శ్రేణులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్… బ్యాడ్ న్యూస్ చెప్పిన బాబు!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన అనంతరం తాజాగా గురువారం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు పూర్తయిన అనంతరం ఫలితాలపై ఏ పార్టీకి ఆ పార్టీ నేతలు గెలుపు తమదంటే తమదని చెబుతున్నారు. ఈ విషయంలో ఇటీవల మోడీ నామినేషన్ సందర్భంగా వారణాసి వెళ్లిన బాబు… ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తున్నామని, కూటమి అధికారంలోకి రావడం పక్కా అని, ఫలితాల ప్రకటనే తరువాయి అన్నట్లుగా స్పందించారు.

ఇక పోటీ చేసిన 21 స్థానాల్లోనూ కనీసం 15 స్థానాలు తగ్గకుండా గెలుస్తామనే ధీమా జనసేన నుంచి వినిపిస్తున్న పరిస్థితి. మరోపక్క టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే 135 స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు పక్కా అని చెబుతున్నారు. ఇక పోలింగ్ భారీగా నమోదవ్వడం.. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనడం వైసీపీ గెలుపుకు సూచన అని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఈ సమయంలో గురువారం నాడు అనూహ్యంగా రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా… విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లిన జగన్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 2019 నాటి ఫలితాకంటే బెటర్ రిజల్ట్స్ రాబోతునాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ అకిశోర్ ఊహించని ఫలితాలు వస్తాయంటూ చురకలంటించారు! జూఅన్ 4 తర్వాత దేశం మొత్తం ఏపీవైపు చూడబోతుందని అన్నారు.

ఇలా పోలింగ్ ముగిసిన అనంతరం తొలిసారి మీడియాకు కనిపించిన జగన్… ఉత్సాహంగా కనిపిస్తూ, ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ.. 2019 లో వచ్చిన 151 స్థానాలకంటే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైందని చెబుతున్నారు. అధినేత కళ్లల్లో అప్పుడే ఆ కాంతి వచ్చేసిందని చెప్పుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల్లో జగన్ గుడ్ న్యూస్ చెప్పారని కామెంట్స్ చేస్తున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27, 28న జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం ఏర్పాటు హడావుడిలో ఉండటమే అందుకు కారణం అని చెప్పడం గమనార్హం. దీంతో… మహానాడుకూ దానికీ సంబంధం ఏమిటనే గుసగుసలు తమ్ముళ్ల మధ్య వినిపిస్తున్నాయని తెలుస్తుంది.

ఇది పార్టీకి సంబంధించిన విషయం అని.. పైగా సక్సెస్ మీట్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ తరహాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే గెలుపుపై శ్రేణుల్లో మరింత ధీమా, నమ్మకం కలిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకూ.. పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధం లేదని నొక్కి చెబుతున్నారు. దీంతో… ఎన్నికల ఫలితాల వేళ చంద్రబాబు చెప్పిన బ్యాడ్ న్యూస్ గా దీన్ని పలువురు భావిస్తున్నారని తెలుస్తుంది.

ఇలా ఎన్నికల ఫలితాల వేళ అనూహ్యంగా ఏపీ సీఎం జగన్ గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం.. టీడీపీ అధినేత ప్రతిష్టాత్మకమైన మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం పై ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది.