలా ఉంటాయో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. 

gummadi narsaiah nomination

 

నామినేషన్ కోసం తలా రెండు రూపాయలు ఇచ్చిర్రు

విప్లవాన్ని బతికించుకునేందుకు ఇల్లందులో ప్రయత్నం జరుగుతుంది అని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న న్యూ డెమోక్రసీ నేత ఒకరు కామెంట్ చేశారు. 

ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య తిరిగి ఇల్లందులో గెలిపించుకునేందుకు ప్రజల ముందుకు వచ్చారు. 5 వేల మందితో బైక్ ర్యాలీ తో నామినేషన్ వేసేందుకు ఆయనకు మద్దతు గా వచ్చారు. స్వతహాగా గుమ్మడి నర్సయ్య ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక్క పైసా కూడా కూడపెట్టుకోలేదు. ఇవాళ నామినేషన్ కు అయ్యే డిపాజిట్లు సైతం ర్యాలీకి వచ్చిన ఐదు వేల మంది మనిషికో రెండు రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది.

ఇక్కడ ఒకే ఒక నినాదంతో ఎన్నికల యుద్ధం జరుగుతుంది. పోడు భూములు కావాలంటే నరసన్న గెలవాలి, అవినీతి అంతం కావాలంటే నరసన్న కు ఓటు వెయ్యాలి అన్న నినాదంతో ప్రజలంతా కదం తొక్కారు. అయితే తన నామినేషన్ కు 5 వేల మంది బైక్ లతో ర్యాలీకి జనాలు వస్తారని గుమ్మడి నర్సయ్య కూడా ఊహించలేదని అంతగా ఆయనకు జనాలు నీరాజనాలు పలుకుతున్నారని పార్టీ నేతలు తెలిపారు. 

ఈ ప్రజా నాయకుడు మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని నామినేషన్ రోజు జరిగిన ర్యాలీనే నిదర్శనంగా చెబుతున్నారు ఆయన అభిమానులు.