తెలంగాణ మినీ కేబినేట్ లో మంత్రులుగా వీరికే చాన్స్

తెలంగాణ అసెంబ్లీ గురువారం సమావేశమయింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేశారు. పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. స్పీకర్ ఎంపికకు ఇతర పార్టీల వారు కూడా మద్దతు తెలిపారు. దీంతో స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక ఖరారైంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి మంత్రి పదవులపై పడింది. ఎవరికి మంత్రి పదవులు దక్కనున్నాయోనని చర్చ జరుగుతోంది.

పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. గత కేబినేట్ లో మంత్రులుగా పని చేసిన ఐదారుగురికి ఈ సారి కేబినేట్ మంత్రి పదవి దక్కకపోవచ్చని వారి స్థానంలో కొత్త వారికి అవకాశం లభిస్తుందన్న చర్చ జరుగుతోంది. సామాజిక వర్గాల వారీగా అన్ని ఉమ్మడి జిల్లాలకు న్యాయం చేకూరేలా మంత్రి పదవులు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని నేతల ద్వారా తెలుస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే పూర్తిస్థాయి కేబినేట్ ను ఏర్పరుస్తారని అప్పటి వరకు మినీ కేబినేట్ కొనసాగుతుందన్న చర్చ జోరందుకుంది. ఇప్పటికే పలువురు నేతలు ఎవరికి వారు లాబీయింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. నేతలంతా కూడా కేటిఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. అయితే ఈ మిని కేబినేట్ లో కేటిఆర్ కు ప్లేస్ లేదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు,  ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో ఎన్నికలన్ని ముగిసిన తర్వాతనే కేటిఆర్ ను కేబినేట్ లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే మినీ కేబినేట్ కూడా ఇప్పట్లో ఉండకపోవచ్చని ప్రచారం జరిగినా అనూహ్యంగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని టిఆర్ ఎస్ నేతలు అంటున్నారు.

ఈ సారి కేబినేట్ 8 మందితో ఉండవచ్చని పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయి విస్తరణ జరగనుందని టిఆర్ఎస్ నేతల ద్వారా తెలుస్తోంది. ఈ సారి మాత్రం అన్ని సామాజిక వర్గాల వారికీ మంత్రి పదవులు ఇవ్వాలని వాటి అన్నింటిని బేరీజు చేసుకొని పదవుల పంపకం ఉంటుందని నేతలంటున్నారు. సీఎం కేసీఆర్ కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారని అందరికి న్యాయం జరిగేలా చూసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు.

మిని కేబినేట్ లో మంత్రులుగా వీరికే చాన్స్

తన్నీరు హరీష్ రావు

కడియం శ్రీహరి

గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి

ఈటల రాజేందర్

పద్మా దేవేందర్ రెడ్డి

తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావు గౌడ్

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వీరికి మినీ కేబినేట్ లో స్థానం దక్కుతుందని తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ ఆశీస్సులు వీరిలో ఎవరికి దక్కనున్నాయో చూడాలి. జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహ్మరెడ్డిలకు  ఈ సారి కేబినేట్ లో అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది.