కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్

దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని శుక్రవారం మధ్యాహ్నం టిఆర్ఎస్ ఎంపీలు పరిశీలించనున్నారు. ఎంపీలతో పాటు వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ కూడా స్థలాన్ని పరిశీలించనున్నారు.

ఎంపీలు స్థలాలను పరిశీలించిన తర్వాత కేసీఆర్ అందులో ఒక స్థలాన్ని ఎంపిక చేయనున్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వెయ్యి గజాల స్థలం కేటాయించే అవకాశం ఉంది. సంక్రాతి తర్వాత శంకుస్థాపన చేసి రెండు మూడు నెలల్లోనే కార్యాలయాన్ని పూర్తి చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

దేశ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జాతీయ స్థాయిలో పరిస్థితులు మారుతున్నాయి. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వివిధ పార్టీల నేతలను  ఆయన ఇప్పటికే కలిశారు. ఎన్నికల సమయానికి పార్టీ కార్యాలయం సిద్దం కావాలని ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

కేసీఆర్ ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంతో టిఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచిందని చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాలలో టిఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించనుందనే చర్చ జోరందుకుంది. ఫెడరల్ ఫ్రంట్ లో కలిసి వచ్చే పార్టీలు ఏవో ఇప్పటి వరకైతే స్పష్టత లేదు కానీ ఖచ్చితంగా ఎన్నికల నాటికి అన్ని పార్టీలు వచ్చి చేరుతాయనే ధీమాలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. పార్టీ కార్యాలయం నిర్మించనుండడంతో ఇక కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనున్నారనే చర్చ జరుగుతోంది.