కొడంగల్ లో అర్ధరాత్రి టెన్షన్ (వీడియోలు)

కొడంగల్ లో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు, కొడంగల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యూసుఫ్, ఆయన అన్న ముస్తాక్ ల ఇళ్ల పై ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారని రేవంత్ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఏం లేవని చెప్పినా కూడా దౌర్జన్యంగా దాడులు చేశారన్నారు.

పోలీసులు సోదాలు చేస్తున్నారన్ని విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అనుచరులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సోదాల విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకొని రోడ్డు పై బైఠాయించారు. యూసుఫ్ ఇంట్లో ఏం దొరికాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడకు చేరుకొని ఆందోళన నిర్వహించడంతో అక్కడ టెన్షన్ వాతావరణ నెలకొంది. పోలీసుల పై మహిళా కార్యకర్తలు కూడా విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి ఇంట్లో ఆడవారు ఉన్నారన్న కనీసం ఇంగితం లేకుండా ప్రవర్తిస్తారా అంటూ వారు నిలదీశారు. ఏం దొరికాయో చెప్పాలని  పోలీసులను రేవంత్ డిమాండ్ చేశారు. వారు ఏం దొరకలేదు అని చెప్పగా లిఖిత పూర్వకంగా రాసివ్వాలని రేవంత్ పట్టు బట్టారు.

తన పై భౌతిక దాడులకు కుట్ర పన్నుతున్నారని తాను ఎటువంటి పరిస్థితినైనా ఎదురిస్తానని రేవంత్ అన్నారు. తనను, తన అనుచరులన వేధిస్తున్నారని తమను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా భయపడేది లేదని రేవంత్ అన్నారు. పోలీసులు టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించి తమ పై కుట్ర పన్నుతున్నారని రేవంత్ విమర్శించారు. కొడంగల్ లో రేవంత్ ఆందోళన, ఉద్రిక్త పరిస్థితి వీడియోలు కింద ఉన్నాయి చూడండి.