లేటెస్ట్ సర్వే: తెలంగాణలో వైరల్ గా మారుతున్న రిపోర్ట్!

తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతుంది. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి. ఎన్నికలకు చివరి వారం కావడంతో జాతీయ స్థాయి నాయకులంతా తెలంగాణకు చేరుకుంటున్నారు. ఈ సమయలో తాజాగా న్యూస్ టాప్ తెలంగాణ స్టేట్ సర్వే నివేదిక తెరపైకి వచ్చింది. ఈ సర్వే ఫలితాలు ఏమి చెబుతున్నాయి.. ఎవరికి గుడ్ న్యూస్ చెబుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం!

న్యూస్‌ టాప్ తెలంగాణ స్టేట్ సర్వే నివేదిక హైదరాబాద్‌ లో విడుదల అయ్యింది. ఈ సర్వేని నవంబర్ 16 నుండి నవంబర్ 21 వరకు నిపుణులచే నిర్వహించబడినట్లు చెబుతున్నారు. సుమారు 1,19,000 శాంపుల్స్ ఆధారంగా సర్వే జరిగిందని.. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 చివరి తేదీ కాబట్టి ఈ సర్వేని నవంబర్ 16న ప్రారంభించినట్లు చెబుతున్నారు.

దీని ప్రకారం గత ఎన్నికలతో పోలిస్తే మెజారిటీ కాస్త తక్కువగా ఉన్నా.. అధికార బీఆరెస్స్ మరోసారి సొంతగా అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ గ్యారెంటీ అని చెబుతుంది. సరిగ్గా ఎన్నికలకు 8 రోజుల ముందు విడుదలైన ఈ సర్వే ప్రస్తుత ఓటరు అంతరంగాన్ని ప్రతిబింబించేలా ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఈ సర్వే ఫలితాల ప్రకారం… అధికార బీఆరెస్స్ కి 65 నుంచి 76 స్థానాలు రాబోతున్నాయని తెలుస్తుంది. ఇక రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కి 32 నుంచి 41 మధ్య సీట్లు వస్తాయని సర్వే సారాంశం. ఇదే క్రమంలో ఎంఐఎం కి 5 నుంచి 7 స్థానాలు, బీజేపీకి 3 నుంచి 4 స్థానాలు, సీపీఐ, బీఎస్పీ చెరొకచోట గెలిచేందుకు అవకాశం ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల సీఎం కేసీఆర్ విజయం సాధిస్తారని ఈ సర్వే చెబుతోంది. ఇక కొడంగల్ లో రేవంత్ రెడ్డి విజయం సాధిస్తారని ఈ సర్వే స్పష్టం చేసింది. హుజూరాబాద్ లో ఈటల గెలుస్తాడని తెలిపింది. కాంగ్రెస్ కి ఖమ్మంలో గరిష్టంగా స్థానాలు వస్తాయని ఈ సర్వే చెబుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానల్లో 6 కాంగ్రెస్ కి, 3 బీఆరెస్స్ కి వస్తాయని, ఖమ్మం టౌన్ లో పోరు హోరాహోరీగా సాగుతుందని తెలిపింది.

ఇక ఎంఐఎం పోటీ చేస్తున్న స్థానాల్లో ఈసారి నాంపల్లి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో పూర్తిగా కాంగ్రెస్ ఆధిపత్యం ఉందని చెబుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీపీఐ పోటీ చేస్తున్న కొత్తగూడేం స్థానంలో గెలిచే అవకాశాలున్నాయని సర్వే చెబుతుంది.

ఇదే సమయంలో సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరుపున పోటీచేస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గెలిచే అవకాశాలున్నాయని చెబుతుంది. ఇక ప్రధానంగా మంచిర్యాలు, నిర్మల్, బాల్కొండ, నారాయణఖేడ్, మల్కాజిగిరి, గద్వాల్, కల్వకుర్తి, షాద్‌ నగర్, మునిగోడు, ములుగు, ఖమ్మం నియోజకవర్గాల్లో బీఆరెస్స్ – కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోరు తప్పదని చెబుతుంది.