తెలంగాణ రెడ్ల చీలికలో కేసిఆర్ సక్సెస్ ఫార్ములా ఇదేనా?

(దుర్గం రవిందర్, సీనియర్ జర్నలిస్టు)

 

కేసీఆర్ ను ప్రజలు గెలిపించలేదు,కాని ఆయన గెలిచాడు. నిజంగా ఆయన ఎలా గెలిచాడు అన్నది అత్యధికులకు ఇప్పుడు ముఖ్యం కాదు, కాని కొందరు విశ్లేషకులకు, వ్యుహకర్తలకు అది ముఖ్యమే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొందరినే ఆశ్చర్య పరిచాయి. రాజకీయాలతో కొద్ది పరిచయం ఉన్న వారికి ఎవరికయినా పలితాలు ఇలా ఉంటాయని ముందే తెలుసు. విహంగ వీక్షనంలో నిష్పాక్షికంగా వర్తమాన రాజకీయాలను చూసి, పరిస్థితిని అవగాహన చేసుకునే వారికి ఎవరికీ ఈ ఫలితాలు ఆశ్చర్య పరిచే అవకాశామే లేదు.

కెసిఆర్ వ్యూహాత్మకంగా అన్ని రకాలుగా ప్రత్యర్థుల కన్నా ముందు ఉండి సునాయాసంగా గెలిచాడు.”ఎవ్రీ థింగ్ ఇస్ రైట్ ఇన్ లవ్ అండ్ వార్” అన్నట్లు చేయ గలిగిన అన్ని మంచి-చెడు, నైతిక అనైతిక పనులు చేశాడు. ఆ పనులు చేయగలిగిన కొన్ని అవకాశాలు అవతలి వారికి కుడా ఉండే, కాని వారు అసమర్దులై ఆ పనులు చేయ లేక పోయారు. డబ్బు, కులం, అధికారం అనే ఆయుధాలను అర్థవంతంగా వినియోగించుకున్నాడు. వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు దిగిన తెలంగాణ రాష్ట్రసమితితో ప్రతిపక్షాలు పలు అంశాల్లో ఏ విధంగానూ సరితూగలేకపోయాయి. ముఖ్యంగా డబ్బుల ఖర్చు విషయంలో. అతని లోపాలను వివరించడంలో… ఇలా చెప్పుకుంటూ పొతే ఏ విషయంలోనూ కూటమి వారికి సానుకూలత లేదు. కాని బలమైన అభ్యర్థులు కూటమిలోనే ఉన్నారు. ఒక దశలో ఓటర్లు కుడా కూటమి పట్ల సానుభూతితో ఉన్నారు. కాని దానిని చేజేతుల పాడుచేసుకున్న వైనం కూటమి వారిది. స్వల్ప ప్రయత్నంతో నివారించదగిన కారణాలతో కూటమి కనీసం ఇరవై స్థానాలను కోల్పోయింది. 

వోటర్ దృష్టిలో సానుకూలత వల్ల టిఆర్‌ఎస్‌కు లాభించింది. వోటర్లు ఎవరికీ ఓటు వేస్తె ఏమి లాభం అని యోచించుకుంటారు. బరిలో నిలిచిన పార్టి చరిత్ర, దాని నాయకత్వం, వారు ఇచ్చే హామీలతో పాటు రంగంలో ఉన్న అభ్యర్తుల మధ్య మంచిచెడ్డలను బేరీజు వేసుకుంటారు. నిలుచున్నవారి శక్తిసామర్థ్యాలు నాయకత్వ లక్షణాలు అతని ప్రవర్తన, కీర్తి-అపకీర్తులను పరికిస్తారు. ప్రభుత్వంలోని సానుకూల చర్యలు అభివృద్దికర అంశాలు మొదలైనవన్నీ మదింపు వేసుకుని ఓటు వేస్తారు.

ఈ ఫలితాలను సాధ్యం చేసిన అంశాలు పరిణామాలేమిటి? ఓటర్లను టీఆర్ఎస్ కు సానుకూల పరిచిన అంశాలేమిటి అని యోచిస్తే సమాధానం సులువుగానే దొరుకుతుంది. లోతైన విశ్లేషణలు అవసరమే లేదు. మొదటిది తన అనుకూలతను బట్టి ముందస్తు ఎన్నికలకు రావడం , రెండవది ఆయన మూడు నెలల ముందు రంగంలోకి దిగితే కూటమి వారు 19 రోజుల ముందు మాత్రమె దిగారు. వారికి మూడు నెలల సమయం దొరకగా వీరికి మూడు వారాలే మిగిలింది. రైతు బంధు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, బీడీ కార్మికులు, చేనేత, భోదకాలు, ఎయిడ్స్ రోగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం, గొర్లు, బర్లు, తదితర ప్రభుత్వ సంక్షేమపథకాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. వోటర్ లిస్టు గల్లంతు అయిన లక్షలాది వోట్లు యాదృచ్చికంగా ఏమి కాలేదు… ఇలాంటి అనేక అంశాలను ఆయన తనకు అనుకూలంగా మలుచుకున్నారు. 

కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉనికి వ్యతిరేక భావనలను సృష్టించిందని కొన్నిసూత్రీకరణలు వచ్చా యి కానీ ఇది కొద్ది ప్రభావం చూపిన అంశమే. ఈ ఫలితాలు కేసీఆర్ పాలనకు ప్రజలు ఆమోదం తెలపడం అని, తెలంగాణ ఆత్మగౌరవ వ్యక్తీకరణ అనీ సీమాంద్రుల కుట్రల తిరస్కరణ అనీ అంటున్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమ కాలం నాటి సైద్ధాంతిక అంశాలను ఇంకా విశ్వసిస్తూ ఆచరించడానికి ప్రయత్నించేవారు అనేకులు ఈ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకంగా పని చేశారు.

కెసిఆర్‌ పాలనకు ముగింపు పలకడమే అత్యవసరమని అదే ప్రజాస్వామిక కర్తవ్యమని కొందరు భావించారు. ఈ కొందరిలో అత్యధికులు పాలక కులం అయిన రెడ్లు, కాని వారు ఈ ఎన్నికలలో సరిపడా సామర్ద్యాన్ని ప్రదర్శించ లేక పోయారు. సంసిద్దతగా లేకపోవడం, ఆచి తూచి ఖర్చు చేయడం, అనైక్యత, తదితర లోపాలతో వారు ఎన్నికల యుద్దరంగంలోకి దిగారు. వీరికన్నా ఒక ఆకు ఎక్కువ చదివిన కెసిఆర్ తన పార్టి నుండి వారి కన్నా ఎక్కువ మంది చిన్న రెడ్లకు బీ ఫారాలను ఇచ్చి వారిలో వారు పోటి పడేలా వ్యూహాత్మక ఎత్తుగడ వేశాడు, ఓటమి తర్వాత వీరు ఇప్పుడు నిరాశలో పలితాల సమీక్షలో పడిపోయారు. నిరాశలో ఓటమి నెపాన్ని ఈ.వి.ఎం ల పైకి నెడితే ఒనగూడే పలితం ఏమీ లేదు.

ఈ ఎన్నికల్లో 2,80,64,684 వోటర్లలో ఓటేసినవారి సంఖ్య 2,05,80,470,ఇది 73.33 శాతం. మొత్తం119 నియోజకవర్గాల్లో 50 చోట్ల పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు అధికంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు.

88 సీట్లను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ కు 97,00,749(46.9%)వోట్లు వచ్చాయి. సగటున ప్రతి స్థానంలో 32,275ఓట్ల ఆధిక్యం సాధించింది. టీఆర్ఎస్ కు సుమారు 29 లక్షల ఓట్ల మెజారిటీ లభించింది. 

19 నియోజకవర్గం లలో గెలుపొందిన కాంగ్రెస్‌కు 58,83,111(28.4%) వోట్లు వచ్చ్చాయి. 19 స్థానాలలో కలిపి కాంగ్రె్‌సకు సుమారు 2.35 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది.రెండు స్తానాల్లో గెలిచిన తెలుగు దేశం పార్టికి 7,25,845(3.5%)వోట్లు వచ్చ్చాయి. 

7నియోజక వర్గాల్లో గెలిచిన మజ్లిస్‌ సగటు ఆధిక్యం46,490 ఓట్లు కావ డం విశేషం. ఈ సీట్లలో సుమారు 3.25 లక్షల ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. రెండు స్థానాలను గెలుచుకున్న టీడీపీ సగటు ఆధిక్యం ఓట్లుగా నమోదైంది.  టిఆర్ఎస్ 97,00,749(46.9%)ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో ఇవి 73.33శాతంగా ఉన్నాయి.
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు మొత్తం 66,18,972 ఓట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో టిఆర్ఎస్ 63 సీట్లు గెలిచింది.

మూడు పార్టీల పొత్తుతో 99 స్థానాల్లో పోటి చేసిన కాంగ్రె్‌సకు ఈ ఎన్నికల్లో మొత్తం58,83,111(28.4%) ఓట్లు లభించాయి. మొత్తంగా కాంగ్రెస్‌ 19 స్థానాలను గెలుచుకోవడంతో ఓట్ల పరంగా చూస్తే… 3.09 లక్షల ఓట్లకు ఒక సీటు చొప్పున దక్కినట్లయింది. కాగా 2014 ఎన్నికల్లో కాంగ్రె్‌సకు మొత్తం 28.28లక్షల ఓట్లు రాగా 21 సీట్లు వచ్చాయి. వీటితో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో 10.18లక్షల ఓట్లు పెరిగాయి. ఇక టీడీపీ కి 7,25,845(3.5%) ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండు సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. ప్రస్తుత ఎన్నికల్లో 8పార్టీల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు(2,24,709) పోల్‌ అయ్యాయి. 

ఇలా కారణాలు అనేకం,తెలంగాణాలో కెసిఆర్ ను ప్రజలు రెండవ సారి గెలిపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ అనే నాయకుడిని రెండో దశలో గెలిపించాల్సిన అగత్యమున్నదని నమ్మి ఆయన వెనక నిలిచారు. కృతజ్ఞతతో, బాధ్యతగా వ్యవహరించాల్సిన భారం ఇక కేసీఆర్ బృందానిదే.

ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఘనవిజయం సాధించినప్పుడు గర్వం సహజంగా వస్తుంది.పలితాల అనతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వోటర్లకు కృతఙ్ఞతలు తెలుపుతూ “ఘనమైన విజయం-భరువైన భాద్యత” అని అన్నారు. ఘనమైన జనామోదం పొందడం అంటే ఘనంగా ప్రజలకు మేలు చేయడమే అని ఆయన అనుకోవాలి. 

కెసిఆర్ ముఖ్య మంత్రిగా ఉనా లేకున్నా,తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అయిదేండ్ల పాటు ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. తనకు లాభదాయకంగా ఉండే అభివృద్ధి సంక్షేమ విధానాలను అనుసరిస్తుంది. గత నాలుగున్నరేండ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పై భిన్నస్పందనలు వచ్చాయి. ప్రభుత్వం ఆ స్పందనలపై వ్యవహరించే తీరులో కూడా ఏ మార్పూ ఉండకపోవచ్చు. చిత్త శుద్దితో విశ్లేషిస్తే విషయం అర్థం అవుతుంది. సంక్షేమం సరే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో చాలా మార్పు అవసరం. రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలు చాల బ్రష్ట్టు పట్టి ఉన్నాయి. టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాసమస్యల పై శీత కన్ను వేసింది ధర్నాచౌక్‌ రద్దును అర్ధరాత్రి అరెస్టులను, మీడియా సంస్థల వేధింపు, యూనివర్సిటీ ల ను నిరుత్సాహ పరచడం లాంటి చర్యలను పూర్తిగా ఆపాలి. రాష్ట్రంలో టిఎస్పిఎస్సీ  తో వన్ టైం రిజిష్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు 19 లక్షల మంది ఉన్నారు, మొత్తంగా చుస్తే రాష్ట్రంలో మూడు తరాలకు చెందినా 40 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వీరి సమస్యను యుద్ద ప్రాతిపాదికన పట్టించుకోవాలి. 

కారణాలేవైనప్పటికీ టీఆరెస్ పార్టీ తొలిసారి సర్కారు ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణా మహోద్యమ స్ఫూర్తిని తన పనితీరులో మేళవించడంలో విఫలమైంది. సబ్బండవర్గాల కలలను నెరవేర్చలేకపోయింది. మొదట్లో కొన్ని స్కీములు సరే, చివర్లో కొన్ని కంటి తుడుపు స్కీములు అర్ధమనస్కంగా మొదలయ్యాయి. సంక్షేమం ప్రదమ మై అభివృద్ధి ద్వితీయమై పోయింది. కాని ఇవి రెండు సమ పాల్లలో ఉండాలి. 

ఆయన తనకు దొరికిన అమూల్యమైన ఈ రెండో అవకాశాన్నయినా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని, రాష్ట్రంలోని అన్ని పౌర పాలనా, సంక్షేమ వ్యవస్థలు సజావుగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా, చురుకుగా, నైతికంగా సమున్నతంగా, ప్రజాపక్షపాతంతో పని చేసేలా మార్గదర్శకత్వం వహిస్తూ, చరిత్రలో మేటి సి.ఎం గా నిలుస్తారని ఆశిద్దాం.

మొత్తం వోట్లు 2,80,64,684
పోలయి వోట్లు 2,05,80,470(73.33) 
టిఆర్ఎస్ 9700749(46.9%)
కాంగ్రెస్ 58,83,111(28.4%) 
బిజెపి 1450456(7.౦౦)
తెలుగు దేశం 7,25,845(3.5%)
ఎం.ఐ.ఎం 5,61,089(2.7)

 

రచయిత : సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్ ఫేస్ బుక్ పేజీ నుంచి సేకరించిన వ్యాసం.