తెలుగు సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. కానీ, తెలుగు నాట సినిమా థియేటర్లు మూతబడిపోతున్నాయ్. మల్టీప్లెక్సులు కూడా విలవిల్లాడుతున్నాయి. ఎందుకీ పరిస్థితి.? ఓ వైపు సినీ ప్రముఖులు ఎడా పెడా మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించేస్తున్నారాయె.
సినిమాలు తీయలేకనా.? కాదు, కానీ సినిమాలు ఆడటంలేదు. వచ్చిన సినిమా వచ్చినట్టే బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోందాయె. నిఖార్సయిన హిట్టు వచ్చి ఎన్నాళ్ళయ్యింది తెలుగు సినిమా ఇండస్ట్రీకి.
ఈ సమ్మర్ సీజన్ పూర్తిగా రాజకీయాలతో ఖతమ్ అయిపోయింది. లేకపోతే పెద్ద సినిమాలు వచ్చేవేనేమో.! పెద్ద సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఏదీ అనుకున్న సమయానికి విడుదల కావడంలేదు. పైగా, ఒకదానితో ఇంకోటి క్లాష్.. అంటూ అన్ని సినిమాల్నీ వెనక్కి నెట్టేస్తున్నారు.
పరిశ్రమ పెద్దలు ఏం చేస్తున్నట్టు.? వాళ్ళు చెయ్యడానికీ ఏమీ లేదు. ఇది యాపారం. లాభ నష్టాల పంచాయితీ. పేరుకే పరిశ్రమంలో అంతా ఒక్కతాటిపై వుంటారన్నది. కానీ, ఎవరి గోల వారిదే.
‘హనుమాన్’ సినిమాని చంపేద్దామనుకున్నారు.. అదో మాన్‌స్టర్‌గా మారి, తన మీద కుట్ర పన్నిన సినిమాల్ని మింగేసింది సంక్రాంతికి.! ఏదిఏమైనా థియేటర్ల మూత అన్నది చాలా సీరియస్ అంశం. ఓటీటీ దెబ్బకి పరిశ్రమ విలవిల్లాడుతోంది. ఆ ఓటీటీ కూడా ఇప్పుడు నిర్మాతల్ని లెక్క చేయడం లేదాయె. తప్పెవరిది.? అదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు. తప్పు అందరిదీ.