ఎన్నికలు సమీపిస్తున్న వేళ బ్రదర్ అనిల్ కుమార్.. తూర్పుగోదావరి జిల్లాలో పాస్టర్ల సదస్సు ఏర్పాటు చేశారు! ఈ సందర్భంగా తాను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు అని అంటూనే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో… బైబిల్ లేఖనాలపై అవగాహన ఉన్నవారికి బ్రదర్ అనిల్… బలవంతుడైన గొల్యాతు తరహాలో జగన్ ను.. అతనితో పోలిస్తే శారీరకంగా అత్యంత బలహీనుడైన దావీదుగా వైఎస్ షర్మిళను పోలుస్తున్నారా అనే సందేహం కలగక మానదు!
అవును… బైబిల్ లేఖనాల ప్రకారం… ఫిలిష్తీయులు, ఇశ్రాయేలీయులను ముట్టడి చేస్తున్న సమయంలో… గొల్యాతు అను పేరుగల భారీ ఫిలిష్తీయుడు.. ఇశ్రాయేలీయుడు ఎవరైనా తనతో యుద్ధము చేయమని సవాలు చేశాడు. అందరికంటే పెద్దగా, ఎత్తుగా అతి భయంకరముగా ఉంటూ కత్తి, ఈటె, పెద్ద కవచాన్ని ధరించిన అతడితో యుద్ధము చేయడానికి ఎవరూ సాహసం చేయలేదు.
అయితే… దావీదు అనే గొఱ్ఱెలు కాసే బాలుడు.. గొల్యాతు యొక్క సవాలును విన్నాడు. అనంతరం… ఒక రాయిని తన ఒడిసెలతో విసరగా… ఆ రాయి గొల్యాతును నుదిటిపై తగులుతుంది. దీంతో ఆ భారీ వ్యక్తి నేలపై పడ్డాడు. ఒక కత్తి లేక ఆయుధము లేకుండా దావీదు గొల్యాతును ఓడించడానికి ప్రభువు సహాయపడ్డాడని ఇజ్రాయేలీయులు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. ఇది క్లుప్తంగా దావీదు – గొల్యాతు కథ!
ఆ సంగతి అలా ఉంచితే… తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా… గోకవరం మండలంలో పాస్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బలవంతుడిని ఓడించేందుకు దేవుడు ఎప్పుడూ బలహీనుడిని ఎంచుకుంటాడని చెప్పారు. ఏమీ తెలియని స్థితిలో ఉన్నపుడు ఓ ఉన్నతమైన పిలుపు ఇస్తాడని అన్నారు.
దీంతో… ఈయన రాజకీయాలు మాట్లాడటానికి తాను రాలేదు అంటూనే… రాజకీయంగా, ప్రజాభిమానం విషయంలో ఎంతో బలమైన వైఎస్ జగన్ ను.. తన భార్య ఓడించగలదని చెప్పే ఉద్దేశ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు పరిశీలకులు! దీంతో ఈ వ్యాఖ్యలు, అనంతరం బైబిల్ లేఖనాల ఆధారంగా వాటిపై జరిగిన విశ్లేషణ ఆసక్తిగా మారింది.
మరోవైపు ఈ వ్యాఖ్యలు విన్న వైసీపీ నెటిజన్లు మాత్రం… ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే రెండు సార్లు ఇలాంటి యుద్ధం జరిగిందని.. ఇందులో భాగంగా వైఎస్ జగన్ దావీదులా… నాడు అత్యంత బలంగా ఉన్న సోనియా గాంధీని ఎదుర్కొన్నారని, అనంతరం 2019లో 40 యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుని 23 సీట్లకు పరిమితం చేశారని.. ఇది అసలు సిసలు దావీదు – గొల్యాతు కథకు ఉదాహరణ అని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఏది ఏమైనా… అన్నా చెళ్లెళ్ల మధ్య జరుగుతున్నట్లు కనిపిస్తున్న పొలిటికల్ వార్ లో ఇప్పుడు బావమరిది కూడా ఎంట్రీ అయ్యారనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.