టిఆర్ఎస్ ఎంపీగా బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి

ఆయన నిన్న మొన్నటి వరకు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. జిల్లా రాజకీయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన చెప్పిందే వేదంగా నడిచింది. ఆయన మంత్రి వర్గంలో ఉండడంతో అటు ప్రభుత్వంలోనూ ఇటు రాజకీయంలోను చక్రం తిప్పారు. మంత్రి కేటిఆర్ కు చాలా సన్నిహితంగా ఉంటారు. కానీ అనూహ్యంగా ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకు మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావించారని తెలుస్తోంది. కానీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి వస్తే ఓడిపోయిన మరో ముగ్గురు మంత్రుల నుంచి కూడా ఒత్తిడి వస్తదన్న ఉద్దేశ్యంతో ఆయనను ఎంపీగా బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరంటే రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్నం మహేందర్ రెడ్డి. పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కేబినేట్ లో స్థానం సంపాదించుకున్నారు. రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి కూటమి అభ్యర్ధి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 

పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కొడంగల్ లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై నరేందర్ రెడ్డి గెలుపొంది అందరిని ఆశ్చర్య పరిచారు.   

పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోవడంతో ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు అందరిలో చర్చనీయాంశమైంది. మంత్రిగా, రంగారెడ్డి జిల్లా రాజకీయంలో చక్రం తిప్పిన నేత ఓటమి పాలు కావడంతో టిఆర్ఎస్ వర్గాలు షాకయ్యారు. చేవేళ్ల ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో చేవేళ్ల ఎంపీ స్థానం ఖాళీ అయ్యింది. వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో మొత్తం నలుగురు మంత్రులు ఓడిపోయారు. అందులో ముఖ్యమైన వారు తుమ్ముల నాగేశ్వరరరావు, జూపల్లి కృష్ణారావు.

పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం ఇస్తే వీరికి కూడా అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందన్న ఉద్దేశ్యంతో పట్నం మహేందర్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వాలని గులాబీ దళపతి నిర్ణయించారట. చేవేళ్ల ఎంపీగా బరిలోకి దిగాలని దానికి ఇక ప్రిపేర్ అయి ఉండాలని ఇప్పటికే మహేందర్ రెడ్డికి టిఆర్ఎస్ వర్గాలు సమాచారమిచ్చాయని తెలుస్తోంది. దానికి కూడా పట్నం మహేందర్ రెడ్డి అంగీకారం తెలిపి ఎంపీగా బరిలోకి దిగుతానని తెలిపారట. దీంతో ఇక ఆ మాజీ మంత్రి ఎంపీగా పోటి చేయడానికి రెడీ అయ్యారు.