రాజకీయాల్లో పార్టీలు, వ్యక్తులు సర్వైవ్ కావాలి. పార్టీలు సర్వైవల్ కోసం ఎవరితోనైనా, చివరకు బద్ధ శత్రువులతో నైనా పొత్తులు పెట్టుకుంటున్నట్లే రాజకీయనాయకులు కూడా ఎలాంటి శష బిషలు లేకుండా పార్టీలు మారు తుంటారు, తనను ఓడించిన వ్యక్తితో చేతులు కలుపుతుంటటారు. ఇదొక ఒక వ్యూహం. అది సర్వత్రా జరుగుతున్నదే.
ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నపుడు చట్టం ఏమీ చేయలేకపోతున్నది. అందువల్ల మామూలు నేత పార్టీ మారితే ఏమవుతుంది?
మెల్లిగా పార్టీ మారడాలకు దానికి సొసైటీ కూడా ఆమోదం తెలిపుతూ ఉంది. ఫిరాయంచిన వాళ్లని ప్రజలు ఓడించిన దాఖలాలు తక్కువ. కాబట్టి ఎమ్మెల్యే అయినా, కాకపోయినా అవకాశం బట్టి పార్టీమారడం అనేది సర్వసాధారణం అయింది.
నిన్న టిఆర్ ఎస్ లోకి వచ్చిన గజ్వేల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి కి వర్తిస్తుంది. రెండు సార్లు (ఒకసారి టిడిపి నుంచి, రెండో సారి మొన్న కాంగ్రెస్ నుంచి) ఆయన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మొన్నటి దాకా కెసియార్ ను ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకోవాలని ఆశపడ్డారు. కాని వ్యవహారం తలకిందులయింది. రెండు పరాజయాలతో ఆర్థికంగా చితికిపోయారు. దానికి తోడు బోలేడు కేసులున్నాయి. ఇలాంటపుడు ఓడిపోయిన పార్టీని, క్యాడర్ని, తన సొంత సైన్యాన్ని పోషించాలంటే చాలా డబ్బులు కావాలి. ముఖ్యమంత్రి తో ఇంకా వైరం అంటే అర్థిక వనరులన్నీ మూసుకుపోతాయి. అపుడు సర్వైవల్ కష్టం.
దానికి తోడు తానేమో యుద్ధం చేసింది స్వయాన ముఖ్యమంత్రి కెసియార్ మీద. ఆయనను అనరాని మాటలన్నారు. ఇంతచేసినా ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. డెమోక్రసీలో ప్రజాభిప్రాయమే ముఖ్యం. ఎన్నికల్లో చావు దెబ్బతిన్నాక, ఇపుడే మవుతుంది?
ముఖ్యమంత్రి మౌనంగా ఉంటారా? ఉండరు. ముందు ముందు ఆయనకు గజ్వేల్ లో చుక్కలు కనబడతాయి. అందువల్ల ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురి కావడం కంటే, నియోజకవర్గం అభివృద్ధి అనే జోక్ తో టిఆర్ ఎస్ లో చేరిపోతే, ప్రతీకార చర్యలుండవు, కేసులు వీగిపోతాయి. రాజకీయంగా సర్వైవల్ సమస్య ఉండదు.
తానెందుకు పార్టీ మారాల్సి వచ్చిందొో ఆయన కాంగ్రెస్ నాయకులకు వివరించినట్లు చెబుతున్నారు. ‘ఆర్థికంగా బాగా చితికిపోయాను. ఇపుడు చనిపోతే, అంతిమసంస్కారాకు కూడా డబ్బుల్లేని పరిస్థితి,’ అని కాంగ్రెస్ నేతలతో ఆయన వాపోయినట్లు గాంధీ భవన్ లో చెప్పుకుంటున్నారు.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నిజంగానే గజ్వేల్ లో పలుకుబడి ఉన్నవాడు ఒంటేరు. ఆయనకు మంచి క్యాడర్ ఉంది, మంచి పేరుకూడా ఉండి. ఇది టిఆర్ ఎస్ కు ప్రయోజనం. అందుకే ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఇద్దరి సమస్య పరిష్కారం అయింది. ఒక్కదెబ్బతో అక్కడ కాంగ్రెస్ తుడిచి పెట్కు పోయింది.