జనసేనాని పవన్ కల్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే, ఆయన రెండో మీటింగ్ అనంతపురం లో ఏర్పాటు చేసి, అక్కడి వెనకబడిన తనాన్నిపోగొట్టేందుకు, విప్లవకమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి స్పూర్తితో అనంతపురం నుంచే పోటీ చేస్తానని 2017 లోనే పవన్ కల్యాణ్ వెల్లువెత్తిన అభిమానం నినాదాల మధ్య భీకర ప్రతిజ్ఞ చేశారు.
ఎన్ని ఆటంకాలు ఎదురయినా తాను అనంతపురం నుంచే పోటీ చేస్తానని హైదరాబాద్ లో మే 14, 2017 అనంతపురం జిల్లా కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ మళ్లీ ప్రకటించారు.
ఆయన అనంతపురం నుంచే పోటీ చేస్తారని 2017 నవంబర్ లో పార్టీ సీనియర్ నాయకుడు మహేందర్ రెడ్డి రాజమండ్రిలో ఇంకా స్పష్టత ఇచ్చారు. తర్వాత ఏమయిందో ఏమో ఆయన అనంతపురం ప్రస్తావన తీసుకురానేలేదు.
ఈ మధ్యలో ఆయన అనంతపురం నుంచి కాదు, తిరుపతి పోటీ చేయవచ్చని వూహాగానాలుమొదలయ్యాయి. ఎందుకంటే, చాలా సార్లు తన మొదటి రాజకీయ పార్టీ ‘ప్రజారాజ్యం’ గురించి ఆయన ప్రస్తావిస్తూ గర్వపడుతూ వస్తున్నారు.
ప్రజారాజ్యానికి ద్రోహం చేసిన వారిని వదలనని కూడా మరొక భీకర ప్రతిజ్ఞ కూడా చేశారు. దానికితోడు తిరుపతి తన అన్న చిరంజీవిని అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గం కూడా.
ఇంత వ్యవహారం ఉన్నా ఇపుడే రాయలసీమనుంచి కాకుండా విశాఖ, కోస్తా జిల్లాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అనంతపురాన్ని, తిరుపతిని ఎందుకు వదిలేసినట్లు? ఇది రాయలసీమ ప్రజలను అసంతృప్తికి గురిచేసే విషయం కాదా. రాయలసీమనుంచి గెలవవచ్చని చిరంజీవికి ఉన్న ధైర్యం కూడా పవన్ కు లేదా?
తనకు రాయలసీమలో గెలుపు సాధ్యంకాదని ఒక చైతన్య సభ, ఒక కవాతు, రెండు మూడు జిల్లాలో పర్యటనల తర్వాత ఆయన భావిస్తున్నట్లు అర్థమవుతుంది.
ఆ రోజు ఏదో ఆవేశంలో ఆయన అనంతపురం- కరువు ప్రాంతం (ఎడారీకరణలో ఉన్న ప్రాంతంగా పేరున్న జిల్లా) లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో ఆవేశం రావాలి కాబట్టి ఆ ప్రాంతం నుంచి వచ్చిన విప్ల వ కారుడు తరిమెల నాగిరెడ్డి బొమ్మ పెట్టుకున్నారు. అనుకున్నట్లే ఆయనకు ఆవేశం వచ్చింది. అనంతపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఒక సారి కాదు, చాలాసార్లు.

ఇపుడేమో ఆయన గాజువాక, భీమవరం మీద మనసు పడేసుకున్నారు. అక్కడి నుంచి పోటీచేస్తారని పార్టీ వర్గాలనుంచే వార్తలొస్తున్నాయి. దీనికి కారణం, ఆయన రాయలసీమ మనసుదోచుకోలేకపోవడమే.
అసలే, ఆలస్యంగా రాయలసీమలో పర్యటించారు. రాయలసీమ అసలు సమస్యల గురించి ఎక్కడా ప్ర స్తావించలేదు. ఆయన చుట్టూర ఉన్నవాళ్లు ఈ సమస్యల గురించి ఆయనకు పెద్దగా అవగాహన కల్పించలేపోయారు.శ్రీభాగ్ వప్పందాం అనే పదార్ధం గురించి ఆయనకు తెలిసినట్లు లేదు. అవినీతి వ్యతిరేకంగా,ప్రధాన రాజకీయ పార్టీలను తిట్టిపోస్తూ రంగు రుచి వాసన లేని జనరల్ ఉపన్యాసాలు చేసి వెళ్లిపోయారు.
అందుకే ఆయన రాక రాయలసీమలో ఎక్కడా చర్చనీయాంశం కాలేకపోయారు. ఒక కొత్త పార్టీ రంగంలోకి వచ్చినపడు రాయలసీమ వంటి ప్రాంతాల ప్రాంతీయ సమస్యలేమిటో తెలుసుకోవాలి. వాటి మీద తన విధానం చెప్పాలి. అపుడే కొత్త దనం తెచ్చినవాడవుతాడు. అపుడే ప్రజలు ఆయన వైపు చూస్తారు. ఇదే రాయలసీమకు వర్తిస్తుంది. అదనంగా ఏమీ చెప్పనపుడు ఉన్నపార్టీలను కాదని ఆయన వైపు ప్రజలెందుకు చూస్తారు?
జనసేన జరిపించిన సర్వేలలో కూడా పవన్ కు అనంతపురం అంత సేఫ్ సీటు కాదని తేలినట్లు కూడా కొందరంటున్నారు.
రాయలసీమలో నీళ్ల ఉద్యమాలు నడుస్తున్నాయి. నికరజలాలు కావాలని రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాలలో అన్యాయం జరుగుతూ ఉందని అరుస్తున్నారు. తాజాగా టిటిడిని రాయలసీమ జోన్ గా కాకుండా స్టేట్ యూనిట్ గా మార్చారు. దీనిని ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ డిమాండ్ ఉంది. రాయలసీమలో రాజధాని పోయిన ఆవేదన ఉంది. హైకోర్టయినా వస్తుందనుకున్నారు. అదీ రాలేదు. వీటి గురించి ఆయన ఒక కొత్త మాట కూడా చెప్పలేకపోయారు. కారణం, ఆయన కూడా అన్ని పార్టీల్లాగే ఎన్నికల పార్టీ నాయకుడే. వీటి గురించి మాట్లాడితే ఆంధ్ర ప్రాంతంలో ఆగ్రహం వస్తుందని భయపడ్డారు. అందుకే ఏదో రాయలసీమ వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతానికి ఎవరూ ఏమీ చేయలేదు అని ఉపన్యాసాలు చెప్పి వెళ్లి పోయారు. దీనితో రాయలసీమలో తనకు చోట్టున్నట్లు ఆయనకే అనిపించినట్లు లేదు.
రాయలసీమలో ఇప్పటికయితే, మూడోపార్టీకి చోటు లేదు. వైసిపి, తెలుగుదేశమే బలమయిన పార్టీలు. రాయలసీమను మొత్తంగా కైవలసం చేసుకునేందుకు రెండు పార్టీలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఈముమ్మర పోరాటంలో ప్రజలు తనను పట్టించుకునేందుకు తను అక్కడి ప్రజలకు చెప్పిన కొత్త మాటలేవీ లేవు. టిడిపి వైసిపి లనుంచి ఒక నియోజకవర్గం లాక్కునేందుకు ఆయన చేసిన ప్రయత్నం కూడా లేదు. ఏదో ఆవేశంలో అనంతపురం నుంచి పోటీ చేస్తా, అనంతపురంలోనే మొదటి ఆఫీసు పెడతానని ప్రటించారు. మర్చిపోయారు.
అందుకే తొలిసారిగా అసెంబ్లీ లోకి అడుగు పెట్టాలనుకుంటున్నతనకు అనంతపురం జిల్లా సురక్షితం కాదని పవన్ భయపడినట్లు కనిపిస్తుంది. దీనితో సురక్షితమయిన నియోజకవర్గం కోసం అన్వేషంచినట్లు కనిపిస్తుంది.
అనంతపురం నుంచి పోటీ చేస్తానని తాను ఎన్ని సార్లు చెప్పారో గుర్తుచేసుకుని ఆయన భీమవరం, గాజు వాక నియోజకవర్గాలలో నామినేషన్ వేయడం మంచింది.
