తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల తారక రామారావు కొద్ది నిమిషాల కిందట బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ భవన్ లో పండగ వాతావరణం మధ్య వేదపండితుల ఆశీర్వచనాలతో కేటీఆర్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ కు హోంమంత్రి మహమూద్ అలీ, పలువురు మాజీ మంత్రులు, శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పద్మారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.
బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి మీదుగా తెలంగాణ కళాకారుల ఆటపాటలు, నృత్యాల మధ్య ఆయన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.
కెటియార్ గురించి క్లుప్తంగా …
కెటియార్ గా పేరుపడిన కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ఉద్యమంతో ప్రజాజీవితంలోకి వచ్చారు. అమెరికాలో ఉన్నతోద్యోగం వదిలేసి ఉద్యమంలో క్రియా శీల పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వర్తించేందుకు 2006లో హైదరాబాద్ కు వచ్చారు. 2006 నుంచి 2009 వరకు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం 2009 ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పిలుపుతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డిపై 68,220 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరు రవీందర్ రావుపై కేటీఆర్ 53,004 ఓట్ల మెజార్టీతో గెలిచి సిరిసిల్ల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 89,009 ఓట్ల మెజార్టీతో కేటీఆర్ విజయ కేతనం ఎగురవేశారు.
2014 ఎన్నికల తర్వాత కెసియార్ ప్రభుత్వంలో ఆయన ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. కేటీఆర్ పని సామర్థ్యాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకొని ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ జిహెచ్ ఎంసి ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయం తెప్పించడం ఆయన శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి.
ఈ ఎన్నికల పార్టీ గెలుపునకు తీవ్రంగా కృషి చేసినందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు.
తెలంగాణ రాష్ట్ర సమితిపై పూర్తి పట్టు ఉన్న కేటీఆర్ ఇప్పటికే పార్టీ పటిష్టతకు అనేక రకాలుగా కృషి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తనకిచ్చిన బాధ్యతను భుజాలపై వేసుకొని పార్టీని పూర్తిస్థాయి మెజార్టీతో గెలిపించిన నాడే పార్టీ ఆచన అదీనంలోకి వచ్చిందనాలి. అలాగే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తను ఇంచార్జిగా వ్యవహరించిన నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని ప్రశంలందుకున్నారు.
రాబోయే రోజుల్లో పార్టీని సమర్థవంతంగా, క్రమశిక్షణతో నడిపించి పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకే కేసియార్ ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు.
కొత్త అలోచనలున్న నేతగా పేరు తెచ్చుకున్న కేటీఆర్ ప్రసంగాలకు, ప్రెజేంటేషన్లకు మంచి పేరొచ్చింది. దీనితోనే ఆయనను భవిషత్ ముఖ్యమంత్రి అనే పేరు వచ్చింది.
ప్రత్యేక తెలంగాణ కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుస్థాపించారు. అమెరికాలో ఉన్న కేటీఆర్..
కేటీఆర్ 1976, జులై 24న కేసీఆర్, శోభా దంపతులకు జన్మించారు. కేటీఆర్ సోదరి ఎంపీ కవిత. ఇక కేటీఆర్ కు భార్య శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య ఉన్నారు. రామారావు కరీంనగర్, హైదరాబాద్ లో విద్య నభ్యసించారు. ఆయన డాక్టర్ కావలసి ఉండింది.
కర్ణాటకలోని ఓ మెడికల్ ఆయన సీటు వచ్చింది. అయితే, ఎందుకో చేరలేదు.మెడిసిన్ కు బదులుగా నిజాం కాలేజీలో బీఎస్సీ(మైక్రో బయాలజీ) పూర్తి చేశారు. పుణే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ పూర్తి చేసి అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి మేనేజ్ మెంట్ అండ్ ఈకామర్స్ లో ఎంబీఏ అభ్యసించారు. అనంతరం అమెరికాలోని ఇంట్రా అనే సంస్థలో ఐదేళ్ల పాటు ప్రాజెక్టు మేనేజర్ గా ఉద్యోగం చేశారు.