మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి 2+2 భద్రతను కొనసాగించాలని హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. వారి భద్రతను అత్యవసరంగా ఉపసంహరించడానికి కారణాలేంటో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరో నాలుగు వారాల పాటు వారికి భద్రతను కల్పించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. వారికి భద్రతను కల్పించాలని ఆదేశిస్తూ జస్టిస్ రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
జనవరి 1 నుంచి కొండా సురేఖ దంపతులకు పోలీసులు భద్రత ఉపసంహరించారు. దీంతో కొండా సురేఖ, మురళీ వేరువేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపును న్యాయవాది రఘువీర్ రెడ్డి వాదనలు వినిపించారు. సురేఖ 1999లో ఎమ్మెల్యేగా గెలిచారని అప్పటి నుంచి ఆమెకు భద్రత ఉందన్నారు. రాజకీయ ప్రత్యర్దులు, నక్సల్స్ నుంచి కొండా సురేఖ కు ప్రాణహాని ఉందన్నారు. మురళీ కి కూడా ప్రాణహాని ఉందని తెలియజేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయాన అధికార పార్టీ నుంచి వీరు బయటికి వచ్చారని దానిని దృష్టిలో పెట్టుకొని వీరి భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిందని ఆయన వాదించారు.
ప్రభుత్వం తరపున న్యాయవాది శరత్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్లు గతంలో ప్రజాప్రతినిధులు గా ఉన్నారని అందుకే వారికి భద్రత కల్పించామన్నారు. ఇటివల అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ ఓడిపోయారని అందుకే వారి భద్రత ఉపసంహరించామన్నారు. పిటిషనర్ల పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని అందుకే భద్రత తొలగించామన్నారు.
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు వారికి మరో నాలుగు వారాల పాటు భద్రత కొనసాగించాల్సిందేనని పోలీసులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 21 కి వాయిదా వేసింది.