షాకింగ్ న్యూస్… పదవికి రాజీనామా చేసిన టిఆర్ఎస్ నేత

తెలంగాణ ఎన్నికల ఫలితాలలో కారు జోరుతో దూసుకుపోయింది. అన్ని జిల్లాలలో మెజార్టీ స్థానాలు గెలుచుకొని విజయ ఢంకా మోగించింది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం టిఆర్ఎస్ చతికిలపడింది. ఖమ్మంలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం ఒక స్థానం మాత్రమే టిఆర్ఎస్ గెలుచుకుంది.

ఫలితాల తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ తమ నేతల తప్పిదం వల్లనే ఖమ్మం జిల్లాలో గెలవలేకపోయామన్నారు. ఖమ్మం జిల్లా నేతల పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు ముందే ఖమ్మం టిఆర్ఎస్ అధ్యక్షుడు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత ఖమ్మంలో కీలక నేతలంతా టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లాలో ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ డిసిసిబి చైర్మన్ పదవికి మువ్వా విజయ్ రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ విషయం టిఆర్ఎస్ లో, ఖమ్మం రాజకీయాలలో చర్చనీయాంశమైంది. తెలంగాణ అంతటా గెలిచి సంబరాలు చేసుకుంటుంటే ఖమ్మం నేత తన పదవికి రాజీనామా చేయడం పై పార్టీలో చర్చ జరుగుతోంది.

మువ్వా విజయ్ కుమార్ ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ గా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో విజయ్ కుమార్ కు టిఆర్ఎస్ యువ నాయకునిగా పేరుంది. మంత్రి కేటిఆర్ తో కూడా విజయ్ కుమార్ కు సత్సంబంధాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పోటి చేయాలని భావించినట్టు తెలుస్తోంది. కానీ కేటిఆర్ వద్దని చెప్పడంతో ఆయన ఆగిపోయారట.   ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం పని చేయాలని ఆయనకు కేటిఆర్ సూచించారు. దీంతో పార్టీ గెలుపు కోసం ఆయన గత రెండు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేశారు.

మువ్వా విజయ్ బాబు

కేసీఆర్, కేటిఆర్ సభల  ఏర్పాట్లలో మువ్వా విజయ్ కీలక పాత్ర పోషించారు. సభ విజయవంతం అయ్యేలా ప్రణాళికలు చేశాడు. నేతలందరిని సమీకరించి పార్టీ ప్రచారం చేశాడు. జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఆ బాధ్యతంతా విజయ్ కుమార్ చూసుకున్నారు. పార్టీ కోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం రాకపోవడం పై ఆయన అసంతృప్తికి గురయ్యారు.

కేటిఆర్ తనకు బాధ్యతలు అప్పగించినా తాను సరిగా నిర్వర్తించలేకపోయానని సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉంటూ పార్టీ అభ్యర్దులకు వ్యతిరేకంగా పనిచేసిన వారి వల్లే ఓటమి పాలయ్యామన్నారు. పార్టీలోని వారి వల్లే ఓడిపోయామని అందుకు నైతికంగా తన డిసిసిబి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని మువ్వా విజయ్ బాబు ప్రకటించారు.

మువ్వా విజయ్ బాబు ప్రకటనతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తెలంగాణలో పార్టీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఖమ్మం జిల్లా నాయకుడు తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. తన సన్నిహితులు వద్దని వారించినా వినకుండా విజయ్ బాబు తన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఖమ్మంలో కీలక నేత, మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓటమి పాలయ్యారు. తెలంగాణ అంతటా ప్రజా తీర్పు ఒకలా ఉంటే, ఖమ్మంలో ప్రజా తీర్పు మరోలా వచ్చింది.