గాంధీ భవన్ లో ఘనంగా సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలు

యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ 72 వ  జన్మదినోత్సవ వేడుకలను ఆదివారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. టిపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన పుట్టినరోజు వేడుకల్లో టీపీసీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలకు తినిపించారు.

ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, దాన్ని సోనియా గాంధీ త్యాగం చేశారని  ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. అత్త ఇందిర, భర్త రాజీవ్ గాంధీల ఆశయసాధన కోసం సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చారన్నారు.

రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌, రైట్‌ టు ఎడ్యుకేషన్‌, జాతీయ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా పథకాలు తీసుకొచ్చేలా యూపీఏ ప్రభుత్వాన్ని సోనియా నడిపారని కితాబిచ్చారు. మరెన్నో చారిత్రాత్మక చట్టాలను తీసుకురావడంలో ఆమె కృషి మరవలేనిదన్నారు.

 ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నిఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అబిమానుల తరఫున సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.