రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల ప్రాణాలకు కనీస రక్షణ కరువైందనే విమర్శలకు అద్దం పడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. గురుకులంలో చదువుతున్న విద్యార్థినులలో ఒక్కసారిగా 44 మందికి పైగా.. మొత్తంగా రెండు రోజుల్లో 110 మంది వరకు.. తీవ్ర అస్వస్థతకు గురై జ్వరం, వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు బారిన పడ్డారు.
అయితే, ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థినులు అనారోగ్యం పాలైనా విద్యాశాఖ, పాఠశాల అధికారులు విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అత్యంత గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. గురువారం సాయంత్రం విద్యార్థినులు ఒకేసారి అస్వస్థతకు గురవడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది అత్యవసరంగా వారిని సమీపంలోని కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకుండా, ఏకంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాదలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. అసలు తమ పిల్లలకు ఏమైంది..? పెద్ద ఆస్పత్రికి కాకుండా చిన్న పీహెచ్సీకి తరలించి రహస్యంగా ఎందుకు ఉంచారు..? కల్తీ ఆహారం లేదా కలుషిత తాగునీరు వల్లే ఇలా జరిగిందా..? అని స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అంతేకాకుండా, సుమారు 60 మంది వరకు జ్వరపీడితులను ఒకే గదిలో ఉంచి వైద్యం అందించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ గురుకులంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అక్టోబరులో కూడా ఇదే కురుపాం గురుకులంలో 146 మందికి పైగా విద్యార్థినులు ఒకేసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పట్లో సరైన సమయంలో స్పందించకపోవడం, వైద్య సేవల్లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు విద్యార్థినులు మరణించిన చేదు అనుభవం ఉంది. గతేడాది అంత పెద్ద విపత్తు జరిగినా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ, విద్యా, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కానీ గురుకులాల పర్యవేక్షణను గాలికొదిలేశారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. కనీస మౌలిక వసతులు, పరిశుభ్రత కరువవడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి దారుణాలు పునరావృతమవుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ స్పందించి సమగ్ర నివేదిక కోరారు. తుఫాను అనంతర వాతావరణ మార్పుల వల్ల వైరల్ జ్వరాలు వచ్చాయని అధికారులు ప్రాథమికంగా చెప్తుండగా, తాగునీరు, ఆహార నమూనాలను పరీక్షల కోసం సేకరించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందాలు గురుకులం వద్దే మొహరించి చికిత్స అందిస్తున్నప్పటికీ, విద్యార్థుల ఆరోగ్యం మరియు వివరాలను తల్లిదండ్రులకు ముందుగానే తెలియజేయకుండా దాచడం వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.