కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి ఒక విధంగా పార్టీకి వూపిరిపోశారు.ఆయన నిన్న లెక్కింపు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీస్థానంలో 14300 ఓట్ల ఆధిక్యత తో గెలిచారు. ఇది అసాధారణం. రూలింగ్ టిఆర్ ఎస్ కు అవమానమే.
ఎందుకంటే, ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థుల ముఖాలను చూసే ఓటేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ గెలుపొంది ఇంకా మూనెళ్లు దాట లేదు. అపుడు తిరస్కరించిన జీవన్ రెడ్డిని ఇపుడు ఇంత మెజారిటీతో గెలిపించడమేమిటి?
అసెంబ్లీ ఎన్నికల ప్రభావం మూనెళ్ల కే ముగిసిందా?
ఈ ఎన్నిక కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం విజయం జీవన్ రెడ్డి కి ఉన్న పట్టును వ్యక్తం చేస్తుంది. ఈ గెలుపుతో ఆయన మండలిలో కాంగ్రెస్ ను వాణిని వినిపించేందుకు అవకాశం వచ్చింది. ఆయనా ఓడిపోయి ఉంటే, వచ్చే నెలలో కౌన్సిల్ లో కాంగ్రెస్ మాయమయిపోయి ఉండేది. శాసన సభల్లో కాంగ్రెస్ లేకుండా చేసేందుకు టిఆర్ ఎస్ ప్రయత్నిస్తూన్న విషయం తెలిసిందే. దీనికి జీవన్ రెడ్డి అడ్డుకట్ట వేశారు.
కాంగ్రెస్ పార్టీ మండలిలో చాలా కష్టాల్లో పడింది. నలుగురు ఎమ్మెల్సీలు టిఆర్ ఎస్ లో విలీనం కావడం, మిగిలిన పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ ఈ నెలాఖరును రిటైరవుతూ ఉండటంతో పెద్దల సభలో ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటపుడు జీవన్ రెడ్డి విజయసాధించారు. కాంగ్రెస్ ఉనికిని కాపాడారు.
అయితే, జీవన్ రెడ్డి పార్టీ మారరనే అనుకోవాలి. ఆ మధ్య ఆయన కూడా పార్టీ మారతారని వార్తలొచ్చాయి. జీవితాంతం కాంగ్రెస్ జండా మోసినోళ్లు కూడా చివర ఏవో కారణాలతో పార్టీ మారుతున్నారు.కౌన్సిల్ లో ఒంటరిగా చేసేదేమీ లేదని చెప్పి ఆయన టిఆర్ ఎస్ లోకి వెళ్లిపోతారా?
చాలా మందికి పార్టీలో ఉండటమే సైద్ధాంతిక వ్యవహారం కాదు. పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనం. ఆందుకే ఆశించింది దొరక్కపోతే పార్టీ మారేస్తున్నారు. పది రోజుల కిందట సోనియా గాంధీ కీలక సలహాదారు కేరళకు చెందిన టామ్ వడక్కణ్ ఏకంగా బిజెపి లో చేరారు. ఇంక తెలంగాణ ఆంధ్రలో కొస్తే, పార్టీ చాలా మామూలు వ్యవహారం.విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపులు స్వర్ణయుగం మొదలయింది.విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనంద్యాల ఎంపిగా వైసిపితరఫున గెలిచిన ఎస్ పి వై రెడ్డి పదిరోజులొనే టిడిపిలో చేరారు. గెలిచిన వారం, పదిరోజులు లేదా రెన్నెళ్లు, మూనెళ్లలోనే ఎమ్మెల్యే సొంత పార్టీలకు గుడ్ బై చెప్పి రూలింగ్ పార్టీలోకి నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో దూరేస్తున్నారు.
కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న డికె అరుణ బిజెపిలో చేరారు. సబితా ఇంద్రారెడ్డి చేసిందదే. మరో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టిఆర్ ఎస్ లోకి వెళ్లబోతున్నారు. జగ్గారెడ్డి పోబోయి వెనక్కు వచ్చారు. ఇంకా చాలా మంది వెళ్లారు.వెళ్లబోయే వాళ్ళుకూడా ఉన్నారు. ఇలాంటి వాతావరణం ప్రభావం జీవన్ రెడ్డి మీద పనిచేస్తుందా? ఆయన అరుసార్లు జగిత్యాలనుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ కీర్తి పార్టీ మారకుండా నిలుపుతుందా?
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం బతికపల్లిలో మే 1,1952న జన్మించిన జీవన్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బి పూర్తిచేశారు.
1983లో తెలుగుదేశం పార్టీ తరుపున జగిత్యాల నియోజకవర్గం నుంచి తొలిసారిగా జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెల్చి తన రాజకీయ యాత్ర ప్రారంభించారు.
1985లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 1989లో గెలిచారు. 1994లో టిడిపి నేత ఎల్.రమణ చేతిలో ఓడిపోయారు.1996 ఉపఎన్నికల్లో గెలిచి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. 1999,2004లో వరుసగా గెలుపొందారు. 2008లో తెలంగాణ నినాదంతో కెసిఆర్ రాజీనామాచేయడంతో జరిగిన కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో కేసీఆర్‌పై పోటీ చేసి సంచలనం సృష్టించారు.
ఆ ఎన్నికలో ఓడిపోయినా మెజారిటీ బాగా తగ్గించగలిగారు.
2007-09 మధ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఓడినా 2014లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ వెల్లువ ను ఎదిరించి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ సీనియారిటి, గౌరవం అయన పార్టీ మారకుండా అడ్డుకుంటాయా?