పిఠాపురమా.. మజాకా..?… గుడ్ న్యూస్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి చూపూ జూన్ 4 వైపే ఉంది. ఈ లోపు గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. అయితే ఈ సమయంలో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీకి ఎవరు సీఎం అయినా… ఒక డిప్యూటీ సీఎం పదవి మాత్రం పిఠాపురానికి కన్ ఫాం అని!

ఏపీలో జరిగిన ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటనేది తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేశారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీ వెళ్లాలనే పట్టుదలపై ఉన్న పవన్ కోసం మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెరనటులు, సినిమా నటులు ఎంతోమంది పిఠాపురానికి క్యూకట్టి ప్రచారం చేశారు. మెగాపవర్ స్టార్ రాం చరణ్ కూడా పవన్ కోసం పిఠాపురం వచ్చారు.

వాస్తవానికి 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఓటమి పాలైనప్పుడే పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ పై నీలినీడలు కమ్ముకున్న పరిస్థితి. అయితే అనూహ్యంగా కూటమి జతకట్టడంతో పవన్ కల్యాణ్ కు ఈసారి మరో అవకాశం దక్కినట్లయ్యిందని అంటున్నారు. దీంతో… ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఎమ్మెల్యేగా గెలవాలని పవన్ బలంగా ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్న అన్ని అస్త్రాలనూ వాడేశారని చెబుతున్నారు.

ఇక వంగ గీతకు ఈ ఎన్నికలు మరొకెత్తు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆమె గెలిస్తే… అది ఒక చరిత్ర అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ స్థాయిలో ప్రత్యర్థులంతా ఒకపక్క, తానొక్కరే ఒకపక్క అన్నట్లుగా సాగిన ఈ బేటిల్ లో ఆమె గెలుపుపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఇదే సమయంలో ఈమె గెలుపులో కొంత బాధ్యతను ముద్రగడ పద్మనాభంపైనా పెట్టింది వైసీపీ. ఇలా రెండు వైపులా బలమైన ప్రచారాలు జరిగాయి.

ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. పిఠాపురం నియోజకవర్గం కోసం డిప్యూటీ సీఎం పదవి ఎదురుచూస్తుందని. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చి.. పిఠాపురంలో పవన్ గెలిస్తే కచ్చితంగా ఆయనే డిప్యూటీ సీఎం అని అంటున్నారు పరిశీలకులు. కూటమి అధికారంలోకి రావడమే ఆలస్యం అని చెబుతున్నారు. ఇక్కడ పవన్ గెలుపుకూడా అవసరం అని నొక్కి చెబుతున్నారు.

మరోపక్క… పిఠాపురంలో వంగ గీత గెలిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేసి తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో… వైసీపీ అధికారంలోకి వచ్చి, పిఠాపురంలో గీత గెలిస్తే కచ్చితంగా ఆమె డిప్యూటీ సీఎం అయిపోయినట్లే. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి.. ఆమె ఓటమిపాలైనా కూడా కాపు సామాజికవర్గ కోటాలో ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశాలూ ఉన్నాయని చెబుతున్నారు.

అంటే… రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. పిఠాపురం నియోజకవర్గానికి మాత్రం డిప్యూటీ సీఎం పోస్ట్ కన్ ఫాం అన్నమాట. పిఠాపురమా.. మజాకా..?